తెలుగమ్మాయి.. చెన్నైకి వచ్చేయి

ABN , Publish Date - Oct 07 , 2026 | 10:21 PM

తెలుగు, తమిళ హీరోయిన్లంటూ స్పెషల్‌గా ఎవరూ లేరు. అక్కడివారు ఇక్కడ.. ఇక్కడి వారు అక్కడ’.. ఇది ఒకప్పటి మాట. ‘టాలీవుడ్‌లో కెరీర్‌ డల్‌ అయితే.. ఛలో కోలీవుడ్‌’.. ఇది నిన్నటి మాట.

Telugu Heroines Craze in Kollywood

తెలుగు, తమిళ హీరోయిన్లంటూ స్పెషల్‌గా ఎవరూ లేరు. అక్కడివారు ఇక్కడ.. ఇక్కడి వారు అక్కడ’.. ఇది ఒకప్పటి మాట. ‘టాలీవుడ్‌లో కెరీర్‌ డల్‌ అయితే.. ఛలో కోలీవుడ్‌’.. ఇది నిన్నటి మాట. ‘సినిమాల్లో నాయికలుగా ఎక్కడెక్కడివారో ఎందుకు? పదహారణాల తెలుగమ్మాయిలు ఉన్నారుగా’.. లేటెస్ట్‌గా మెరీనా తీరంలో వినిపిస్తున్న మాట. ‘తెలుగమ్మాయి.. చెన్నైకి వచ్చేయి’ అనడంలో అంతరార్థం ఏమై ఉంటుంది? పాన్‌ ఇండియా సంస్కృతి సరిహద్దులు దాటుతున్న ఈ సమయంలో బిజినెస్‌ లెక్కలు కూడా అంతే వేగంగా మారుతున్నాయి. లోకల్‌లో మార్కెట్‌ ఉన్న హీరో, ఏ భాషవారైనా గుర్తుపట్టగలిగే నాయిక.. అంటూ సక్సెస్‌ఫుల్ సినిమాకి కేరాఫ్‌గా సరికొత్త స్ట్రాటజీస్‌ కనిపిస్తున్నాయి. అందులో భాగంగా తెలుగులో పేరు తెచ్చుకున్న బాలీవుడ్‌ భామలకే కాదు, అచ్చ తెలుగు నాయికలకు (Telugu Heroines) కూడా కోలీవుడ్‌ (Kollywood) నుంచి కాల్స్‌ వస్తున్నాయి.

కథాబలం ఉంటే..

కథాబలం ఉన్న సినిమాల్లో మన నాయికలకు తమిళనాట అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అంజలి, ఐశ్వర్యా రాజేష్‌, ఆనంది వంటి వారు వరుస అవకాశాలను అక్కడ అందిపుచ్చుకోవడంలో అసలు రహస్యం అదే. కెమెరా ముందు గ్లిజరిన్‌ లేకుండా కన్నీరు పెట్టి, ప్రేక్షకుల మనసులను ద్రవింపజేసే సత్తా ఉన్న మన నాయికలను అక్కడి రెడ్‌ కార్పెట్‌ రా రమ్మని ఆహ్వానిస్తోంది.


ఓటీటీల్లో ప్లస్‌..

హీరోకి కాస్త పేరుండి పాన్‌ ఇండియా రేంజ్‌లో, కనీసం సౌత్‌ ఇండియాలో అయినా సినిమాను రిలీజ్‌ చేసుకోవాలనుకున్నప్పుడు, తమిళ దర్శకుల తొలి ఛాయిస్‌గా తెలుగు భామల పేర్లు వినిపిస్తున్నాయి. థియేట్రికల్‌ రిలీజులకు సంబంధించే కాదు, ఓటీటీ డీల్స్‌ కుదిరేటప్పుడు కూడా తెలుగు హీరోయిన్ల ఫేస్‌ వేల్యూ ప్లస్‌ అవుతోందన్నది ఒప్పుకోవాల్సిన విషయం.

వైవిధ్యానికి కేరాఫ్‌!

కథలో ఏమాత్రం వైవిధ్యం ఉన్నా తెలుగు హీరోయిన్లను తీసుకోవడానికే మొగ్గుచూపుతున్నారు మేకర్స్‌. ‘పరాశక్తి’ చిత్రంలో శ్రీలీలను నాయికగా తీసుకున్నప్పుడు అందరూ వావ్‌ అనుకున్నారు. అయితే స్క్రీన్ మీద ఆమె తెలుగు మాటలు విన్నాక తమిళ తంబిలు కూడా కేక అన్నారు. అంతగా కేరక్టర్‌ని పండించారు శ్రీలీల. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ రెండు భాగాల్లోనూ శోభిత ధూళిపాల కేరక్టర్‌కి మంచి మార్కులు పడ్డాయి. ఎం.ఎస్.సుబ్బులక్ష్మిగా ఎందరి పేర్లు తెరమీదకు వచ్చినా, ఫైనల్‌గా ఆ పాత్రకు ప్రాణం పోయడానికి ముందుకొచ్చింది మన తెలుగింటి కోడలు రష్మిక దేవరకొండ.


ఫుల్‌ కమర్షియల్‌గా...

ఫుల్‌ కమర్షియల్‌ చిత్రాల్లోనూ కోలీవుడ్‌లో మన వారు ప్రూవ్‌ చేసుకుంటూనే ఉన్నారు. బాగా డ్యాన్సులు చేస్తారనే పేరున్న ధనుష్‌తో స్టెప్పులేయడానికి లేటెస్ట్‌గా శ్రీలీల రెడీ అయ్యారు. ఆర్యతో కలిసి నటిస్తున్నారు వైష్ణవి చైతన్య. సమంత నటిస్తున్న తెలుగు సినిమాలను తమిళ ప్రేక్షకులు వారి సొంత సినిమాల్లాగానే రిలీజు రోజు థియేటర్లలో చూస్తున్నారు. శ్రీదివ్య, చాందిని చౌదరి, మేఘా ఆకాష్‌, బిందు మాధవి, మానసా వారణాసి, ప్రీతి అశ్రాని, శ్రీ గౌరి ప్రియ, శాన్వీ మేఘన లాంటి నటీమణులను అడపాదడపా కేరక్టర్స్‌ పలకరిస్తూనే ఉన్నాయి. తనకు తమిళ టాప్‌ డైరక్టర్ల మూవీస్‌లో మెండుగా అవకాశాలు వస్తున్నాయని ఆ మధ్య ఓపెన్‌ అయ్యారు తెలుగమ్మాయి కామాక్షి భాస్కర్ల. ఇప్పుడిదే ట్రెండ్‌!

మన దగ్గర ప్రూవ్‌ చేసుకుని తమిళంలో అడుగుపెడుతున్న వారు కొందరైతే, మరికొందరు ముందు కోలీవుడ్‌లోనే లిట్మస్‌ టెస్ట్‌ పాస్‌ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి:

మంచి పాత్రలు రాకే.. మానేసి ఆ పని చేస్తున్నా: ఎల్.బి. శ్రీరామ్

Fauzi: ప్రభాస్ బర్త్‌‌డే ట్రీట్.. మూడు నిమిషాల అరాచకం

మోక్షజ్ఞ మూవీ ఓపెనింగ్ అప్పుడేనా?.. అయితే ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా

Updated Date - Oct 07 , 2026 | 10:31 PM