Raaka: అల్లు అర్జున్ ‘రాకా’.. తమిళ సినిమాగా ప్రచారం అందుకేనా?

ABN , Publish Date - Oct 07 , 2026 | 10:59 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో తమిళ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తోన్న ‘రాకా’ విశేషాల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకూ ‘రాకా’ తమిళ సినిమానా? తెలుగు చిత్రమా? అనే డౌట్ వస్తోంది.

Allu Arjun Raaka Movie Update

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)తో తమిళ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తోన్న ‘రాకా’ (Raaka) విశేషాల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకూ ‘రాకా’ తమిళ సినిమానా? తెలుగు చిత్రమా? అనే డౌట్ వస్తోంది. ఎందుకలాగా అంటే కొన్ని విషయాలు అలాగే ఉన్నాయి మరి. ఆ ముచ్చటేంటో చూద్దాం.

అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ (Sun Pictures) నిర్మిస్తోన్న ‘రాకా’ అత్యంత భారీ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న అట్లీ (Atlee), నిర్మిస్తోన్న సన్ పిక్చర్స్ సంస్థ కూడా తమిళ సినిమా రంగానికి చెందినవారే. అందువల్ల తెలుగు హీరోతో తెరకెక్కుతోన్న తమిళ చిత్రంగా ‘రాకా’ను భావిస్తున్నారు. కొందరు తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న చిత్రంగానూ ‘రాకా’ను అభివర్ణిస్తున్నారు. తెలుగు స్టార్‌తో తమిళ మేకర్స్ నిర్మిస్తోన్న ‘రాకా’ సినిమా కోసం అమెరికన్ టెక్నీషియన్స్ పనిచేస్తూ ఉండడం విశేషం. కాబట్టి ఈ మూవీ ఏ లాంగ్వేజ్‌కు చెందింది అనేది అసలు ప్రశ్న కాదనీ కొందరు అంటున్నారు. అయితే ఒరిజినల్ అంటూ ఏదో ఒక భాష ఉండాలి కదా. అంటే ‘రాకా’ తమిళ చిత్రమే అని అధిక సంఖ్యాకులు చెబుతున్నారు. అంతేకాకుండా, ఈ చిత్రాన్ని ఆస్కార్ అవార్డ్స్ బరిలోనూ నిలిపే యోచనతో మేకర్స్ ఉన్నారట. ఆ కోణంలో చూసినా తమిళ సినిమా రంగానికి గర్వకారణంగా ‘రాకా’ను తీర్చిదిద్దే ప్రయత్నం సాగుతోందని టాక్. పైగా ఇప్పటికే రీజనల్ లాంగ్వేజెస్‌లో తెలుగు సినిమా ‘ట్రిపుల్ ఆర్’తో ఆస్కార్ అవార్డు పట్టేసింది. ఈ నేపథ్యంలోనే ‘రాకా’ మేకర్స్ తమిళ సినిమాకు కూడా ఓ అకాడమీ అవార్డు సంపాదించి పెట్టే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తమిళ చిత్రంగానే ప్రకటిస్తున్నారట.


ఈ మధ్య మన తెలుగు నిర్మాతలు తమిళ స్టార్స్‌తో చిత్రాలు నిర్మిస్తున్నా, వాటిని తమిళ సినిమాలుగానే ప్రకటిస్తున్నారు. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ‘వారిసు’ కూడా తమిళ సినిమాగానే వెలుగు చూసింది. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘సార్, విశ్వనాథ్ అండ్ సన్స్’ రెండు చిత్రాలను తమిళ మూవీస్ గానే ప్రకటించారు. ఈ రెండు చిత్రాల్లో ఒకదానిలో ధనుష్, మరోదానిలో సూర్య హీరోలుగా నటించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సునీల్ నారంగ్, రామ్మోహనరావు, కైకాల అజయ్ నిర్మించిన ‘కుబేర’ను కూడా తమిళ సినిమా అనే చెప్పారు. ఇందులో మన నాగార్జున కీలక పాత్ర పోషించినప్పటికీ, ధనుష్ హీరోగా నటించడం వల్ల తమిళ సినిమాగానే ప్రకటించారు. అంతెందుకు ‘బాహుబలి- ద కంక్లూజన్’ను తమిళ జనాన్ని ఆకట్టుకోవడానికి అన్నట్టుగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించామని మేకర్స్ ప్రకటించుకున్నారు. దీనిని బట్టి తెలుస్తున్నదేమిటంటే - తమిళనాట జనాన్ని ఆకట్టుకోవాలంటే ఎవరు ఎవరితో తీసినా, అది తమిళ చిత్రం అనే కలర్ పూయవలసిందే.. లేకుంటే అంతే సంగతులు అని తెలుస్తోంది. ఈ కోణంలో చూస్తే ‘రాకా’ను తమిళ చిత్రంగా ప్రకటించడమే నిర్మాతకు మేలని ట్రేడ్ సర్కిల్స్ భావిస్తున్నాయి.


తమిళ నిర్మాతలు తెలుగు స్టార్స్‌తో సినిమాలు తీయడం మానేసి చాలా ఏళ్ళయింది. అడపా దడపా ‘ఏవీయమ్’ సంస్థనే తెలుగువారితో కలసి చిత్రాలను నిర్మించింది. ఈ మధ్య కాలంలో తమిళ నిర్మాత కె.ఇ. జ్ఞానవేల్ రాజా ఒక్కరే తెలుగు హీరోలతో ‘నోటా, బడ్డీ’ వంటి చిత్రాలు నిర్మించారు. దాదాపు 30 ఏళ్ళ క్రితం నాగార్జున హీరోగా కుంజుమోన్ భారీగా ‘రచ్చగన్’ తమిళ సినిమాను తెరకెక్కించారు. అంతకు మించి తెలుగు స్టార్స్‌తో సాగిన తమిళ నిర్మాతలు ఈ మధ్య కనిపించడం లేదు. ఇన్నాళ్ళకు అల్లు అర్జున్‌తో సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ‘రాకా’ నిర్మిస్తున్నారు. అందులోనూ అత్యంత భారీ వ్యయంతో రూపొందుతోన్న తమిళ చిత్రంగా ‘రాకా’ను ప్రచారం చేస్తున్నారు. పైగా వీఎఫ్ఎక్స్ లో ఇప్పటికే ‘రాకా’ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. కాబట్టి, ఈ సినిమాను తమిళ సినిమాగానే ప్రకటించినా, తెలుగువారేమీ ఆవేదన చెందరు.. ఎందుకంటే ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టం కట్టే సుగుణం తెలుగువారికే ఉందని అందరికీ తెలుసు. చాలా ఏళ్ళ తరువాత తెలుగు టాప్ స్టార్‌తో తమిళ స్టార్ ప్రొడ్యూసర్ నిర్మిస్తున్న ‘రాకా’ ఏ తీరున అలరిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

తెలుగమ్మాయి.. చెన్నైకి వచ్చేయి

మంచి పాత్రలు రాకే.. మానేసి ఆ పని చేస్తున్నా: ఎల్.బి. శ్రీరామ్

Fauzi: ప్రభాస్ బర్త్‌‌డే ట్రీట్.. మూడు నిమిషాల అరాచకం

Updated Date - Oct 07 , 2026 | 10:59 PM