భారతీయుడు.. ముచ్చటగా మూడోసారి వస్తున్నాడు

ABN , Publish Date - Oct 07 , 2026 | 09:21 PM

లోకనాయకుడు కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Indian 3

లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan), దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 (Indian 2) వస్తోంది అన్నప్పుడు.. ఇండస్ట్రీ మొత్తం ఎంతగానో ఎదురుచూసింది. సేనాపతి మళ్లీ వస్తున్నాడు అంటే ఈసారి శంకర్ అదరగొట్టేస్తాడు అనుకున్నారు. రెండేళ్ల క్రితం ఎన్నో అంచనాల నడుమ ఇండియన్ 2 రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకుంది. అరేయ్ ఇదేం సినిమారా అంటూ ప్రేక్షకులు తలలు పట్టుకున్నారు. ఇక చివర్లో ఇండియన్ 3 కూడా ఉందని మేకర్స్ ప్రకటించారు. కానీ, సెకండ్ పార్ట్ ఇంత పరాజయాన్ని అందుకున్నాక ఇండియన్ 3 మీద అందరూ ఆశలు వదులుకున్నారు. ఈ సినిమా ఆగిపోయిందని ప్రచారం కూడా జరిగింది.


అయితే ఊహించనివిధంగా భారతీయుడు.. ముచ్చటగా మూడోసారి సందడి చేయడానికి రాబోతున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అక్టోబర్ 8ఉదయం 11:45 గంటలకు ఒక క్రేజీ అప్‌డేట్ ఇవ్వబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో సోషల్ మీడియాలో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ అప్‌డేట్‌లో లైకా ప్రొడక్షన్స్ ఇండియన్ 3 ప్రపంచవ్యాప్త థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను ప్రకటించనుందని ఫ్యాన్స్, సినీ విశ్లేషకులు గట్టిగా ఊహిస్తున్నారు. ఇటీవల బయటకు వచ్చిన టీజర్ విజువల్స్ గమనిస్తే.. పవర్ ఫుల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్, రగ్గడ్ లోకేషన్లు, ఓ ధీర యోధా తరహా సాంగ్ లిరిక్స్‌తో విజువల్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతి మూలాల కథను ఈ మూడో భాగంలో చాలా పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నారని టాక్ నడుస్తోంది.


ఇండియన్ 2తో పోలిస్తే ఇందులో యాక్షన్, ఎమోషన్స్ ఎక్కువ స్థాయిలో ఉంటాయని మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, ఎస్.జె. సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం గతంలో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతుందనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్‌కే చిత్రబృందం మొగ్గు చూపడం ఫ్యాన్స్‌కి పెద్ద ఊరటనిచ్చింది. మరి ఈ అప్డేట్ ఇండియన్ 3 గురించేనా.. లేక ఇంకేదైనా ప్రాజెక్టు గురించా అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Oct 07 , 2026 | 09:21 PM