'పెద్ది' మేకింగ్ లో సుకుమార్ సలహాలు - సూచనలు
ABN, Publish Date - Jun 09 , 2026 | 12:44 PM
శిష్యులను దర్శకులుగా పరిచయం చేసిన గురువులు మనకు కొత్తకాదు. అలానే శిష్యుడి సినిమాలకు విలువైన సలహాలు ఇచ్చిన గురువులూ తెలుగు సినిమా రంగంలో అనేకమంది ఉన్నారు.
సరైన గురువు లభించిన శిష్యులదే అదృష్టం - ప్రతిభగల శిష్యులు దొరికిన గురువులకే కీర్తి- ఈ మాటలు ఎప్పటి నుంచో వింటున్నాం. చిత్రసీమలోనూ అలా సాగిన గురుశిష్యులున్నారు. తాజాగా 'పెద్ది' విషయంలోనూ గురుశిష్యుల అనుబంధం భలేగా సాగిందని ఫ్యాన్స్ అంటున్నారు.
ఇప్పుడు శిష్యుడు... అప్పుడు గురువు....
'పెద్ది' సినిమా రామ్ చరణ్ కెరీర్‌లోనే బిగ్ హిట్ అంటున్నారు. ఈ మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సానాను పలువురు అభినందిస్తున్నారు. రామ్ చరణ్‌లోని అసలైన నటుణ్ణి బుచ్చిబాబు వెలికి తీశారనీ చెబుతున్నారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు గురువు డైరెక్టర్ సుకుమార్‌ను కూడా పలువురు గుర్తు చేసుకోవడం విశేషం! ఇంతకు ముందు సుకుమార్ డైరెక్షన్‌లో రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' 2018 బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలచింది. ఆ సినిమాకు బుచ్చిబాబు అసోసియేట్ గా పనిచేశారు. 'రంగస్థలం'లో రామ్ చరణ్ చిట్టిబాబు పాత్రలో భలేగా మెప్పించారు. ఇప్పుడు 'పెద్ది' సినిమా చూసినవాళ్ళు 'రంగస్థలం'లో రామ్ చరణ్ అలరించిన తీరును గుర్తు చేసుకోవడం విశేషం.
'రంగస్థలం'లో చెవిటి మాలోకం చిట్టిబాబుగా రామ్ చరణ్ ప్రదర్శించిన నటన ప్రేక్షకులను భలేగా ఆకట్టుకుంది. ఇప్పుడు 'పెద్ది'లోనూ క్రికెటర్, రెజ్లర్, రన్నర్- మూడు విధాలుగా చెర్రీ అలరించిన తీరును విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. ఇందులో ఓ మొరటోడిగా, ఊరికోసం పోరాడే త్యాగశీలిగా, అందమైన అమ్మాయిని ఆరాధించే ప్రేమికునిగా రామ్ చరణ్ పాత్రలో పలు షేడ్స్ చూపించారు. అన్నిటినీ కలిపి 'పెద్ది' పాత్రలో రామ్ చరణ్ జీవించేశారు.
ఆ రోజుల్లోనూ...
'పెద్ది' రిలీజ్ కాగానే చూసినవారు డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో పాటు ఆయన గురువు సుకుమార్ ను కూడా గుర్తు చేసుకోవడం ప్రస్తుతం విశేషంగా మారింది. ఈ సినిమా కథను రూపొందించాక తన గురువు సుకుమార్ సలహాలు సూచనలు కూడా బుచ్చిబాబు తీసుకున్నట్టు తెలుస్తోంది. అందువల్లే 'పెద్ది' కేరెక్టర్ ను జనం మెచ్చేలా రూపొందించగలిగారని సమాచారం. శిష్యులకు గురువులు సలహాలు ఇవ్వడం కొత్తేమీ కాదు. అలా ఎందరో దర్శకులు తమ గురువుల సలహాలు తీసుకొని చిత్రసీమలో రాణించిన దాఖలాలు ఉన్నాయి. కోడి రామకృష్ణ తన నూరవ చిత్రం 'అంజి' షూటింగ్ సమయంలో తన గురువు దాసరి నారాయణరావు సలహాలు తీసుకున్నారు. అప్పట్లో గ్రాఫిక్స్ తో విజువల్ వండర్ గా రూపొందిన 'అంజి'లో క్లయిమాక్స్ విషయంలో కోడి రామకృష్ణ తన గురువు దాసరితో చర్చించిన సంగతి అందరికీ తెలిసిందే.
గురువు సూచన... శిష్యుని పాలన...
పరుచూరి సోదరులు రచయితలే కాదు దర్శకులు కూడా. వారిని ఎందరో దర్శకులు తమ గురువులుగా భావిస్తూ ఉంటారు. బి.గోపాల్ రూపొందించిన 'సమరసింహారెడ్డి'కి పరుచూరి బ్రదర్సే రచయితలు. ఈ సినిమా కథలో ముందు హీరో బాలకృష్ణను అన్నగా అభిమానించే పృథ్వీ పాత్ర ఆసుపత్రిలో కన్నుమూయాలి. అయితే తన కుటుంబ సభ్యులను చంపేసిన ప్రత్యర్థులను సమరసింహారెడ్డి వేటాడే సీన్ తీస్తూ ఉండగా, రచయితల్లో ఒకరైన గోపాలకృష్ణకు ఓ ఆలోచన కలిగింది. ఆ సీన్ లోనే హీరోచేతుల్లో అతను తమ్మునిలా చూసుకొనే వ్యక్తి కన్నుమూస్తే బాగుంటుందని భావించారు. గురువు సూచనను బి.గోపాల్ కూడా బాగుందన్నారు. అలాగే మళ్ళీ పృథ్వీపై స్పెషల్ గా ఆసుపత్రి సీన్ తీయవలసిన అవసరం లేదని అనుకున్నారు. ఈ విషయాన్ని హీరో బాలకృష్ణకు వివరించగా ఆయన కూడా ఓకే అనడంతో ప్రస్తుతం సినిమాలో కనిపించే సీన్ రూపొందింది. అది సినిమాకు ఓ హైలైట్ గా, ఆయువు పట్టుగా నిలిచింది.
గురువు బాణీలో...
కె. రాఘవేంద్రరావు అసోసియేట్స్ గా పనిచేసిన చాలామంది ఆయన సలహాలు సూచనలు తీసుకున్నవారే. ముఖ్యంగా పాటల చిత్రీకరణలో గురువు రాఘవేంద్రరావునే అనుసరించారు ఆయన అసోసియేట్స్. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన 'బాహుబలి' మొదటి భాగంలో 'పచ్చ బొట్టేసినా.' పాటను రాజమౌళి తన గురువు రాఘవేంద్రరావు స్ఫూర్తితోనే తెరకెక్కించారని అందరికీ తెలుసు. ఆ పాట చూస్తే ఆ విషయం ఇట్టే తెలిసిపోతుంది.
శిష్యుని కోసం గురువు....
గురువుల సలహాలు-సూచనలు తీసుకోవడం, వారి స్ఫూర్తితో చిత్రాలు రూపొందించడం అన్నది కొత్తేమీ కాదు. అదే తీరున 'పెద్ది' సినిమాను చూస్తే అందులో డైరెక్టర్ బుచ్చిబాబు సానా టేకింగ్ లో ఆయన గురువు సుకుమార్ బాణీ కూడా కనిపిస్తూ ఉంటుంది. శిష్యుని తొలి చిత్రం 'ఉప్పెన'కు నిర్మాణ భాగస్వామి అయిన సుకుమార్, ఈ 'పెద్ది' నిర్మాణంలోనూ పాలు పంచుకున్నారు. సుకుమార్ సలహాతో కొన్ని కీలకమైన ఎపిసోడ్స్ ను బుచ్చిబాబు రీ-రైట్ చేసుకుని పకడ్బందీగా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడని, అందువల్లే ఇవాళ అందరికీ ఈ స్థాయిలో అభినందనలు దక్కుతున్నాయని అంటున్నారు. ఈ విషయంలో బుచ్చిబాబుకు దన్నుగా నిలిచిన నిర్మాత సతీశ్ కిలారు ని మెచ్చుకోక తప్పదు. బడ్జెట్‌కు వెనుకాడ కుండా తొలి సినిమాతో హిట్ కొట్టిన ఆయన ప్రస్తుతం రెండో సినిమా బాలకృష్ణతో చేస్తున్నారు. అంతే కాదు సుకుమార్ కు 'ఐటమ్ స్పెషలిస్ట్' అన్న పేరుంది. ఆ విషయంలోనూ బుచ్చిబాబు గురువును అనుసరిస్తూ 'పెద్ది'లో ఐటమ్ సాంగ్ పెట్టేశాడు. అభినందనలు అందుకుంటున్నాడు. మరి ఈ గురుశిష్యుల స్ఫూర్తితో ఇంకా ఎందరు చిత్రసీమలో తమదైన బాణీ పలికిస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి:
Taapsee: వయసు పెరిగేది మాకేనా.. హీరోలకు పెరగదా?
Puri Jagannadh: నా తొలి.. తమిళ సినిమా స్లమ్‌డాగ్