Peddi Review: రామ్‌చరణ్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ చిత్రం 'పెద్ది’ ఎలా ఉందంటే..
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:32 AM
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ (Ram charan) హీరోగా నటించిన చిత్రం 'పెద్ది’. 'ఉప్పెన' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఐదేళ్లు సమయం తీసుకుని బుచ్చిబాబు సాన తెరకెక్కించిన చిత్రమిది. మరీ చిత్రం రామ్‌చరణ్‌కు హిట్ ఇచ్చిందా? దర్శకుడు బుచ్చిబాబుకి ద్వితీయ విఘ్నం నుంచి గట్టెక్కించిందా అన్నది చూద్దాం.
సినిమా రివ్యూ: పెద్ది (Peddi Review)
విడుదల తేది: 4–6–2026
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ (Ram charan) హీరోగా నటించిన చిత్రం 'పెద్ది’. 'ఉప్పెన' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఐదేళ్లు సమయం తీసుకుని బుచ్చిబాబు సాన తెరకెక్కించిన చిత్రమిది. జాన్వీ కపూర్ కథానాయిక. జగపతిబాబు, శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, అజయ్ ఘోష్ కీలక పాత్రధారులు. టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పటి నుంచి సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఏఆర్ రెహమాన్ సంగీతంలో విడుదలైన పాటలు అంచనాలను రెట్టింపు చేశాయి. ఉత్తరాంధ్ర, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కథతో రూపొందిన ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడుతూ ఈ నెల 4న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. మరీ చిత్రం రామ్‌చరణ్‌కు హిట్ ఇచ్చిందా? దర్శకుడు బుచ్చిబాబుకి ద్వితీయ విఘ్నం నుంచి గట్టెక్కించిందా అన్నది చూద్దాం.
కథ..(Peddi Review)
విజయనగరంలో ఓ అటవీ ప్రాంతంలోని పల్లె అది. కొండ కింద అని పిలుస్తారు. దానికి ఏ గుర్తింపు, కనీస రవాణా సౌకర్యం కూడా ఉండదు. ఆ కొండ మీదుగా ఓ రైలు వెళ్తుంది. కానీ ఆ ప్రాంతంలో స్టేషన్ లేకపోవడంతో రైలు అక్కడ ఆగదు. 1800 జనాభా గల ఈ ప్రాంతవాసులు కాలి నడకనే విజయనగరం వలస వెళ్లి పని చేసుకుని బతుకుతారు. ఆ కొండ కింద ఉండే వ్యక్తి ‘పెద్ది’ (రామ్ చరణ్). క్రికెట్ అంటే పిచ్చి. మంచి ఆటగాడు కూడా. ఆట కూలీగా అతన్ని ఓ జట్టు పాడుకుని క్రికెట్ ఆట ఆడించి గెలిచి పేరు తెచ్చుకుంటారు. అదే టీమ్ పెద్దిని ఓసారి అవమానిస్తుంది. అందుకు కారణమేంటి? ఆట కూలీగా క్రికెట్ ఆడే పెద్ది కుస్తీ వైపు, ఆ తర్వాత రన్నింగ్ వైపు ఎందుకు వెళ్లాడు. అతను ఉంటే కొండ కింద ప్రాంతానికి భారత దేశంలో గుర్తింపు తీసుకురావడానికి ఏం చేశాడు? ఈ జర్నీలో పెద్దికి, అప్పల సూరికి ఉన్న సంబంధం ఏంటి? పెద్దింటి అమ్మాయి అయిన అచ్చియ్యమ్మ పెద్దిని ఇష్టపడటానికి కారణం ఏంటి? వారి ప్రేమ సుఖాంతం అయిందా? అన్నది కథ. .

విశ్లేషణ
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ అనేది యూనివర్సల్. ఈ జానర్ ఓ ఎమోషన్ కూడా. స్పోర్ట్స్ కథలకు కుల, మత, ప్రాంతాల బేధాలు ఉండవు. ఇది కూడా ఆ తరహా చిత్రమే. విజయనగరంలో ఏ గుర్తింపు లేని, అంటే కనీసం ఆ ప్రాంతంలో 1800 మంది ఉన్నారన్న విషయం తెలియని ప్రభుత్వానికి ఆ ఊరి యువకుడు ఎలా గుర్తింపు తెచ్చాడు? అదొక ఊరని దేశానికి ఎలా తెలియజేశాడు? ఈ జర్నీలో ఎదురైన సవాళ్లేంటి అన్నది ఇతివృత్తంగా తీసిన సినిమా ఇది. 140 కోట్ల జనాభా ఉన్న దేశానికి రెండు పతకాలేనా అంటూ క్రీడా శాఖమంత్రి రియాక్షన్‌తో సినిమా మొదలవుతుంది.ఊరి నేపథ్యం, అక్కడ పరిస్థితి వివరించడానికి కొంత సమయం తీసుకున్నారు. రామ్ చరణ్ పాత్ర పరిచయమైన తర్వాత సీన్, సాంగ్, ఫైట్ అంటూ బ్యాక్ టు బ్యాక్ మాస్ మెచ్చే అంశాలతో సినిమా చూపించారు. ఇదంతా రొటీనేగానే ఉంటుంది. ఈ మధ్యలో ఎలక్షన్లు, లవ్‌ట్రాక్ ఇలా కొన్ని సీన్లు వచ్చి పోతుంటాయి. తదుపరి కథ పెద్ది క్రికెట్ వైపు తిరుగుతుంది. పెద్ది గురించి తెలిసి క్రీడా శాఖ అధికారి ఆశ్చర్యపోతాడు. అక్కడి నుంచి పెద్ది ఆ ఊరి ఆత్మ గౌరవం కోసం ఏం చేశాడనే విషయాన్ని దర్శకుడు నేరుగా తెరపైకి తీసుకొచ్చాడు. అప్పలసూరి పాత్ర మరణం నుంచి కథలో మలుపు తిరుగుతుంది. అక్కడి వరకూ సోసోగా సాగిన కథ ఒక్కసారిగా ఊపందుకుంటుంది. దాంతో ఇంటర్వెల్. తదుపరి కుస్తీ పోటీలు నేపథ్యంలో సాగే సన్నివేశాలన్నీ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్‌లో చరణ్ నుంచి వచ్చే ట్విస్ట్ మాత్రం ఊహించలేనిది. లాస్ట్ 20 నిమిషాల కథ ఎంతో ఎమోషనల్‌గా సాగుతుంది. ఊరి కోసం పెద్ది ఏం చేశాడన్నది హృద్యంగా చూపించారు. దర్శకుడు హీరోలోని కమర్షియల్ యాంగిల్ కన్నా.. క్లైమాక్స్ ఎమోషన్ మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. స్క్రీన్ ప్లే అంత ఆకట్టుకోలేదు. చెప్పాలనుకున్న కథను కాస్త క్రిస్ప్‌గా చెప్పుంటే బావుండేది. సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. తొలి చిత్రంతో ఓవర్‌నైట్ స్టార్ అయిన బుచ్చిబాబు స్టార్ హీరోను డీల్ చేయడంతో కాస్త తడబడ్డాడు. తెరపై పేరున్న ఆర్టిస్ట్‌లు ఎంతో మంది వారిని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. కొన్ని చోట్ల లాజిక్స్‌ను వదిలేశారు. కొన్ని సన్నివేశాలు సినిమాటిక్ గా ఉంటాయి. కానీ బుచ్చి రచనలో నిజాయతీ ఉంది. కొన్ని సీన్స్‌ను, డైలాగ్‌లను బాగా రాసుకున్నాడు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు అయినా దేశంలో ఇంకా గుర్తింపు, ఊరు, పేరు లేని ఊర్లు ఉన్నాయనే విషయాన్ని తెరపైకి తెచ్చారు.
నటీనటులు పనితీరు..
గత చిత్రాలతో పోల్చితే 'పెద్ది' తన కెరీర్‌కు ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందని, మట్టి లాంటి చిత్రమని మొదటి నుంచి చెబుతూ వచ్చారు రామ్‌చరణ్. నటన పరంగా ఆయన చెప్పింది వంద శాతం నిజం. పెద్ది పాత్రకు ప్రాణం పోశారు. రెండు ఏళ్లుగా ఈ సినిమాకు పడిన కష్టం, పెట్టిన ఎఫర్ట్ తెరపై కనిపించింది. క్రికెట్; కుస్తీ పోటీల సన్నివేశాల్లో నెక్ట్స్ లెవల్ అనేలా చేశారు. డాన్స్‌తోపాటు యాక్షన్ ఎపిసోడ్స్ బాగా చేశాడు. కుస్తీ సన్నివేశాలైతే గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. సినిమా మొత్తాన్ని చరణ్ భుజాలపై వేసుకుని మోశారు. హీరోయిన్‌గా జాన్వీకపూర్ అచ్చియమ్మ పాత్రకు న్యాయం చేసింది.. అయితే ఈసారి ఆమె పాత్ర నిడివి ఎక్కువగానే ఉంది. ఇక అందాలను ఐతే వెదజల్లింది. అప్పలసూరిగా జగపతిబాబు పాత్ర బావుంది. ఆయన చెప్పినట్లుగా ఈ చిత్రం ఆయనకు ఎంతో ప్రత్యేకం. రెజ్లర్ గౌరినాయుడుగా శివన్న అద్భుతమైన నటన కనబర్చారు. ఆయన పాత్ర కూడా సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. బోమన్ ఇరానీ, అజయ్ ఘోష్, రావు రమేశ్ పాత్రలు కూడా ఫర్వాలేదనిపించాయి. 1990ల ప్రాంతాన్ని, కొండ ప్రాంతాలో మనుషుల తీరును డిఓపి రత్నవేలు అద్భుతంగా చూపించారు. ప్రొడక్షన్ డిజైన్ యాప్ట్ అవుతుంది. ఏఆర్ రెహమాన్ పాటలతో సందడి చేశారు కానీ రీరికార్డింగ్ విషయంలో మెరుపులు చూపించలేకపోయారు. కొన్ని సన్నివేశాల్లో నేపథ్య సంగీతం బోరింగ్‌గా అనిపించింది. నవీన్ నూలి సినిమా ఓ ఇరవై నిమిషాల వరకే కత్తెర వేసుంటే బావుండేది. నిర్మాణ విలువలు మాత్రం ఎక్కడా తగ్గలేదు. సినిమాలో కొన్ని సన్నివేశాలు. కాస్త నిడివి ఎక్కువ కావడం మైనస్‌గా కనిపిస్తాయి. అభిమానులకు అయితే పెద్ది విందు భోజనం లాంటి సినిమా. ప్రస్తుతం ఏ సినిమా పోటీ లేకపోవడం ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. మొత్తం మీద పెద్ది రామ్‌చరణ్ వన్‌మెన్ షోగా చెప్పుకోవచ్చు.
ట్యాగ్‌లైన్: 'పెద్ది'.. రామ్‌చరణ్ వన్‌మెన్ షో..
రేటింగ్: 2.75/5