‘ఇట్లు నాగార్జున’ అని చాలా ప్రేమలేఖలు రాశా..: కింగ్ నాగార్జున
ABN , Publish Date - Oct 16 , 2026 | 07:23 PM
నాకు కొత్త ఎనర్జీ అన్నా, న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడం అన్నా ఎంత ఇష్టమని అన్నారు కింగ్ నాగార్జున. తాజాగా ఆయన ‘ఇట్లు అర్జున’ సమర్పిస్తున్నారు. ఈ మూవీ వేడుకలో నాగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల సమర్పణలో వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న వినూత్న ప్రేమకథా చిత్రం ‘ఇట్లు అర్జున’ (Itllu Arjuna). ఈ సినిమా ద్వారా అనీష్ (Aniesh) హీరోగా పరిచయమవుతుండగా, డెబ్యూ డైరెక్టర్ మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్నారు. అనశ్వర రాజన్ (Anaswara Rajan) కథానాయికగా నటిస్తుండగా, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎస్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, పాటలు మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 30న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ‘ఇట్లు అర్జున’ గ్రాండ్ రివీల్ మీట్‌కు కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ చిత్రానికి నాగార్జున స్వయంగా సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం. ఈ వేడుకలో నాగార్జున మాట్లాడిన ప్రతి మాట చిత్ర యూనిట్లో కొండంత ఉత్సాహాన్ని నింపిందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఈ వేడుకలో కింగ్ నాగ్ మాట్లాడుతూ..
కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడం నాకు ఇష్టం
‘‘నాకు కొత్త ఎనర్జీ అన్నా, న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడం అన్నా ఎంత ఇష్టమో! మొదట వైవీఎస్ చౌదరితో అన్నపూర్ణ ద్వారా సినిమా నిర్మించి కొత్తవాళ్లను పరిచయం చేయడం ప్రారంభించాను. అలా ఎన్నో సినిమాలు, ఎంతోమంది టెక్నీషియన్లను అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా పరిశ్రమకు పరిచయం చేస్తూ వచ్చాం. ఈ ‘ఇట్లు అర్జున’ సినిమా చూస్తుంటే నాకు అప్పట్లో రాజ్ తరుణ్, అవికా గోర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఉయ్యాల జంపాల’ గుర్తొచ్చింది. అప్పుడు గ్లింప్స్‌లు, టీజర్లు పెద్దగా ఉండేవి కావు. వాళ్లు వచ్చి కొద్దిగా ఫుటేజ్ చూపించారు. అది చూడగానే బాగా నచ్చి, పూర్తి సినిమా చూసి కథ విన్నాను. ఎంతగానో నచ్చడంతో ఆ చిత్రానికి పార్ట్నర్గా మారి అసోసియేట్ అయ్యాను. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో, వారిద్దరికీ ఎంత మంచి కెరీర్ ఇచ్చిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే మ్యాజిక్ ఇక్కడ రిపీట్ అవుతుందనిపిస్తోంది.
సినిమా చూసి షాకయ్యా!
మొదట్లో డైరెక్టర్ మహేష్, హీరో అనీష్, వెంకీ కుడుముల నా దగ్గరకు వచ్చి గ్లింప్స్ రిలీజ్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలని అడిగారు. అనీష్‌తో ఉన్న పాత పరిచయంతో తప్పకుండా చేస్తానని చెప్పి వాయిస్ ఓవర్ ఇచ్చాను. అయితే గ్లింప్స్ చూశాక.. ‘హీరో మూగవాడు అంటున్నారు, మాటలు లేవు అంటున్నారు.. మొదటి సినిమాకే ఇంత పెద్ద రిస్క్ అవసరమా అనీష్? కొంచెం సింపుల్ లవ్ స్టోరీ చేయొచ్చు కదా’ అని అడిగాను. కానీ వాళ్లకు కథపై ఉన్న బలమైన కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్లారు. సినిమా పూర్తయ్యాక మహేష్, అనీష్ తీసుకొచ్చి నాకు పూర్తి సినిమా చూపించారు. సినిమా చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను. సచ్ ఏ బ్రిలియంట్ స్క్రీన్‌ప్లే! అనీష్, అనశ్వర నటన చూసి థ్రిల్ అయ్యాను. ఒక లవ్ స్టోరీకి కావాల్సిన బాడీ లాంగ్వేజ్, వాళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ పర్ఫెక్ట్గా కుదిరాయి. సినిమా ఆద్యంతం అదిరిపోయే ట్విస్ట్‌లు, టర్న్స్‌తో పాటు హిలేరియస్ ఎంటర్టైన్మెంట్తో నడుస్తుంది. సినిమా చూడగానే ‘అనీష్.. సినిమా ఫెంటాస్టిక్‌గా వచ్చింది’ అని చెప్పాను. ఆ వెంటనే ‘మీరు ఈ సినిమాను ప్రెజంట్ చేస్తారా సర్?’ అని అడిగారు. ఇంత బ్రిలియంట్ సినిమాను సమర్పించడానికి నాకు అంతకంటే ఏం కావాలి.. తప్పకుండా ప్రెజంట్ చేస్తానని వెంటనే ఒప్పుకున్నాను.
ఈ సినిమా రషెస్ చూసే ఆ నిర్ణయం తీసుకున్నా!
ఈ సినిమాలో కేవలం నటీనటులే కాదు, టెక్నీషియన్స్ ప్రతిభ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమా రషెస్, విజువల్స్ చూసిన వెంటనే.. ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ రాజా పనితనం నచ్చి, నా మైల్స్టోన్ ప్రాజెక్ట్ అయిన ‘కింగ్ 100’ చిత్రానికి ఆయననే డీవోపీగా ఫిక్స్ చేసుకున్నాను. ఆయన వర్క్ అంత బాగుంది. ఇక మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. తమన్ బ్రిలియంట్ మ్యూజిక్ ఇచ్చారు. సినిమాలో నాలుగైదు పాటలు ఉన్నాయి, అన్నీ ఒకదాన్ని మించి ఒకటి సూపర్ హిట్ అయ్యాయి. సినిమాకు పాటలు హిట్ అయితే ఎంతటి బలం చేకూరుతుందో మనందరికీ తెలిసిందే. పాటలు మాత్రమే కాదు, వాటి పిక్చరైజేషన్ కూడా చాలా రిచ్‌గా వచ్చింది. ఈ చిత్రాన్ని సమర్పించడం నాకు ఎంతో గర్వంగా, సంతోషంగా ఉంది. అనీష్, మహేష్, అనశ్వర, వెంకీ, రాజా.. మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు..’’ అని నాగార్జున ప్రశంసల జల్లు కురిపించారు.
స్పీచ్ ముగిసిన అనంతరం యాంకర్ సరదాగా నాగ్‌ను ‘‘సర్, మీరు జీవితంలో మొట్టమొదటిసారి ‘ఇట్లు నాగార్జున’ అని ఎవరికి ప్రేమలేఖ రాశారు?’’ అని అడగ్గా.. నాగార్జున తనదైన నవ్వుతో స్పందిస్తూ.. ‘‘ఒకటా రెండా.. చాలా రాశాను, ఇప్పుడు మొట్టమొదటిది ఏంటో గుర్తులేదు.. మెమరబుల్ లెటర్ అంటూ ప్రత్యేకంగా ఏదీ గుర్తులేదు.. అయినా రాయడం ఎందుకు, డైరెక్ట్‌గా వెళ్లి మాట్లాడేయడమేగా!’’ అంటూ చమత్కరించడంతో.. వేదిక నవ్వులతో నిండిపోయింది. కింగ్ నాగార్జున స్వయంగా సమర్పిస్తుండటం, సినిమాపై ప్రశంసలు కురిపించడంతో సినిమాపై పాజిటివ్ బజ్ మరింత పెరిగింది. అక్టోబర్ 30న విడుదల కాబోతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి..
ఇవి కూడా చదవండి:
జాడ లేని ‘ఆదర్శ కుటుంబం’.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుందా?
Saturday TV Movies: అక్టోబర్ 17, శనివారం.. TV ఛానళ్లలో వచ్చే సినిమాలు
రణబాలి రివ్యూ: విజయ్ దేవరకొండ వీరగాథ ఎలా ఉంది?