రణబాలి రివ్యూ: విజయ్ దేవరకొండ వీరగాథ ఎలా ఉంది?

ABN , Publish Date - Oct 16 , 2026 | 01:04 PM

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన పీరియాడిక్ మూవీ రణబాలి రివ్యూ. బ్రిటిష్ పాలనలో రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ వీరగాథలో నటన, కథనం, సంగీతం ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Ranabaali Movie

గత కొంతకాలంగా మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న విజయ్‌ దేవరకొండ అభిమానులంతా ప్రతిష్ఠాత్మక చిత్రం 'రణబాలి'పై ఆశలు పెట్టుకున్నారు. 'గీత గోవిందం, డియర్ కామ్రేడ్‌' చిత్రాల తర్వాత విజయ్‌ దేవరకొండ, రశ్మిక జంటగా నటించిన మూడో చిత్రం ఇది. అంతేకాదు, వీరి పెళ్ళి తర్వాత వస్తున్న తొలి చిత్రం కూడా కావడంతో అందరి చూపు 'రణబాలి'పైనే ఉంది. మరి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన పీరియాడిక్‌ మూవీ 'రణబాలి' ఎలా ఉందో తెలుసుకుందాం.

ఇది 1854 నుంచి 1878 మధ్య రాయలసీమ నేపథ్యంలో జరిగే కథ. శింగనమల కోటకు చెందిన రణబాలి (విజయ్‌ దేవరకొండ) కారణ జన్ముడు. తల్లి రాజమ్మ (ఈశ్వరీరావు) చనిపోయిన బిడ్డను ప్రసవించి, ఊరి దేవుడు భద్ర మల్లన్నను శరణువేడితే, ఆయన ఆ బిడ్డకు ప్రాణం పోసి, రెండు పుష్కారాలు జీవించి, తన బాధ్యతలను ముగించాక సమాధి అవుతాడని చెబుతాడు. అలా ఊరికోసం కొడుకును పెంచిన రాజమ్మ, యుక్తవయసులో రణబాలిని జయమ్మ (రశ్మిక మందణ్ణ)కు ఇచ్చి పెళ్ళి చేస్తుంది. ఈ దేశాన్ని కొల్లగొట్టడానికి వచ్చిన ఆంగ్లేయుల ఆకలి దాహం కారణంగా మద్రాస్‌ ప్రెసిడెన్సీ కరువుతో అల్లాడుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా రాయలసీమలోని ధాన్యాన్ని ఆంగ్లేయ అధికారి హెక్టర్‌ (ఆర్నాల్డ్ ఓస్లూ) బ్రిటన్‌ కు పంపడానికి ఉవ్విళ్ళూరు తుంటాడు. అలా చేస్తే కమీషనర్‌గా ఉన్న తనను క్వీన్ విక్టోరియా గవర్నర్‌ను చేస్తుందనే ఆశ అతనికి! ప్రజల ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడని కిరాతకుడైన హెక్టార్‌ కు రణబాలి ఎలా బుద్ధి చెప్పాడు? తన ప్రాంతంలో కరువుతో అల్లాడుతున్న ప్రజల ఆకలిని ఎలా తీర్చాడు? అనేది ఈ చిత్ర కథ.


బ్రిటీష్‌ వారికి సింహస్వప్నంగా నిలిచిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరమరణం పొందిన మూడు దశాబ్దాలకు శింగనమల బెబ్బులి రణబాలి ఆంగ్లేయులపై జరిగే అలుపెరుగని పోరాటం చేశాడు. రాయలసీమలో రణబాలి గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. అయినవారి కుట్ర కారణంగా అసువులు బాసిన రణబాలి ఆ తర్వాత భద్ర మల్లన్న రూపంలో ప్రజలకు అండగా నిలిచాడని అక్కడి వారు నమ్ముతారు. దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఈ వీర గాథను లార్టర్ దాన్‌ లైఫ్‌ తరహాలో వెండితెరపై ఆవిష్కరించాడు. బ్రిటిషర్స్... భారతీయులను బానిసలుగా చూసిన నిజాన్ని విస్మరించి, వారు ఈ దేశంలో రైలు మార్గాలు వేశారు, విద్యాబోధనలు చేశారు అని గొప్పలు చెప్పుకొనే వారికి ఈ సినిమా ఓ చెంపపెట్టు. 1840 నుంచి 1880 మధ్య కాలంలో భారతదేశాన్ని కృత్రిమ కరువు రక్కసి నోట్లోకి నెట్టేసి, కోట్లాది మంది భారతీయుల అకాల మరణానికి కారణం అయిన వారు ఆంగ్లేయులనే కఠోర నిజాన్ని ఆధారాలతో దర్శకుడు రాహుల్‌ ఈ సినిమాలో చూపించాడు. ఆంగ్లేయ అధికారుల దుష్ట చర్యలను తెర మీద చూసిన ప్రతిసారీ థియేటర్ లోని ప్రేక్షకుల రక్తం మరిగిపోతుంటుంది. అయితే అదే స్థాయిలో భావోద్వేగ సన్నివేశాలను మనసు ద్రవించేలా చూపించడంలో రాహుల్ తడబడ్డాడు. దానికి తోడు కథనం చాలా నిదానంగా నడవడం కూడా కాస్తంత ఇబ్బందిని కలిగిస్తుంది.


నటీనటుల విషయానికి వస్తే... విజయ్‌ దేవరకొండ రణబాలి పాత్ర కోసం ప్రాణం పెట్టాడు. ఆ పాత్ర ఔచిత్యాన్ని గుర్తెరిగి గొప్పగా నటించాడు. జయమ్మగా రశ్మిక మందణ్ణ సహజ నటన ప్రదర్శించింది. ఇతర కీలక పాత్రలను ఈశ్వరీరావు, ఆర్నాల్డ్ ఓస్లూ, వ్లాదిమిర్‌ ఏంజెలోవ్‌, మైమ్‌ మధు, మధునందన్‌, 'కంచరపాలెం' కిశోర్‌, జెఫ్రీ గియులియానో, బెనెడిక్ట్ గారెట్‌ తదితరులు పోషించారు. అజయ్‌ అతుల్ తమ నేపథ్య సంగీతంతో సన్నివేశాలను ఎలివేట్‌ చేశారు. జిష్ణు భట్టాచార్జీ, నిరవ్‌ షా సినిమాటోగ్రఫీ ఆనాటి కాలానికి అద్దం పట్టింది. ఆర్ట్ డిపార్ట్ మెంట్‌ సైతం చక్కటి పనితనం కనబర్చింది. రొటీన్ ఫార్ములా జోలికి పోకుండా... ఈ దేశాన్ని పాలించిన ఆంగ్లేయుల అకృత్యాలను కళ్ళకు కట్టినట్టుగా చూపిన ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలి. అప్పుడే ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన చిత్రాలు వచ్చే ఆస్కారం ఉంటుంది.

చిరంజీవి నటించిన స్వాతంత్ర సమరయోధుడు 'సైరా నరసింహారెడ్డి' చిత్రం కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. ఈ పరిస్థితిలో అదే నేపథ్యంలో రూపుదిద్దుకున్న 'రణబాలి' పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉద్భవిస్తుంది. కానీ జయాపజయాలను బేరీజు వేసుకోకుండా మైత్రీ మూవీ మేకర్స్ చేసిన గొప్ప ప్రయత్నంగా 'రణబాలి'ని చూడాల్సి ఉంటుంది. నటీనటులు, సాంకేతిక నిపుణులు పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని అందించాల్సిన బాధ్యత ప్రేక్షకుల మీద ఉంది.

రేటింగ్‌: 2.75/5

ట్యాగ్‌లైన్‌: కఠోర వాస్తవాల రణబాలి!

ఇవి కూడా చదవండి:

జైలర్‌ 2 రివ్యూ.. సీక్వెల్‌ సెంటిమెంట్‌ను చెరిపేసిన రజనీకాంత్‌!

Crazy Kalyanam Review: అనుపమ పరమేశ్వరన్ '‘క్రేజీ కల్యాణం’ ఎలా ఉందంటే..

Updated Date - Oct 16 , 2026 | 02:04 PM

హాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన వారణాసి.. ఐమాక్స్ ఛానల్‌లో నంబర్ వన్‌గా మహేష్ మూవీ!

Balakrishna: ఈ సారి.. 'దాదా' టార్గెట్‌ మిస్‌ అవ్వదు!

విగ్గు ఎందుకు వాడుతున్నారు? అంటే.. నరేష్ ఇచ్చిన సమాధానమిదే

Dhanush: 'జైలర్ 2' చూసి ధనుష్ ఏమన్నాడో తెలుసా

Anupama Parameswaran: ఎన్నో కష్టాలు భరించా.. విమర్శలొచ్చినా వెనక్కి తగ్గను