వి.వి. వినాయక్ సమక్షంలో కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం
ABN, Publish Date - Nov 04 , 2026 | 05:35 PM
కిషోర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ నిర్మిస్తోన్న తొలి చిత్రం ప్రొడక్షన్ నెంబర్ 1 హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖులు, అతిథుల సమక్షంలో బుధవారం ఘనంగా ప్రారంభమైంది.
కిషోర్ మూవీ మేకర్స్ (Kishore Movie Makers) బ్యానర్ పై నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ నిర్మిస్తోన్న తొలి చిత్రం ప్రొడక్షన్ నెంబర్ 1 హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖులు, అతిథుల సమక్షంలో బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలకు సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్ (VV Vinayak), ప్రామిసింగ్ హీరో ఆది సాయికుమార్ (Aadi Saikumar) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వి.వి. వినాయక్ చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేసి శుభాకాంక్షలు తెలియజేయగా.. ముహూర్తపు షాట్‌కు నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ క్లాప్ కొట్టారు. ఆది సాయికుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు నిర్మాత మల్కాపురం శివకుమార్, సిద్ధు రెడ్డి, చీకోటి ప్రవీణ్ వంటి వారంతా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు, దర్శకులు, నిర్మాతలు పాల్గొని చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియజేశారు.
ఈ సినిమాతో దర్శకులు రవికుమార్ చౌదరి, ఘటికాచలం వద్ద రచయితగా అసోసియేట్‌గా పనిచేసిన దివాకర్ యడ్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఓ అందమైన ప్రేమకథతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే వినోదాత్మక అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘డెలులు’ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న విజయ్ రాజ్ కుమార్ హీరోగా నటిస్తుండగా.. కన్నడ చిత్రం ‘కెజియఫ్’లో యశ్ తల్లిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అర్చనా జోయస్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘అమీతుమీ’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అతిథి మైకల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ ప్రారంభోత్సవం సందర్భంగా దర్శకుడు దివాకర్ యడ్ల మాట్లాడుతూ.. ప్రేమ అంటే రెండు మనసుల మధ్య పుట్టే ఒక అందమైన అనుభూతి. ఆ అనుభూతిని నిజాయతీగా, హృదయానికి హత్తుకునేలా తెరపై చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నాము. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు తన జీవితంలోని మధుర క్షణాలను తప్పకుండా గుర్తు చేసుకుంటారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులందరికీ నచ్చేలా ఆద్యంతం ఆహ్లాదంగా సాగే చిత్రంగా దీనిని తీర్చిదిద్దుతున్నాం. హైదరాబాద్, కేరళలో షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేశాం. ఈ సినిమాకు కథే అసలైన హీరో. నాపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన నిర్మాత ఎన్.ఎన్. కిషోర్‌కు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు. మా సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసి ఆశీర్వదించిన సినీ ప్రముఖులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేక్షకుల ఆదరణే మాకు అసలైన బలమని అన్నారు.
నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ మాట్లాడుతూ.. సినిమా అంటే మాకు ప్రాణం. ఆ ప్రేమతోనే కిషోర్ మూవీ మేకర్స్ బ్యానర్‌ను ప్రారంభించి, మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించేందుకు పూనుకున్నాం. మా తొలి చిత్రం ఇంతమంది సినీ పెద్దల ఆశీస్సుల మధ్య ప్రారంభం కావడం ఎంతో ఆనందంగా ఉంది. అదే సమయంలో మాపై మరింత బాధ్యతను కూడా పెంచింది. మంచి కథ, నాణ్యమైన నిర్మాణ విలువలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకునే చిత్రాన్ని అందించడమే మా లక్ష్యం. కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మా బ్యానర్‌పై మరిన్ని సినిమాలు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ‘‘ఇదొక కంప్లీట్ ఎంటర్‌టైనర్. దర్శకుడు దివాకర్ మంచి కథను సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు హీరో విజయ్ రాజ్ కుమార్.
హీరోయిన్ అర్చనా జోయస్ మాట్లాడుతూ.. ‘‘కన్నడలో ఇప్పటికే పలు సినిమాల్లో నటించాను. ‘కెజియఫ్’ చిత్రంలో యశ్ తల్లిగా నటించడం ద్వారా నాకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగు ప్రేక్షకులు కూడా నన్ను ఎంతో ఆదరించారు. ఇప్పుడు ఈ చిత్రంతో స్ట్రెయిట్ తెలుగు సినిమాలో హీరోయిన్‌గా నటించడం చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు. మంచి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు అతిథి మైకల్. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభించుకోనుంది. హైదరాబాద్, కేరళలో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.
ఇవి కూడా చదవండి:
రేంజ్ మ్యాటర్.. చిరు ‘కాకా’కి తెలుగు రాష్ట్రాల్లో భారీ డిమాండ్
‘టైసన్ నాయుడు’ నుంచి మాస్ ఫోక్ సాంగ్.. ఎప్పుడంటే
నేరాలకు సినిమాలను బలిపశువును చేస్తారా?: సందీప్ రెడ్డి వంగా ఫైర్