సినిమా రెడీ... టైటిల్ మారాల్సిందే

ABN , Publish Date - Nov 04 , 2026 | 01:54 PM

వెండితెర వెనుక జరిగే అసలు సిసలు మాయాజాలలో 'టైటిల్ ఛేంజ్‌' అనేది ఒక బిగ్గెస్ట్ గేమ్. సినిమా అనౌన్స్ చేసేటప్పుడు ఒక ఊరమాస్ లేదా క్లాసీ టైటిల్ పెట్టి.. ఆ తర్వాత పేరును మార్చేయడం టాలీవుడ్‌లో ఇప్పుడు ట్రెండ్‌గా మారిపోయింది. థియేటర్లలోకి రాకముందే ఆ పేరు ఎందుకు మారిపోతుందంటే.. ఆ తెరవెనుక కథేంటో తెలుసుకోవాలి.

movie titles

తెలుగు సినిమా పరిశ్రమలో టైటిల్స్ మారడం కొత్తేమీ కాదు. ఒకప్పుడు కేవలం సెంటిమెంట్లు, న్యూమరాలజీ లేదా జ్యోతిష్యుల మాటల కోసం పేర్లు మార్చేవారు. ఈ టైటిల్ అయితే సెంటిమెంట్ టీ వర్కౌట్ కాదు, డిజాస్టర్ టాక్ వస్తుంది అనే భయంతో షూటింగ్ మధ్యలోనే పేర్లు మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కాలం మారే కొద్దీ ట్రెండ్ కూడా మారుతుంది. ఇప్పుడు పాత సెంటిమెంట్ల భయం కంటే.. సెన్సార్ బోర్డు (CBFC) ఇస్తున్న షాక్‌లతోనే మేకర్స్ ఎక్కువ తల పట్టుకోవడంతో జరుగుతోంది.


మొదట అనుకున్న క్యాచీ టైటిల్‌తో పోస్టర్లు, గ్లింప్స్ వదిలి హడావుడి చేస్తుంటారు నిర్మాతలు. తీరా సెన్సార్ సర్టిఫికెట్‌ కోసం వెళ్లేసరికి అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఈ టైటిల్ మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉందనో, దేవుళ్ళ పేర్లు ఉన్నాయనో లేదా సమాజంలో వివాదాలకు దారి తీస్తుందనో అభ్యంతరాలు వ్యక్తమవుతాయి. టైటిల్ మారుస్తారో లేక రివైజింగ్‌ కమిటీకి వెళతారో తేల్చుకోమనే పరిస్థితి వస్తుంది. దాంతో నిర్మాతల రాజీ పడి... టైటిల్‌ మార్చడం వైపే మొగ్గు చూపుతున్నారు.

ఇటీవల కాలంలో ఇలాంటి లాస్ట్ మినిట్ సర్ప్రైజ్‌లను చాలా సినిమాలే ఎదుర్కొన్నాయి. సుహాస్ హీరోగా నటించిన చిత్రానికి మొదట 'హే భగవాన్' అనుకున్నారు. కానీ మతపరమైన మనోభావాల అంశం తెరపైకి రావడంతో, చివరి నిమిషంలో దాన్ని 'హే బలవంత్' గా మార్చేశారు. అలాగే అవినాష్, నందు, సిమ్రాన్ చౌదరి నటించిన 'వానర' సినిమా టైటిల్‌పై సెన్సార్ అభ్యంతరం చెప్పడంతో 'వనవీర'గా థియేటర్లలోకి వచ్చింది. రాజీవ్ కనకాల, శివ కందుకూరి నటించిన 'చాయ్‌ వాలా' టైటిల్‌పై కూడా అభ్యంతరం వ్యక్తం కావడంతో అది 'నవాబ్ కేఫ్'గా థియేటర్లలో విడుదలైంది.


అలానే గత యేడాది సురేశ్‌ గోపీ నటించిన 'జానకీ వర్సెస్ స్టేట్‌ ఆఫ్‌ కేరళ' మూవీ టైటిల్‌ ను విడుదల సమయానికి 'జానకీ వి వర్సెస్ స్టేట్‌ ఆఫ్‌ కేరళ'గా మార్చారు. ఇక వరలక్ష్మీ శరత్‌కుమార్ తొలిసారి మెగాఫోన్ పట్టుకున్న మూవీ టైటిల్‌ 'సరస్వతి' కాస్త విడుదల సమయానికి 'ఎస్. సరస్వతి'గా మారింది. తాజాగా యూట్యూబ్ సెన్సేషన్ మౌళి తనుజ్ హీరోగా నటించిన చిత్రానికి 'దొంగ నా కొడుకు' అనే టైటిల్ ఫిక్స్ చేసినా.. సెన్సార్ అభ్యంతరంతో మేకర్స్ సింపుల్‌గా దాన్ని 'DNK' (డిఎన్‌కే) గా షార్ట్ కట్ చేసేశారు. నవంబర్‌ 13న ఈ సినిమా విడుదల కాబోతోంది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడటంతో 'డీఎన్.కె.' గానే దీని ప్రమోషన్స్ ను మొదలు పెట్టారు. అయితే ఇలా చివరి నిమిషంలో టైటిల్ మారిపోతే మేకర్స్‌కు వచ్చే తలనొప్పులు అన్నీఇన్నీ కావు. బుక్‌ మై షో వంటి యాప్‌లలో పాత పేరుతో వెతికితే సినిమా కనిపించక ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతారు. అప్పటి వరకూ పాత టైటిల్‌తో ముద్రించిన పోస్టర్లు, కటౌట్లు, బ్యానర్లు అన్నీ వేస్ట్ అయిపోతాయి. కొత్త టైటిల్‌తో మళ్ళీ పనులన్నీ మొదలుపెట్టాలి. ఇది చిన్న సినిమాల నిర్మాతలకు ఆర్థికంగా మోయలేని భారంగా మారుతోంది. టైటిల్ మారితే జనాల్లోకి సినిమా సరిగ్గా చేరుతుందో లేదోనని దర్శకులు తెగ టెన్షన్ పడాల్సి వస్తుంది. అందుకే తాజాగా సెన్సార్ అధికారులు కూడా టైటిల్‌ పెట్టే ముందే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోమని, ఛాంబర్‌లో రిజిస్టర్ చేసినంత మాత్రాన ఆ టైటిల్‌ కన్‌ ఫర్మ్ అనే ధీమా పనికి రాదని నిర్మాతలను హెచ్చరించారు. ఏదేమైనా.. బాక్సాఫీస్ వద్ద సినిమా సేఫ్‌గా విడుదల కావాలన్నా, అనవసరమైన కాంట్రవర్సీలకు దూరంగా ఉండాలన్నా మంచి టైటిల్స్ పెట్టడమే ఉత్తమం!

ఇవి కూడా చదవండి:

దియా మీర్జా దీపావళి వీడియోపై రగడ.. బీఎంసీకి బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు

రామాయణ 3.. అంతా వారి చేతుల్లోనే

Updated Date - Nov 04 , 2026 | 01:57 PM