నేరాలకు సినిమాలను బలిపశువును చేస్తారా?: సందీప్ రెడ్డి వంగా ఫైర్

ABN , Publish Date - Nov 04 , 2026 | 03:26 PM

సమాజంలో ఎక్కడైనా ఒక దారుణమైన నేరం జరిగితే చాలు.. దానికి కారణం సినిమాల్లో చూపించే హింసేనంటూ కొందరు వెండితెరపైకి వేలెత్తి చూపడం పరిపాటిగా మారింది. అలా వేలెత్తి చూపే వారిపై తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఫైర్ అయ్యారు.

Sandeep Reddy Vanga

సమాజంలో ఎక్కడైనా ఒక దారుణమైన నేరం జరిగితే చాలు.. దానికి కారణం సినిమాల్లో చూపించే హింసేనంటూ కొందరు వెండితెరపైకి వేలెత్తి చూపడం పరిపాటిగా మారింది. సినిమా ప్రభావం వల్లే సమాజంలో నేర ప్రవృత్తి పెరుగుతోందంటూ మేకర్స్‌ను బోనులో నిలబెట్టే ప్రయత్నాలు తరచూ జరుగుతుంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఓ ఘోరమైన ఘటన తర్వాత కూడా కొందరు పరోక్షంగా సినిమాలపై విమర్శలు గుప్పించగా, బోల్డ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) వారికి ఊహించని రీతిలో సోషల్ మీడియా వేదిక గట్టి కౌంటర్ ఇచ్చారు. తన సినిమాలపై వస్తోన్న విమర్శలకు దీటుగా బదులిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో 15 ఏళ్ల పదో తరగతి విద్యార్థినిపై తరగతి గదిలోనే ఉపాధ్యాయుడు, 31 మంది తోటి విద్యార్థుల ఎదుటే ఓ 21 ఏళ్ల యువకుడు చెయిన్‌సాతో అత్యంత కిరాతకంగా దాడి చేసిన ఘటన (Andhra Pradesh Incident) రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే, ఈ విషాదం వెలుగులోకి వచ్చిన వెంటనే కొందరు నెటిజన్లు, సినీ వర్గాల వారు తెరపై మితిమీరిన హింసను చూపించే దర్శకుల వల్లే యువత ఇలా పెడదారిన పడుతోందంటూ విమర్శల దాడి మొదలుపెట్టారు. ముఖ్యంగా ‘యానిమల్’, ‘అర్జున్ రెడ్డి’ చిత్రాల్లోని హింసాత్మక సన్నివేశాలను ప్రస్తావిస్తూ సందీప్ రెడ్డి వంగాను టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు.


ఈ విమర్శలపై సందీప్ రెడ్డి వంగా ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘ఎవరైనా ఒక ఘోరమైన నేరానికి పాల్పడినప్పుడు, బాధితుల పట్ల కనీస సానుభూతి చూపించడం, ఆ అసలు సమస్య మూలాలను అర్థం చేసుకోవడం మొదటి స్పందన కావాలి. అంతేకానీ, చాలా సులభంగా సినిమాలను బలిపశువును చేయడం సరైన పద్ధతి కాదు’’ అని ఘాటుగా పేర్కొన్నారు.

విమర్శకుల తీరును కడిగిపారేస్తూ.. ‘‘మీ బాధ బాధితులపై లేదా వారి కుటుంబాలపై కాదని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇలాంటి భయానక విషాదాలను ఆసరాగా చేసుకుని మీ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి, ఇతరులపై విషం చిమ్మడానికి ఒక సాకుగా వాడుకుంటున్నారు. ముఖ్యంగా కెరీర్‌లో ఫెయిలై, తీవ్రమైన ఫ్రస్ట్రేషన్‌లో ఉండి, ఎలాంటి పనిపాటా లేని కొందరు నటీనటులు, కొద్దిమంది దర్శకులు, నిర్మాతలు.. ఇతర చిత్రాలను, వ్యక్తులను కించపరిచే అవకాశం దొరికినప్పుడల్లా హఠాత్తుగా తామేదో సమాజ సంస్కర్తల్లా అవతారమెత్తుతారు. ఇలాంటి పరాన్నజీవుల కోసమే నేను నేరుగా చెబుతున్నా. ఒక విషాదానికి కావాల్సింది నిజమైన సానుభూతి.. స్వార్థపూరిత అవకాశవాదం కాదు. ముందు ఆ రెండింటి మధ్య ఉన్న తేడాను తెలుసుకోండి’’ అంటూ సందీప్ గట్టి చురకలంటించారు.


సందీప్ రెడ్డి వంగా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన చెప్పినట్లుగా ఒక నేరం జరిగినప్పుడు వ్యవస్థాగత లోపాలు, పెంపకం, మానసిక రుగ్మతలను పట్టించుకోకుండా ప్రతిదానికీ సినిమా రంగంపై నెపం నెట్టడం ఎంతవరకు న్యాయమని కొందరు సందీప్‌కు మద్దతు తెలుపుతున్నారు. అయితే, సమాజంపై సినీ విజువల్స్ చూపించే ప్రభావాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని మరికొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా, ఈ విషాద ఘటనను అడ్డం పెట్టుకుని తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలనుకున్న వారికి సందీప్ తనదైన రా అండ్ రస్టిక్ శైలిలో ఇచ్చిన సమాధానం నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది.

ఇవి కూడా చదవండి:

సినిమా రెడీ... టైటిల్ మారాల్సిందే

దియా మీర్జా దీపావళి వీడియోపై రగడ.. బీఎంసీకి బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు

రామాయణ 3.. అంతా వారి చేతుల్లోనే

Updated Date - Nov 04 , 2026 | 03:26 PM

Sandeep Reddy Vanga: అప్పట్లో రంగస్థలం.. ఇప్పుడు పొట్టేల్‌

Sandeep Reddy Vanga: ఎవరైనా చనిపోతే.. అంత్యక్రియలకు అందుకే వెళ్లను

Sandeep Reddy Vanga: చిరంజీవి పేరుతో సమాధానమిచ్చేసరికి అంతా షాక్‌!

Sandeep Reddy Vanga: నటసింహం బాలయ్యకి ఫ్యాన్ అయిపోయా..

Sandeep Reddy Vanga: ప్రభాస్‌ 24 సినిమాలు వేరు... ఈ సినిమా వేరు!