Dragon: నీల్ మామ.. నీ లెక్కే వేరు పో!

ABN , Publish Date - Nov 04 , 2026 | 12:15 PM

పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయడానికి స్టార్స్ పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. డైరెక్టర్ కోరుకున్న లుక్ కోసం గెడ్డాలు, మీసాలు పెంచడం, అందుకు తగ్గ వెయిట్ లాస్ కావడమూ పరిపాటే.

jr ntr dragon

పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయడానికి స్టార్స్ పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. డైరెక్టర్ కోరుకున్న లుక్ కోసం గెడ్డాలు, మీసాలు పెంచడం, అందుకు తగ్గ వెయిట్ లాస్ కావడమూ పరిపాటే. యంగ్ టైగర్ యన్టీఆర్ తన 'డ్రాగన్' కోసం అలాగే మేకోవర్ అయ్యారు. ఆ న్యూ లుక్ కు తగ్గట్టుగానే యాక్షన్ సీన్స్ తీస్తున్నారట. ఆ ముచ్చటేంటో చూద్దాం.

డ్రాగన్ (Dragon ) గ్లింప్స్ చూసిన వారికి అందులో యన్టీఆర్ (NTR ) మరింత బక్కపలచగా కనిపించడం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకు యన్టీఆర్ అంతగా తగ్గాల్సి వచ్చిందనీ ఫ్యాన్స్ చర్చించుకున్నారు. 'డ్రాగన్' కోసం తారక్ దాదాపు 15 కిలోలు తగ్గినట్టు తెలుస్తోంది. ఇందులో తారక్ పోషించే హంతకుని పాత్రను దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) అలా రూపొందించారు. అందువల్ల డైరెక్టర్ సూచన మేరకు తారక్ అంతలా తగ్గాల్సి వచ్చింది. అంతేకాదు యన్టీఆర్ బరువు తగ్గి కనిపిస్తోన్న లుక్ కు తగినట్టుగా యాక్షన్ కొరియోగ్రాఫర్ డిసౌజా ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారట. ఇందులోని ఫైట్స్ ఎంతో సహజంగా, అందరూ ఔరా అనేలా తెరకెక్కిస్తున్నారట. అందుకోసమే యన్టీఆర్ తన బరువును తగ్గించుకున్నారని డిసౌజా అంటున్నారు.

యన్టీఆర్ తన పాత్రకు తగ్గట్టుగా తన శరీరాన్ని మలచుకుంటూ వస్తున్నారు. అలాగే హెయిర్ స్టైల్, వీలయితే బియర్డ్ లుక్ నూ మార్చేసుకుంటున్నారు. మొట్టమొదట 'యమదొంగ' కోసం తారక్ మేకోవర్ అయ్యారు. అంతకు ముందు ముద్దుగా బొద్దుగా ఉంటూనే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చారు తారక్. అలాగే లక్షలాది మంది అభిమానులను సంపాదించారు. అయినా 'యమదొంగ'లో ఆయనకు డైరెక్టర్ రాజమౌళి ఓ ఛాలెంజింగ్ కేరెక్టర్ ను ఇచ్చారు. యన్టీఆర్ సైతం ఛాలెంజ్ గా తీసుకొని తన బాడీని అనూహ్యంగా మలచుకున్నారు. ఆ తరువాత నుంచీ ప్రతి చిత్రంలోని పాత్రకు దర్శకులు సూచించిన తీరున తన ఆకృతిని మలచుకుంటున్నారు తారక్.

కేవలం సన్నబడటమే కాదు, 'టెంపర్' మూవీకి కండలు తిరిగి కనిపించడానికి కూడా యన్టీఆర్ ప్రయత్నించారు... అందులోని లుక్ తోనే ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చారు తారక్. మళ్ళీ 'అరవింద సమేత'లో నాజూగ్గా కనిపించారు యన్టీఆర్... ఇలా తన పాత్రల కోసం పరిశ్రమిస్తూ సాగుతున్నారు జూనియర్. ఈ సారి ప్రశాంత్ నీల్ తారక్ ను చూసి 'డ్రాగన్' మూవీలోని పాత్రను రూపకల్పన చేసుకున్నారు. అందుకు తగ్గట్టుగా యన్టీఆర్ మేకోవర్ అయ్యారు. ఇప్పుడు కూడా అభిమానులను ఇట్టే ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు యన్టీఆర్. అందులో ఏ మాత్రం సందేహం లేదు. మరి మేకోవర్ తో పాటు అభినయంతోనూ యంగ్ టైగర్ 'డ్రాగన్'లో ఏ తీరున మురిపిస్తారో చూడాలి.

Updated Date - Nov 04 , 2026 | 12:39 PM