‘పెద్ది’ కట్ చేసిన సీన్స్ నాకు ఇచ్చేయండి..: బుచ్చిబాబుకు జగపతి డిమాండ్
ABN , Publish Date - Jun 09 , 2026 | 07:13 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రం ఒక వైపు కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంటే.. మరోవైపు కాంట్రవర్సీలు కూడా సినిమాను వెంటాడుతున్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా నటించిన ‘పెద్ది’ (Peddi) చిత్రం ఒక వైపు కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంటే.. మరోవైపు కాంట్రవర్సీలు కూడా సినిమాను వెంటాడుతున్నాయి. ఇప్పటికే జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణపై బాలీవుడ్ మొత్తం గగ్గోలు పెడుతోంది. ఇంతకు ముందు కొన్ని సినిమాలలో (బాలీవుడ్ సినిమాలలోనే).. శ్రుతి మంచి ఎక్స్‌పోజింగ్ చేసిన వారు కూడా ఇప్పుడు జాన్వీ పాత్ర విషయంలో మాట్లాడుతుండటం విడ్డూరం. సరే ఆ విషయం పక్కన పెడితే.. గిరిజనులకు ప్రాధాన్యత ఇస్తూ, వారికో ఐడెంటిటీ కావాలని పోరాడిన యువకుడిగా ఇందులో ‘పెద్ది’ కనిపిస్తే.. అవమానించారంటూ గిరిజనులు కొందరు ఈ సినిమా టీమ్, సెన్సార్‌పై ఫిర్యాదు చేయడం విశేషం.
ఈ వివాదాలన్నీ ఇలా నడుస్తుండగానే.. ఇప్పుడు విలక్షణ నటుడు జగపతిబాబు (Jagapathi Babu) కామెంట్స్‌తో మరోసారి ఈ సినిమా వార్తలలో హైలెట్ అవుతోంది. చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానాపై జగ్గూ భాయ్ చేసిన తీవ్ర ఆరోపణలతో.. అసలు ‘పెద్ది’ వెనుక ఏం జరుగుతుందనేది ఎవరికీ అర్థం కావడం లేదు. సినిమాలో తన పాత్రకు సంబంధించిన చాలా సన్నివేశాలను కట్ చేశారని, ఈ విషయంలో బుచ్చిబాబుతో గొడవకు దిగానని జగపతిబాబు తన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఒక దర్శకుడు నాకు ఇలా కావాలని ఫిక్స్ అయిన తర్వాత నటులెవరూ మాట్లాడకూడదు. ఎందుకంటే, వారి నటించినందుకు, వారికి ఇవ్వాల్సింది ఎప్పుడో ఇచ్చేసి ఉంటారు. కానీ, సినిమాను ఓన్ చేసుకుని, తన నటనకు హైలెట్ అయిన సన్నివేశాలు తెరపై కనిపించకపోతే ఏ నటుడికైనా కోపం రావడం సహజం. అదే ఇప్పుడు జగపతిబాబుకి వచ్చింది.
‘‘రామ్ చరణ్ పాత్రకు, అప్పలసూరి పాత్రకు మధ్య ఇంకా అద్భుతమైన బాండింగ్ సన్నివేశాలున్నాయి. సినిమా చూసిన వారంతా సూరి, పెద్ది మధ్య బాండింగ్ ఇంకాస్త చూపించి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ బాండింగ్‌కు సంబంధించి చాలా సన్నివేశాలను బుచ్చిబాబు తీశాడు. కానీ, సినిమాలో అవి పెట్టలేదు. ఈ విషయంలో ఆయనతో గొడవకు దిగాను. సినిమా లెంగ్త్ ఇష్యూ అని చెప్పుకొచ్చాడు. అందుకు నేను ఒప్పుకోలేదు. ఆ సన్నివేశాలు తనకు నచ్చి ఉండవు. అందుకే కావాలని తీసేసినట్లుగా నాకు అనిపించింది’’ అని జగపతిబాబు తన ఆవేదనను వ్యక్తం చేశారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను ఏ సినిమాకు ఇలా మాట్లాడలేదు. నాకు సంబంధించిన పార్ట్‌ని న్యాయం చేశానా? లేదా? అని ఆలోచిస్తాను. కానీ, ‘పెద్ది’లో నాకు చాలా మంచి సన్నివేశాలు పడ్డాయి. నటుడిగా చాలా గ్యాప్ తర్వాత నన్ను సంతృప్తి పరిచిన చిత్రమిది. కానీ, నా సీన్లు కట్ చేయడంతో చాలా కోపం వచ్చింది. అందుకే, ఆ కట్ చేసిన సీన్లు ఇస్తే.. నా ఇన్‌స్టాలో పోస్ట్ చేసుకుంటానని అడిగినా, బుచ్చిబాబు నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఈ సినిమా కోసం నేను కూడా చాలా కష్టపడ్డాను’’ అని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
మెగా హీరోస్ రేంజ్ అది.. మూడు వందల కోట్ల క్లబ్‌లో ఆ ముగ్గురు
Peddi: గురువు సుకుమార్‌లా బ్యాలెన్స్ చేయలేకపోయిన బుచ్చి!
ఆ పనిచేస్తే టీవీకే సర్కారుకు మంచి పేరు -సత్యరాజ్