అందరి టార్గెట్ సంక్రాంతి సినిమానే!
ABN, Publish Date - Oct 06 , 2026 | 12:20 PM
మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు చేయడానికి ఐదుగురు దర్శకులు సిద్ధమవుతున్నట్లు టాక్. బుచ్చిబాబు సానా, శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్, గోపీచంద్ మలినేని పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఈ యేడాది 'మన శంకరవరప్రసాద్ గారు'తో బిగ్ హిట్ చూశారు మెగాస్టార్ చిరంజీవి. ఏడు పదులు దాటిన మెగాస్టార్ తో సినిమా చేయటానికి పలువురు క్యూ కడుతున్నారు. వారిలో ఐదుగురు డైరెక్టర్స్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఈ యేడాది అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిరంజీవి నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' గ్రాండ్ సక్సెస్ సాధించి, మూడు వందల కోట్ల క్లబ్ లో చేరింది. డెబ్బై ఏళ్ళు దాటినా ఇంకా ఎనర్జిటిక్ గా చిరంజీవి సాగుతూ ఉండడం విశేషం. ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో చిరంజీవి 'కాకా' మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 13వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే చిరంజీవితో సినిమాలు తీయడానికి ఆయనకు తగ్గ సబ్జెక్ట్స్ రెడీ చేస్తూ ఐదుగురు దర్శకులు సిద్ధమవుతున్నారట. వారిలో 'పెద్ది' సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు సానా, 'ద ప్యారడైజ్' దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇప్పటికే చిరంజీవికి సబ్జెక్ట్స్ వినిపించి ఓకే చేయించుకున్నారని టాక్. ఇక చిరుకు కెరీర్ లోనే బిగ్ హిట్ అందించిన అనిల్ రావిపూడి కూడా మరో సబ్జెక్ట్ తో రెడీ అవుతున్నారని వినికిడి. పవన్ కళ్యాణ్ తో 'గబ్బర్ సింగ్' తీసి బ్లాక్ బస్టర్ హిట్ పట్టేసిన హరీశ్ శంకర్, బాలకృష్ణతో 'వీరసింహారెడ్డి'తో బంపర్ హిట్ కొట్టేసి, ప్రస్తుతం 'దాదా' తెరకెక్కిస్తోన్న గోపీచంద్ మలినేని కూడా మెగాస్టార్ ను మెప్పించే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం.
'పెద్ది'లో రామ్ చరణ్ లాంటి యంగ్ మాస్ హీరోను విలక్షణమైన పాత్రలో చూపించి ఆకట్టుకున్నారు బుచ్చిబాబు సానా. ఇదే చిరంజీవిని ఆకట్టుకున్న అంశం. దాంతో బుచ్చిబాబుకు ఓ ఛాన్సిచ్చారు చిరు. చిన్నప్పటి నుంచీ చిరంజీవిని అభిమానిస్తూ వచ్చిన బుచ్చిబాబు మెగాస్టార్ ఇమేజ్ కు తగ్గ స్టోరీని సిద్ధం చేశారని టాక్. ఇక నానితో శ్రీకాంత్ ఓదెల తీసిన 'దసరా' సినిమా కూడా చిరంజీవిని ఆకట్టుకుంది. దాంతో చిరంజీవి హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో హీరో నాని నిర్మించే సినిమా ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ‘ది ప్యారడైజ్’ తర్వాత ఈ సినిమా ఉంటుందో లేదో అనే టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పటికే బాలకృష్ణ, వెంకటేశ్ తో సినిమాలు తీసిన గోపీచంద్ మలినేని ఆ తరానికి చెందిన టాప్ స్టార్ చిరంజీవితోనూ సాగాలని ఆశిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో 'గబ్బర్ సింగ్'తో బ్లాక్ బస్టర్ హిట్టు పట్టేసిన హరీశ్ శంకర్ చిరంజీవితో ఓ సినిమా తీసేస్తే ఈ జన్మకు అది చాలు అనుకుంటున్నారు. ఇక 'మన శంకరవరప్రసాద్ గారు'లో వెంకటేశ్ నూ కీ రోల్ లో నటింప చేశారు అనిల్ రావిపూడి. ఈ సారి చిరంజీవి, నాగార్జున కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం రూపొందించే ప్రయత్నంలో అనిల్ ఉన్నట్టు సమాచారం. ఇలా ఈ ఐదుమంది దర్శకులు చిరంజీవితో సినిమాలు తీయాలని తపిస్తున్నారు.
చిరంజీవికి మొదటి నుంచీ సంక్రాంతి చిత్రాలు బాగా కలసి వచ్చాయి. ఇక చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళొచ్చాక 'ఖైదీ నంబర్ 150'తో రీ ఎంట్రీ ఇచ్చారు. 2017 సంక్రాంతి కానుకగా వచ్చిన 'ఖైదీ నంబర్ 150' భారీ విజయం సాధించింది. 2023 పొంగల్ లో 'వాల్తేరు వీరయ్య'గా విజయాన్ని సొంతం చేసుకున్నారు చిరంజీవి. ఈ యేడాది సేమ్ సీన్ రిపీట్ చేస్తూ సంక్రాంతిలోనే 'మన శంకరవరప్రసాద్ గారు'తో బంపర్ హిట్ పట్టేశారు. ఇలా ఈ మధ్య కాలంలో సంక్రాంతి చిత్రాలే చిరుకు బిగ్ హిట్స్ అందించాయి. మధ్యలో వచ్చిన సినిమాలేవీ అంతగా మురిపించలేకపోవడం గమనార్హం. అందువల్లే చిరంజీవి, బాబీ కాంబోలో వస్తోన్న రెండో చిత్రాన్ని కూడా పొంగల్ బరిలోనే నిలుపుతూ ఉండడం విశేషం. అదే తీరున చిరుతో సినిమాలు తీయాలని తపిస్తోన్న డైరెక్టర్స్ కూడా సంక్రాంతినే టార్గెట్ చేసుకుంటారనీ వినిపిస్తోంది. అదే నిజమైతే మరో ఐదేళ్ళ వరకూ చిరంజీవి చిత్రాలు సంక్రాంతికే వస్తాయని ఫిక్స్ అయిపోవచ్చు. ఇంతకూ ఈ ఐదుగురు దర్శకుల చిత్రాల్లో చిరంజీవి ఎప్పుడు నటిస్తారు అన్నది ప్రశ్న. వీరిలో ముందుగా చిరంజీవి, బుచ్చిబాబు కాంబో రానుందని టాక్. మరి మిగిలిన వారి సినిమాల కథేంటో తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
వెంకటేష్ సినిమా వాయిదా.. శ్రీవిష్ణుకి లక్కీ ఛాన్స్
Husharu 2: హుషారు 2’.. ఈసారి ఫన్, మ్యాడ్‌నెస్ డబుల్!
గరివిడి లక్ష్మీ తెలుసా.. ఎంత బావుంది ట్రైలర్