Husharu 2: హుషారు 2’.. ఈసారి ఫన్, మ్యాడ్‌నెస్ డబుల్!
ABN , Publish Date - Oct 05 , 2026 | 09:17 PM
యూత్‌ను ఆకట్టుకున్న సినిమాల్లో ‘హుషారు’కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. 2018లో విడుదలైన ఈ చిత్రం కుర్రకారును మెప్పించడంతో పాటు మంచి విజయాన్ని అందుకుంది.
యూత్‌ను ఆకట్టుకున్న సినిమాల్లో ‘హుషారు’కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. 2018లో విడుదలైన ఈ చిత్రం కుర్రకారును మెప్పించడంతో పాటు మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ సిద్ధమవుతోంది. దర్శకుడు శ్రీ హర్ష కోనుగంటి ‘హుషారు 2’ను అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను సోమవారం విడుదల చేశారు. రాహుల్ రామకృష్ణ, అశోక్ గల్లా, రవి అంథోని, దినేష్ తేజ్, శశిధర్ కోచర్లకోట కీలక పాత్రధారులుగా ‘హుషారు 2’ టైటిల్ పోస్టర్ ను ఆసక్తికరంగా డిజైన్ చేశారు. మొదటి భాగంలో ఐదుగురు స్నేహితులు తయారు చేసిన కబూమ్ బీరు ట్రక్కుపై కనిపిస్తుంది. ఆ ట్రక్కును ఇరువైపుల నుంచి కొందరు వ్యక్తులు లాగుతున్నట్లు పోస్టర్‌లో చూపించారు. తాడుల స్థానంలో పాము కనిపించడం, దాని మధ్యలో స్నేహితులు చిక్కుకుని భయపడుతున్నట్లు చూపించడం ప్రత్యేకంగా ఉంది. ట్రక్కు కింద తాబేలు, కొద్దిదూరంలో బంగారు నగలతో ఉన్న పెట్టె కూడా కనిపిస్తున్నాయి. వెనుక ఫ్యాక్టరీ సెటప్‌ను చూపించారు. ఈ విజువల్స్‌ను దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం సముద్రాన్ని మథించిన కథ గుర్తొస్తుంది. అయితే ఈ కాన్సెప్ట్ వెనుక ఉన్న అసలు కథేంటన్నది తెలియాల్సి ఉంది. మొదటి భాగం అందించిన యూత్‌ఫుల్ ఎనర్జీని కొనసాగిస్తూ ‘హుషారు 2’ను మరింత ఫన్, మ్యాడ్‌నెస్, నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. యువతకు కనెక్ట్ అయ్యే అంశాలతో పాటు కొత్త తరహా కామెడీ, రిలేషన్‌షిప్ ఎలిమెంట్స్‌తో సినిమాను రూపొందిస్తున్నారు.
మళ్లీ మెగాఫోన్ పట్టిన శ్రీ హర్ష
2018లో వచ్చిన ‘హుషారు’కు కథ, దర్శకత్వం వహించిన శ్రీ హర్ష కోనుగంటి ఇప్పుడు సీక్వెల్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. యూత్ కల్చర్, ఆధునిక సంబంధాలు, కామెడీని తనదైన శైలిలో తెరకెక్కించే శ్రీ హర్ష.. ఈసారి మరింత కొత్తగా కథను చూపించనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే సినిమా కీలక సన్నివేశాల షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివర్లో ‘హుషారు 2’ను గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.