Chirajeevi: 'కాకాజీ'గా మెగాస్టార్!
ABN , Publish Date - Jan 24 , 2026 | 03:03 PM
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాకు 'కాకాజీ' అనే పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అలానే ఆదివారం 'మన శంకర వర ప్రసాద్ గారు' విజయోత్సవ సభ జరుగబోతోంది.
మెగాస్టార్ చిరంజీవి బిగ్ హిట్ మూవీ 'మన శంకరవరప్రసాద్ గారు' సక్సెస్ సెలబ్రేషన్స్ ఆదివారం సాగనున్నాయి... దాంతో పాటు ఫ్యాన్స్ కు ఆసక్తి కలిగించే పలు అంశాలు వెలుగు చూశాయి.
చిరంజీవి అభిమానులు ఆశిస్తున్న గ్రాండ్ సక్సెస్ ఆయన దరి చేరింది. పాలిటిక్స్ వదిలేసి పూర్తిస్థాయిలో సినిమాల్లో సాగాలని నిర్ణయించినప్పుడు 2017లో 'ఖైదీ నంబర్ 150' మూవీ ఓ సాలిడ్ హిట్ ను అందించింది. ఆ తరువాత మధ్యలో ఎన్ని ప్రయోగాలు చేసినా కలసి రాలేదు. 2023లో 'వాల్తేరు వీరయ్య'తో మరో బంపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు చిరంజీవి. ఆ మూవీ తరువాత ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా 'మన శంకరవరప్రసాద్ గారు'తో ఘనవిజయాన్ని సాధించారు చిరు. తెలుగు భాషలో మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం ఇప్పటికే రూ. 300 కోట్లకు పైగా పోగేసింది. రీజనల్ ఫిలిమ్స్ లో ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని మేకర్స్ చెబుతున్నారు.. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 'మన శంకరవరప్రసాద్ గారు' విజయోత్సవం గ్రాండ్ గా సాగనుంది. ఈ వేడుకలో చిరంజీవి, వెంకటేశ్ తో పాటు కె. రాఘవేంద్రరావు వంటి పలువురు సినీ ప్రముఖులు కూడా పాలు పంచుకోనున్నారు. ఈ వేడుక తప్పకుండా అభిమానులకు మరింత ఆనందం పంచుతుందని చెప్పవచ్చు.
ఇక 'విశ్వంభర'వైపు... ఫ్యాన్స్ చూపు...
'మన శంకరవరప్రసాద్ గారు' ఘనవిజయంతో చిరంజీవి అంతకు ముందే నటించిన 'విశ్వంభర' విడుదల ఎప్పుడు అన్నచర్చ మొదలయింది. గ్రాఫిక్స్ కారణంగా 'విశ్వంభర' విడుదలలో జాప్యం జరిగిందని యూవీ క్రియేషన్స్ సంస్థాధినేతలు గతంలోనే చెప్పారు. ఇప్పుడు అన్నీ సమకూర్చుకొని 'విశ్వంభర' విడుదల కానుంది. వేసవిలో ఈ చిత్రం జనం ముందుకు రానుందని తెలుస్తోంది. ఇందులోని గ్రాఫిక్స్ పాన్ ఇండియా రేంజ్ లో అలరించేలా ఉంటాయని అంటున్నారు. 'మన శంకరవరప్రసాద్ గారు' సక్సెస్ అందించిన కిక్కుతో ఫ్యాన్స్ 'విశ్వంభర'ను సైతం విజయపథంలో పయనింప చేస్తారని సినీజనం అంటున్నారు.
'కాకాజీ'గా చిరంజీవి...
'వాల్తేరు వీరయ్య'తో చిరంజీవికి బంపర్ హిట్ ను అందించిన బాబీ కొల్లి డైరెక్షన్ లోనే చిరుతో మరో మూవీ రూపొందనుంది. ఈ సినిమాకు 'కాకా' అని కానీ, 'కాకాజీ' అన్న టైటిల్ ను కానీ నిర్ణయిస్తారని విశేషంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన స్టోరీ డిస్కషన్స్, స్క్రిప్ట్ రూపకల్పన కోసం బాబీ, ఆయన బృందం దుబాయ్ లో మకాం వేశారని టాక్. ఏది ఏమైనా ఇక వరుసగా చిరంజీవి చిత్రాలు ఫ్యాన్స్ ను అలరిస్తూ సాగుతాయని పరిశీలకులు అంటున్నారు. చిరంజీవి లాంటి మెగాస్టార్ మూవీస్ వరుసగా వస్తే కొన్ని థియేటర్స్ కు తగిన ఫీడ్ లభించినట్టే!. ఆయన స్ఫూర్తితో యంగ్ హీరోస్ కూడా ఏడాదికి మూడు సినిమాలు చేసుకుంటూ పోతే పరిశ్రమకు మంచిదనీ అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.
Also Read: The Bluff: నిన్న రాజమౌళి... నేడు మహేశ్...
Also Read: Kollywood: విజయ్ 'గిల్లీ'ని దాటేసిన అజిత్ 'మంగాత్తా'!