అందుకే తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ చేయడం లేదు- బోయపాటి శ్రీను
ABN, Publish Date - May 11 , 2026 | 09:59 PM
రెండు దశాబ్దాలకు పైబడి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న దర్శకుడు బోయపాటి శ్రీను, ఆదివారం తిరుమల శ్రీవారిని, తిరుపతిలో తాతయ్య గుంట గంగమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను తెలిపారు.
‘తిరుపతి ప్రాంతంలో అద్భుతమైన లోకేషన్లు ఉన్నాయి. సినిమా షూటింగుల పరంగా ఇక్కడ లేని లోకేషన్లంటూ లేవు. అయితే జనం రద్దీతో అంతరాయం కలుగుతుందనే భయంతోనే షూటింగులు జరగడం లేదనుకుంటున్నా. శ్రీవారి ఆశీస్సులతోనే ఈ స్థాయిలో ఉన్నా.. తిరుపతితో తెలియని అనుబంధం పెనవేసు కుపోయింది’ అంటూ తన మనసులో మాటలు బయట పెట్టారు దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu). రెండు దశాబ్దాలకు పైబడి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన ఆదివారం తిరుమల శ్రీవారిని, తిరుపతిలో తాతయ్య గుంట గంగమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చిన విషయాలివే..
లొకేషన్లు ఉన్నా..
తిరుపతి (Tirupati) ప్రాంతంలో అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయి. శేషాచల పర్వతాలు, పచ్చటి అడవులు, తలకోన జలపాతం, స్వర్ణముఖి నది, శ్రీకాళహస్తి, పులిగుండు, పాకాల ఆనందగిరి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం, గుడిమల్లం... ఇలా చెప్పుకుంటూ పోతే జాబితాకు అంతూపొంతూ ఉండదు. 20 ఏళ్ల కిందటి వరకూ విస్తృతంగా సినిమా షూటింగులు జరిగేవి. తలకోన వంటి ప్రదేశాల్లో అయితే ఇతర రాష్ట్రాల నుంచి కూడా సినిమా యూనిట్లు వచ్చి షూటింగులు చేసేవారు. ఇపుడా పరిస్థితి లేదు. కారణం జనం రద్దీ పెరగడమే. ఈ ప్రాంతంలో ఎక్కడ షూటింగ్ అన్నా జనం విపరీతంగా చేరిపోతారు. భద్రత, ట్రాఫిక్ సమస్యలతోపాటు షూటింగులకు అంతరాయం కలుగుతుంది. ఇక్కడే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. అందుకే మమ్మల్ని గుర్తు పట్టని, మేమెవరో తెలియని ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.
మొబైల్ ఫోన్లతో సీన్లు, గెటప్స్ లీకయ్యే ప్రమాదం
ఇప్పుడు అందరి చేతుల్లోనూ సెల్‌ఫోన్స్, అందులో అత్యాధునిక కెమెరాలు ఉన్నాయి. ఎక్కడో బిల్డింగుల్లో కూర్చొని కూడా జూమ్ చేసి షూటింగ్ స్క్రీన్లను, నటీనటుల గెటప్‌ను వీడియోలు తీసే ప్రమాదముంది. భారీ ఖర్చు చేసి తీసే సినిమాల షూటింగ్ సీన్లు.. అదే రోజు సాయంత్రానికల్లా సోషల్ మీడియాలో వచ్చేస్తాయి. ఇలా లీకైతే సినీ పరిశ్రమకు చాలా నష్టం చేస్తుంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో షూటింగులు తగ్గుతున్నాయి.
అఖండ క్లైమాక్స్ పులిగుండులో తీయాలనుకున్నాం
నందమూరి బాలకృష్ణ హీరోగా తీసిన అఖండ పార్ట్ వన్ సినిమా క్లైమాక్స్.. నిజానికి పెనుమూరు మండలం పులిగుండు వద్ద చిత్రీకరించాలని అనుకున్నాం. లొకేషన్ చూద్దామని వెళితే నన్ను చూడ్డానికే వందల్లో జనం పోగయ్యారు. ఇక బాలకృష్ణతో అక్కడ షూటింగ్ అంటే ఇంకెంత రద్దీ ఉంటుంది? దానికి తోడు అఘోరా క్యారెక్టర్ గెటప్ లీకయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకే షూటింగ్ లొకేషన్ మార్చుకుని తమిళనాడులోని సెంజి కోటలో తీయాల్సి వచ్చింది.
జిల్లాలో లొకేషన్లకు ప్రాచుర్యం పెరగాలి
జిల్లాలో సముద్ర తీరం, పులికాట్ సరస్సు, స్వర్ణముఖి నది, అనేక జలపాతాలు, వాటితో కూడిన ఆలయాలు... ఇలా చెప్పుకుంటూపోతే చాలా మంచి లొకేషన్లు ఉన్నాయి. వాటికి ప్రాచుర్యం పెరగాలి. జిల్లాలో సినిమా షూటింగులకు పనికొచ్చే అందమైన ప్రదేశాలు ఫలానా వున్నాయంటూ అటు ప్రజలకు, ఇటు సినిమా పరిశ్రమకూ తెలియాలి. అపుడు సినీ ప్రముఖులు రాకున్నా, కొత్తగా పరిశ్రమలోకి వచ్చేవారు తప్పనిసరిగా ఇటు వచ్చే అవకాశముంది.
తిరుపతితో తెలియని అనుబంధం
తిరుపతితో తెలియని అనుబంధం పెనవేసుకుపోయింది. శ్రీవారి ఆశీస్సులతోనే ఈ స్థాయిలో ఉన్నానని ప్రగాఢంగా విశ్వసిస్తా. నా పెళ్లి జరిగింది కూడా తిరుమల వెయ్యికాళ్ల మండపంలోనే, అందుకే ఏమి చేయాలన్నా ముందుగా తిరుమల వచ్చి, స్వామిని దర్శించుకున్నాకే ఆ పని మొదలు పెడుతుంటా. తిరుమల దివ్యారామం ప్రాంతానికి చేరితే చాలు మరేదో లోకంలోకి ప్రవేశించిన భావన కలుగుతుంది. చల్లటి గాలి, అడవి పరిమళం మనల్ని అద్భుతంగా పలకరిస్తుంది. ఇక శ్రీవారి దర్శనం, అమృతమయమైన ప్రసాదాల అనుభూతి గురించి చెప్పలేను. తిరుమలలో అద్భుతమైన తీర్థాలు పది ఉన్నాయి. వాటిల్లో స్నానం చేస్తే సర్వ రోగాలూ పోతాయనే నమ్మకం ఉంది. అయితే ఎక్కువగా అనుమతిస్తే ప్లాస్టిక్ వ్యర్ధాలు పోగవుతాయి. ఈ తీర్థాల్లోని జలాలను, అక్కడి పర్యావరణాన్ని స్వచ్ఛంగానే ఉండనివ్వాలి. ఇక్కడ బంధువులు చాలా మంది వున్నారు. స్నేహ వర్గమూ ఉంది. నందమూరి ఫ్యాన్ బేస్ గురించి చెప్పనక్కర్లేదు. వారైతే నన్ను వాళ్ల కుటుంబ సభ్యుడిగానే ఆదరిస్తుంటారు. అలాగే ఏటా వీలున్నంతవరకూ తిరుపతి గంగ జాతరకు వస్తా. అమ్మవారిని దర్శించుకుంటే కలిగే, ఆ వైబ్రేషన్స్ వేరు. లక్షల్లో జనం రావడం ఏమిటి? అని ఆశ్చర్యం వేస్తుంది. ‘భద్ర, లెజెండ్, సరైనోడు’ సినిమాలు చేసేటప్పుడు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నా. ఇకమీదట సినిమాలకు స్క్రిప్ట్ ఎక్కడ రాసుకున్నా దాని డిస్కషన్ మాత్రం తిరుపతిలోనే పెట్టుకుందామని డిసైడయ్యా. ఇదే కాదు కాణిపాకం, శ్రీకాళహస్తి, గుడిమల్లం ఆలయాలూ మనసుకు బాగా నచ్చుతాయి. గుడిమల్లంలోని పరశురామేశ్వరాలయం ఒక అద్భుతం.. ఆలయంలోకి అడుగు పెట్టగానే గుండె ఝల్లుమంటుంది. అద్భు తమైన శక్తి ఉంది. పులిగుండు వద్ద కూడా అలాంటి ఫిలింగే కలుగుతుంది. పాఠాల సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం కూడా అద్భుతంగా ఉంది.
ఇవి కూడా చదవండి:
Peddi Movie: ‘పెద్ది’ ట్రైలర్‌కు డేట్ ఫిక్సయింది.. బుచ్చిబాబు ప్లాన్ ఇదే!
తన తొలి సినిమా హీరో విజయ్ పై ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్!
అవసరమే కానీ.. పెళ్లిపై ఫరియా అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్!
‘అండర్ రేటెడ్’ నటిగా చూస్తున్నారా? పాయల్ రాజ్‌ఫుత్ సమాధానమిదే!