Veerabhadrudu: సూర్య మాస్ కంబ్యాక్.. బుక్ మై షో బద్దలవుతోంది!
ABN, Publish Date - May 16 , 2026 | 04:45 PM
గత కొంతకాలంగా సూర్యకు సరైన సక్సెస్ పడలేదు. ఎన్నో ఆశలతో వచ్చిన ‘కంగువా’, అలాగే ‘రెట్రో’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దారుణంగా నిరాశపరిచాయి. ఇప్పుడొచ్చిన ‘కరుప్పు’ రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళుతోంది.
గత కొంతకాలంగా సూర్య (Suriya)కు సరైన సక్సెస్ పడలేదు. ఎన్నో ఆశలతో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో వచ్చిన ‘కంగువా’, అలాగే ‘రెట్రో’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దారుణంగా నిరాశపరిచాయి. సూర్య పని అయిపోయింది అనుకున్న తరుణంలో.. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ, బాక్సాఫీస్ షేక్ అయ్యేలా ఒక సాలిడ్ మాస్ కంబ్యాక్ ఇచ్చాడు సింగం సూర్య. క్రేజీ డైరెక్టర్ ఆర్జే బాలాజీ (RJ Balaji) దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన చిత్రం కరుప్పు (Karuppu). ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. తెలుగులో ఈ చిత్రాన్ని ‘వీరభద్రుడు’ (Veerabhadrudu) అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో డబ్బింగ్ చేశారు. ఎన్నో వాయిదాలు, మరెన్నో అడ్డంకులను దాటుకుని.. ఎట్టకేలకు ఈ నెల 15న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది.
సినిమా థియేటర్లలోకి రాకముందు రకరకాల కామెంట్లు వినిపించాయి. కానీ, ఒక్కసారి మొదటి ఆట పడగానే సీన్ మొత్తం మారిపోయింది. ఇటు బుకింగ్స్ పరంగా, అటు పబ్లిక్ టాక్ పరంగా ‘కరుప్పు’ అలియాస్ ‘వీరభద్రుడు’ థియేటర్లలో దుమ్ము దులిపేస్తోంది. నెగెటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళ నోళ్లు మూతపడేలా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. కోలీవుడ్‌లో ఇండస్ట్రీ హిట్ సాధించిన ‘లియో’ (Leo), సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కూలీ’ (Coolie) సినిమాల తర్వాత.. ఆ రేంజ్‌లో బుకింగ్స్ హోరెత్తుతున్న సినిమా ఇదొక్కటే అని ట్రేడ్ వర్గాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. కేవలం గడిచిన 24 గంటల్లోనే.. అటు తమిళం, ఇటు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఒక్క బుక్ మై షో యాప్‌లోనే దాదాపు 7 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయంటే ఈ సినిమా రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. తమిళ సినిమా చరిత్రలో అత్యంత వేగంగా టికెట్లు అమ్ముడైన సినిమాల్లో ‘లియో’ టాప్ పొజిషన్‌లో ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో ‘కూలీ’ ఉంది. ఇప్పుడు ఆ క్రేజీ లిస్ట్‌లోకి సూర్య ‘కరుప్పు’ సగర్వంగా చేరిపోయింది.
ఈ సినిమాలో అంతలా ఏముంది? ప్రేక్షకులు ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారు? అంటే దానికి ప్రధాన కారణం.. సూర్య వన్ మ్యాన్ షో! ఈ చిత్రంలో సూర్య తన నట విశ్వరూపాన్ని చూపించేశాడు. ఒకవైపు పవర్‌ఫుల్ దేవుడి క్యారెక్టర్‌లో గంభీరత్వాన్ని పలికిస్తూనే.. మరోవైపు సొసైటీ కోసం పోరాడే పదునైన లాయర్ పాత్రలో అద్భుతంగా ఇమిడిపోయాడు. క్లైమాక్స్ సీన్లలో సూర్య నటన చూస్తుంటే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయం అని ఆడియన్స్ చెప్తున్నారు. ఇంటర్వెల్ బ్లాక్, కోర్టు రూమ్ డ్రామా సీన్స్ ఈ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. ఏదేమైనా, ఎన్నో రోజుల నుంచి సూర్యతో దోబూచులాడుతున్న ఆ సాలిడ్ హిట్.. ఎట్టకేలకు ‘వీరభద్రుడు’ రూపంలో వరించింది. సూర్య ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. లాంగ్ రన్‌లో ఈ సినిమా మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
Chiranjeevi: ‘పెద్ది’ ట్రైలర్ చూశా.. ఒక్కొక్కరు రఫ్ఫాడించేశారు!
Keneeshaa: 4 నెలల బిడ్డను కోల్పోయిన నేను.. జయం రవి జీవితం నాశనం చేస్తానా?
లవ్ - రిలేషన్‌పై మిల్కీ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు
మోదీ ‘పొదుపు మంత్రం’.. కమల్ హాసన్ సంచలన ప్రకటన!