Keneeshaa: 4 నెలల బిడ్డను కోల్పోయిన నేను.. జయం రవి జీవితం నాశనం చేస్తానా?
ABN , Publish Date - May 16 , 2026 | 10:33 AM
నాలుగు నెలల బిడ్డను కోల్పోయాను. ఎడబాటు (విరహం) బాధ ఏంటో తనకు బాగా తెలుసని ప్రముఖ గాయని కెనిషా అన్నారు. కోలీవుడ్ హీరో రవి మోహన్ - ఆర్తి రవి దంపతులు విడిపోవడానికి కెనీషా ప్రధాన కారణమంటూ ప్రచారం జరుగుతోంది.
నాలుగు నెలల బిడ్డను కోల్పోయాను. ఎడబాటు (విరహం) బాధ ఏంటో తనకు బాగా తెలుసని ప్రముఖ గాయని కెనిషా (Keneeshaa) అన్నారు. కోలీవుడ్ హీరో రవి మోహన్ (Ravi Mohan) - ఆర్తి రవి (Aarti Ravi) దంపతులు విడిపోవడానికి కెనీషా ప్రధాన కారణమంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై తాజాగా కోలీవుడ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె వివరణ ఇచ్చారు. అంతేకాదు, సోషల్ మీడియా వేదికగా కూడా ఆమె ఎమోషనల్ అవుతూ.. ఓ ప్రకటనను విడుదల చేశారు.
ముందుగా కెనీషా మాట్లాడుతూ.. ‘‘చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాను. నేను మైనర్‌గా ఉన్నపుడు మా బంధువు ఒకరు లైంగికంగా వేధించారు. 18 ఏళ్ల వయసులో వివాహం జరిగింది. నాలుగు నెలల గర్భంతో ఉన్న సమయంలో నా భర్త అతని స్నేహితుల ముందు దారుణంగా కొట్టాడు. దీంతో నాలుగు నెలల బిడ్డను కోల్పోయాను. తల్లి, తండ్రి, బిడ్డ ఇలా అన్నీ కోల్పోయిన నేను హీరో రవి మోహన్ జీవితాన్ని నాశనం చేయాలని భావిస్తానా? నా బిడ్డ మరణం నుంచి నేను బయటపడటానికి ఎంత కష్టపడ్డానో, ఎన్ని సంవత్సరాలు పట్టిందో నాకు తెలుసు. అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న నేను రవి మోహన్, అతని కుటుంబం, పిల్లలను విడదీయాలని లేదా వారిని దూరంగా చేయాలని అనుకుంటానా?
అదేసమయంలో రవి మోహన్ చిన్నపిల్లవాడు కాదు. జీవితంలో ఏం చేయాలో అతనికి బాగా తెలుసు. అతను ఎవరితో మాట్లాడాలి? ఎవరితో స్నేహం చేయాలి? అన్ని నిర్ణయించుకునే హక్కు ఆయనకు ఉంది. అలాంటపుడు ఆ దంపతుల వివాదంలోకి నన్ను ఎందుకు లాగుతున్నారు. రవి - ఆర్తి దంపతుల విడాకులకు నేనే కారణమంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ తప్పుడు ప్రచారంపై లీగల్ నోటీసులు పంపిన తర్వాత కూడా నాపై దుష్ప్రచారం ఆపలేదు. నన్ను విమర్శించే ముందు అసలు నేను ఎవరో తెలుసుకోండి. అసత్యవార్తలు ప్రచారం చేసి డబ్బులు సంపాదించుకునే వారంతా ప్రపంచంలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటిపై దృష్టిసారించండి’’ అని కెనిషా హితవు పలికారు.
సోషల్ మీడియా పోస్ట్‌లో.. ‘‘నేను చెప్పాల్సిందానికంటే, చెప్పగలిగిన దానికంటే ఎక్కువగానే మాట్లాడాను. అందులో చాలావరకు అనవసరమైనది కూడా ఉంది. నేను ఈ స్టోరీలోకి ప్రేమతో అడుగుపెట్టాను. ఇప్పుడు సైలెంట్‌గా దీని నుంచి బయటకు వచ్చేస్తున్నాను. కొన్నిసార్లు సృష్టించబడిన కథనాలు ఎలా ఉంటాయంటే.., అక్కడ మంచితనం శ్వాస తీసుకోవడానికి కూడా చోటుండదు. అలాంటప్పుడు, ప్రేమ కూడా ఆ ప్రదేశంలో ఉండదు. ఇలాంటి కథనాలను ఫేస్ చేస్తున్న ఒక వ్యక్తిని రక్షించడానికి నేను నా జీవితంలోని కొన్ని భాగాలను ధారపోశాను. కానీ ఇప్పుడు నాకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. ఆర్భాటాలకు, హంగామాకు అలవాటుపడిన ఈ ప్రపంచంలో, దయకు చోటు లేదు.
ప్రజలకు, సినీ పరిశ్రమకు, వ్యాఖ్యాతలకు, అతన్ని ప్రేమించే వారికి, ద్వేషించే వారికి, సమర్థించే వారికి, ఎగతాళి చేసే వారికి, అతని జీవితంపై హక్కును క్లెయిమ్ చేసే వారికి.. ఒక్కటే చెబుతున్నా.. ఇకపై అతను మీకే సొంతం. ఇకపై ఎలాంటి వివరణలు ఉండవు. సమర్థించుకోవడాలు ఉండవు. అసలు నాది కాని యుద్ధం నిలబడి ఇకపై పోరాడలేను. మంచి వ్యక్తులకు జీవించడానికి ఒక అవకాశం కావాలని, ఆ ప్రపంచంలో వారికి మద్దతుగా నిలవడమే మనం చేయగలిగిన సహాయమనుకుని నేను మూర్ఖత్వం ప్రదర్శించాను. కానీ నాకు ఇప్పుడర్థమైంది ఏమిటంటే, ఈ స్థలం కేవలం అబద్ధాలకోరులకు, మోసగాళ్లకు, మాయగాళ్లకు, జీవితాలను పీల్చిపిప్పి చేసేవారికి మాత్రమే. అందుకే, నేను అతన్ని ప్రశాంతతతో, ప్రేమతో వదిలేస్తున్నాను. నేను నాపై వేసుకున్న బాధ్యతలన్నింటి నుంచి కూడా తప్పుకుంటున్నాను. బహుశా త్యాగాలతో కూడిన నిజాల కంటే, భావోద్వేగాలతో అల్లిన కథనాలపైనే ప్రజలు ఆసక్తికనబరుస్తారు. అలాగే కానివ్వండి. మీరంతా అనుకున్నదే మీకు దక్కింది. అందుకే ఈ రోజు నుంచి.. ఈ విషయాన్ని వదిలేస్తున్నాను. నేను చెన్నై వదిలి వెళ్ళిపోతున్నాను, ఓటమిని అంగీకరిస్తున్నాను. నా సంగీతాన్ని, నా థెరపీని, ఇప్పటివరకు నేను గడిపిన జీవితానికి సంబంధించిన వాటన్నింటినీ వదిలేస్తున్నాను. వీటన్నింటికీ కారణం నాపై నడుస్తోన్న ట్రోలింగే. అందుకే సోషల్ మీడియా నుంచి కూడా లాగ్ ఆఫ్ అవుతున్నాను. ఇకనైనా అందరూ నాకు కావలసిన వ్యక్తిగత ప్రశాంతతను ఇవ్వాలని కోరుకుంటున్నాను..’’ అంటూ ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యారు.
ఇవి కూడా చదవండి:
లవ్ - రిలేషన్‌పై మిల్కీ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు
Peddi Movie: రామ్ బుజ్జిగా దివ్యేందు శర్మ.. వీడియో వైరల్!
మోదీ ‘పొదుపు మంత్రం’.. కమల్ హాసన్ సంచలన ప్రకటన!
Varanasi: ‘వారణాసి’ కోసం మైత్రీ వేట.. టెంప్టింగ్ ఆఫర్!