Suriya - Agaram: 15 ఏళ్ల ప్రయాణం.. 51 మంది డాక్టర్లు.. 1800 మంది ఇంజనీర్లు..
ABN , Publish Date - Aug 05 , 2025 | 05:28 PM
తమిళస్టార్ సూర్య తెరపైనే కాదు. నిజ జీవితంలోనూ హీరోనే. తను సంపాదించిన సొమ్ములో కొంత సమాజానికి తిరిగిచ్చేసే హీరో అతను. 2006లో అగరం ఫౌండేషన్‌ను ప్రారంభించారు సూర్య. దీనికి చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ స్ఫూర్తి అని ఆయన ఎన్నోసార్లు చెబుతుంటారు.
తమిళస్టార్ సూర్య (Suriya) తెరపైనే కాదు. నిజ జీవితంలోనూ హీరోనే. తను సంపాదించిన సొమ్ములో కొంత సమాజానికి తిరిగిచ్చేసే హీరో అతను. 2006లో అగరం ఫౌండేషన్‌ను (Agaram Foundation) ప్రారంభించారు సూర్య. దీనికి చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ స్ఫూర్తి అని ఆయన ఎన్నోసార్లు చెబుతుంటారు. చదువుకోవాలని ఉండి.. ఆ ఆశ తీరని పేదలకు అండగా ఉండటం, విద్య అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం 'అగరం' లక్ష్యం. అలా ఎంతో మంది పేదలను చదివించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు సూర్య. అలాగే కష్టాల్లో ఉన్నవారినీ ఆదుకున్నారు. అగరం ఫౌండేషన్ స్థాపించి 15 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా చెన్నైలోని ఒక ప్రైవేట్ కళాశాలలో వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు కమల్‌హాసన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. నటుడు శివకుమార్, సూర్య, కార్తీ, జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్ రాజా, వెట్రిమారన్, నిర్మాత కలైపులి ఎస్ ధాను తదితరలు హాజరయ్యారు.
2006లో మొదలైన అగరం ఫౌండేషన్, తమిళనాడులోని పేద, వెనుకబడిన విద్యార్థులకు అండగా నిలిచింది. వారి భవిష్యత్తుకు ఆశాకిరణంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులను స్కూల్స్ వైపు నడిపించే బాధ్యతను తీసుకుంది. దాదాపు 15 సంవత్సరాలుగా ఓ యజ్ఞంలా ఆ ఫౌండేషన్ పని చేస్తోంది. ఇప్పటిదాకా దాదాపు 8 వేల మందికి పైగా పేద విద్యార్థులను చదివించిందీ సంస్థ. దీని ఆధ్వర్యంలో చదువుకున్న వారిలో దాదాపు 1800 మంది ఇంజినీర్లు గా ఎదిగారు. 51 మంది పేద పిల్లలు డాక్టర్లు అయ్యారు.
ఇలాంటివి చేస్తే ముళ్ల కిరీటమే దక్కుతుంది: కమల్‌హాసన్
‘విద్య, ప్రేమ ఒకే చోట లభించడం సాధ్యం కాదు. అయితే అది అమ్మ వద్ద, అగరం వద్ద లభిస్తాయని ఈ ఫౌండేషన్ ఎదుగుదల చూస్తే అర్థమవుతుంది. సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేేస వారికి లభించేది ముళ్ల కిరీటం మాత్రమే. నేను విద్యను నేర్చుకునే తీరుతాను, ఇతరులకు నేర్పించే తీరుతాను అనేది ఒక సాగదీత ప్రక్రియ. 2017 తర్వాత విద్యార్థుల వైద్య విద్య అనేది కొనసాగలేక పోతోంది. కారణం నీట్ పరీక్ష. అందుకే నీట్ పరీక్షలు వద్దని చెబుతున్నాం. అందుకు చట్టాన్ని మార్చే బలం విద్యకే ఉంది. విద్య అనేది ఈ యుద్థంలో ఆయుధం మాత్రమే కాదు.. దేశాన్ని చక్కదిద్దేది కూడా’ అని అన్నారు.
విద్యే ఆయుధం.. అదే అగరం నమ్మకం: సూర్య
‘ఇది అగరం ఫౌండేషన్ 15వ వార్షికోత్సవం. విద్య అనేది ఆయుధం అన్నదే అగరం ఫౌండేషన్ నమ్మకం. అది ఈరోజు నిజం అయ్యిందని అన్నారు. విద్య అనేది చదువు మాత్రమే కాదని విద్యార్థులకు మన సాంప్రదాయాన్ని నేర్పించేదన్నారు. టాలెంట్‌ను బయటకు తెచ్చే పనిని అగరం ఫౌండేషన్ చేస్తోందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో కష్టపడే విద్యార్థులకు అగరం ఫౌండేషన్ విద్యా సేవలు అందిస్తుందని, విద్య మనిషిలో ఎంత మార్పు తీసుకొస్తుందన్నది గ్రామాల్లో విద్యార్థులకు తెలియజేయాలన్నదే ఆగరం ఫౌండేషన్ ప్రయత్నం అని సూర్య అన్నారు.
ఓ ఏడాది అగరం వార్షికోత్సవంలో సూర్య పాల్గొనగా ఒక విద్యార్థి మాట్లాడుతూ ‘తన ఆశను కలలను నెరవేర్చింది సూర్య సార్ అని, తన కలలకు సూర్య రెక్కలు తొడిగి ఆకాశమే హద్దుగా అభివృద్ది చెందేలా ఎంకరేజ్ చేశారని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. అంతే కాదు ఇంకా ఎంతోమంది ఉన్నత స్థానంలో ఉన్నారు. అగరం ఫౌండేషన్ 400 స్కూళ్లలో మరుగుదొడ్లు నిర్మించింది. కరోనా సమయంలో తంజావూరు ప్రభుత్వ ఆస్పత్రికి రూ. 25 లక్షల వైద్య పరికరాలు అందించింది. ఆకలి, పేదరికంతో పోరాడుతూ పొట్ట చేతబట్టుకుని శ్రీలంక నుంచి వస్తున్న శరణార్థుల పిల్లలకు స్కాలర్‌షిప్ అందిస్తున్నారు.