దీపావళి రేసులో సూర్య, నయనతార.. విజేత ఎవరు?
ABN, Publish Date - Oct 17 , 2026 | 01:39 PM
తమిళనాట ప్రతి యేటా దీపావళి సమయంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అనేక చిత్రాలు విడుదలవుతుంటాయి. ఆ కోవలోనే ఈ యేడాది కూడా పలు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
తమిళనాట ప్రతి యేటా దీపావళి సమయంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అనేక చిత్రాలు విడుదలవుతుంటాయి. ఆ కోవలోనే ఈ యేడాది కూడా పలు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే, ఈ యేడాది అగ్రహీరోలైన రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, విక్రమ్ తదితరుల చిత్రాలు పోటీలో లేవు. దీంతో చిన్న నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. అందుకే.. దీపావళికి తమ చిత్రాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఉన్నవాటిలో అగ్ర హీరో సూర్య నటించిన ‘సీన్’ (Scene) ఒకటి. మలయాళ దర్శకుడు జీత్తు మాధవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే సూర్య వరుసగా ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ వంటి హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.
‘సీన్’తో పాటు నయనతార (Nayanthara) నటించిన ‘మూక్కుత్తి అమ్మన్-2’ కూడా విడుదలకానుంది. సుందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలిమ్స్ నిర్మించింది. ‘రైజ్ ఆఫ్ మహాశక్తి’ (Rise of Mahasakthi) పేరుతో ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. విజయ్ ఆంటోనీ నటించిన ‘అప్పుకుట్టి’ మూవీ కూడా దీపావళి రేస్‌లో నిలిచింది. ము.మారన్ దర్శకత్వం వహించగా, తండ్రీకుమార్తెల సెంటిమెంట్‌తో యాక్షన్, ఎమోషన్స్, కుటుంబ బంధాలతో ఈ చిత్రం తెరకెక్కించారు.
వీటితో పాటు ప్రభుదేవా (Prabhudeva) నటించిన ‘మూన్‌వాక్’ కూడా విడుదలకానుంది. ఈ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్ సంగీతం అందించారు. ప్రభుదేవా - రెహ్మాన్ కాంబినేషన్లో పాతికేళ్ళ తర్వాత రానున్న చిత్రం కావడంతో భారీగానే అంచనాలున్నాయి. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు దీపావళి రేసులో ఉన్నాయి. ఈ చిత్రాలన్నీ నవంబరు 5 లేదా 6వ తేదీల్లో విడుదలకానున్నాయి. అయితే, ఈ దఫా సూర్య మినహా అగ్రహీరోల చిత్రాలు పోటీలో లేకపోవడంతో విడుదలయ్యే చిత్రాల్లో ఏ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి:
‘బాషా’, ‘మాస్టర్’, ‘తొలిప్రేమ’ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
కావ్య మారన్‌తో పెళ్లి.. తెలుగువాళ్లకి అనిరుధ్ మరింత దగ్గర కాబోతున్నాడా?
‘పెద్ది’లో నాకు బాగా నచ్చిన సీన్ అదే: రామ్ చరణ్