‘బాషా’, ‘మాస్టర్’, ‘తొలిప్రేమ’ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత

ABN , Publish Date - Oct 17 , 2026 | 11:56 AM

దక్షిణాది సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ‘తేనిసై తెండ్రల్’గా కోట్లాదిమంది సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు, గాయకుడు దేవా (75) శనివారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు.

Music Director Deva

దక్షిణాది సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ‘తేనిసై తెండ్రల్’ (Thenisai Thendral)గా కోట్లాదిమంది సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు, గాయకుడు దేవా (75) శనివారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. శనివారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను చెన్నైలోని సూర్య ఆసుపత్రికి తరలించగా, అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారని సమాచారం. ఆయన మరణవార్తతో యావత్ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

దేవా (Deva) అసలు పేరు దేవనేసన్ చొక్కలింగం. 1950 నవంబర్ 20న జన్మించిన ఆయన, 1980ల చివర్లో చిత్రసీమలోకి అడుగుపెట్టి 1990లలో తమిళనాట సంగీత సామ్రాజ్యాన్ని శాసించారు. ప్రత్యేకించి చెన్నై స్థానిక ‘గానా’ (Gaana) సంస్కృతిని, ఫోక్ బీట్స్‌ను మెయిన్‌స్ట్రీమ్ సినిమా సంగీతంలోకి తీసుకొచ్చి సరికొత్త ట్రెండ్‌ను సృష్టించారు. దాదాపు మూడు దశాబ్దాల సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వందలాది చిత్రాలకు అద్భుతమైన స్వరాలు సమకూర్చారు. తమిళనాడు ప్రభుత్వ ‘కలైమామణి’ పురస్కారంతో పాటు.. ‘ఆసై’ చిత్రానికి గానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా తమిళనాడు రాష్ట్ర అవార్డును అందుకున్నారు.


రజనీకాంత్‌కు మైల్‌స్టోన్ ఆల్బమ్స్..

సూపర్ స్టార్ రజనీకాంత్ సినీ కెరీర్‌లోనే చరిత్ర సృష్టించిన ‘అన్నామలై’, ‘బాషా’ చిత్రాలకు దేవా అందించిన నేపథ్య సంగీతం, పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ‘బాషా’ టైటిల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వింటే నేటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. వీటితో పాటు అజిత్, విజయ్ కెరీర్‌లలో మైల్‌స్టోన్‌గా నిలిచిన ‘ఆసై’, ‘కాదల్ కోట్టై’, ‘నేరుక్కు నేర్’, ‘నినైతేన్ వందై’, ‘ప్రియముడన్’, ‘వాలి’, ‘ఖుషి’ వంటి ఎన్నో కల్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రాలకు ఆయన ప్రాణం పోశారు.


టాలీవుడ్‌లో ‘మాస్టర్’, ‘తొలిప్రేమ’తో చరిత్ర!

తమిళంలోనే కాకుండా తెలుగులోనూ దేవా చెరగని ముద్ర వేశారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘మాస్టర్’ చిత్రానికి ఆయన అందించిన బాణీలు శ్రోతలను ఉర్రూతలూగించాయి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ప్రస్థానంలోనే అత్యున్నత చిత్రంగా, కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయిన ‘తొలిప్రేమ’ చిత్రానికి దేవా అందించిన సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. ‘ఈ మనసే సే సే’, ‘గగనానికి ఉదయం ఒకటే’ వంటి పాటలు దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ తెలుగు యువత ప్లేలిస్టుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ‘తొలిప్రేమ’ క్లాసిక్ విజయంలో దేవా అందించిన సంగీతానిది సింహభాగం.

దేవా మృతి పట్ల టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఆయన అంత్యక్రియలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

కావ్య మారన్‌తో పెళ్లి.. తెలుగువాళ్లకి అనిరుధ్ మరింత దగ్గర కాబోతున్నాడా?

‘పెద్ది’లో నాకు బాగా నచ్చిన సీన్ అదే: రామ్ చరణ్

ఆర్ నారాయణమూర్తి గురించి అంతా తెలుసుకోవాలి: శ్రీవిష్ణు

Updated Date - Oct 17 , 2026 | 11:56 AM

Vijay Devarakonda: ఈ ఏడాదిలోనే రణబాలి బెస్ట్ ఫిల్మ్

త్వరలోనే థియేటర్లలోకి రాబోతోన్న ‘భగవంతుడు’

Danny: రా అండ్ రస్టిక్ చిత్రం ‘డానీ’ రిలీజ్ డేట్ ఖరారు

జనవరి 12న విడుదల.. అనిల్ రావిపూడి, నీ చర్యలు ఊహాతీతం

ఆ విషయంలో హీరోయిన్లకు మినహాయింపు లేదు: ‘బ్లాస్ట్’ బ్యూటీ