శివాజీ గణేశణ్‌.. కూతురు శాంతి ఇకలేరు

ABN , Publish Date - Sep 21 , 2026 | 08:10 AM

త‌మిళ‌నాడు లెజండ‌రీ న‌టుడు శివాజీ గణేశణ్ కుటుంబంలో విషాదం నెలకొంది.

Sivaji Ganesan

త‌మిళ‌నాడు లెజండ‌రీ న‌టుడు శివాజీ గణేశణ్ కుటుంబంలో విషాదం నెలకొంది. దివంగత తమిళ సినీ దిగ్గజం శివాజీ గణేశణ్ (Sivaji Ganesan) , కమలా గణేశణ్ (Kamala) దంపతుల పెద్ద కుమార్తె శాంతి నారాయణస్వామి (71) (Shanthi Narayanaswamy) ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె మృతిపై తమిళ సినీ వర్గాలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

శాంతి నారాయణస్వామి సినీ రంగంలో ప్రత్యక్షంగా ఎక్కువ కాలం కొనసాగకపోయినా, కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ కొన్ని చిత్ర నిర్మాణ కార్యక్రమాల్లో భాగస్వామ్యమయ్యారు. ముఖ్యంగా తన తండ్రి శివాజీ గణేశణ్ నటించిన క్లాసిక్ చిత్రం ‘తంగపతకం’ చిత్రాన్ని నిర్మించడం విశేషం. సినీ కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఆమెకు తమిళ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ఉంది.

శాంతి నారాయణస్వామికి సోదరిగా తన్మోళి ఉండగా, సోదరులు రామ్‌కుమార్ (Ramkumar), ప్రభు (Prabhu) తమిళ సినీ పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. రామ్‌కుమార్‌ నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించగా, ప్రభు స్టార్ నటుడిగా దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు.

శివాజీ గణేశణ్ తన పెద్ద కుమార్తెపై ఉన్న ప్రేమకు గుర్తుగా చెన్నై అన్నా నగర్‌లోని ఓ ప్రముఖ థియేటర్‌కు ‘శాంతి థియేటర్’ అనే పేరు పెట్టారు. ఈ థియేటర్ తమిళనాడులో అత్యంత గుర్తింపు పొందిన సినిమా హాళ్లలో ఒకటిగా నిలిచింది.

కాగా.. శాంతి నారాయణస్వామి మరణంతో శివాజీ గణేశణ్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ ప్రముఖులు, అభిమానులు ఆమె మృతికి సంతాపం తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె అంత్యక్రియలు సోమ‌వారం కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించనున్నట్లు సమాచారం.

Updated Date - Sep 21 , 2026 | 08:10 AM