సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రుద్రవనం పీఎస్ వెబ్ సీరిస్ ఎలా ఉందంటే?

ABN, Publish Date - Oct 30 , 2026 | 06:22 PM

నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రుద్రవనం పీఎస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మర్డర్ మిస్టరీ సిరీస్ కథ, నటీనటుల పెర్ఫార్మెన్స్, ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఎలా ఉన్నాయో రివ్యూలో తెలుసుకోండి.

Rudhravanam PS

ఓటీటీ సంస్థలు ఒరిజినల్ సినిమాలనే కాదు... తరచుగా వెబ్ సీరిస్‌లనూ స్ట్రీమింగ్‌ చేస్తున్నాయి. అయితే అందులో ఇన్వెస్టిగేటివ్‌ క్రైమ్‌ థ్రిల్లర్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఆ కోవకు చెందిందే 'రుద్రవనం పీఎస్'. అక్టోబర్‌ 30 నుంచి ఇది జీ 5లో స్ట్రీమింగ్‌ అవుతోంది. రచయిత శశిధర్‌ మున్నంగి ఈ వెబ్ సీరిస్‌కు దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత వివేక్ కూచిభొట్ల భార్య సూర్యకాంతి, నిర్మాత రమేశ్‌ పుప్పాల సంయుక్తంగా దీనిని నిర్మించారు. విలేజ్ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్‌ డ్రామా ఎలా ఉందో తెలుసుకుందాం.


అనాథ అయిన శివకుమార్ (నరేశ్‌ అగస్త్య) రుద్రవనం పోలీస్‌ స్టేషన్ లో ఎస్.ఐ.గా పనిచేస్తుంటాడు. తల్లిదండ్రులను కాదని శివకుమార్ ను ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది శ్రావణి (శ్రావణి రెడ్డి). ఆమె ప్రెగ్నెంట్‌ కావడంతో కొన్ని నెలలు సెలవుపై వెళ్ళాలనుకుంటాడు శివకుమార్. కానీ ఈలోగా ఆ గ్రామంలో ఎమ్మెల్యే భైరవులు (రాజా రవీంద్ర) తమ్ముడు కనిపించకుండా పోతాడు. అతనే కాదు దాదాపు ఆరేడు మందిపై పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు అవుతుంది. సీఐ వేణుగోపాల్ (బెనర్జీ)కి ఏంచేయాలో పాలుపోక శివకుమార్ సెలవును రద్దు చేసి, వాటిని సాల్వ్ చేసే పని అతనికే అప్పగిస్తాడు. అందులో ఓ శవం తల మిస్‌ కావడంతో ఈ కేసు ఇంకా తీవ్రరూపం దాల్చుతుంది. శివ కుమార్ చేసిన ఇన్వెస్టిగేషన్ తో పోలీస్‌ స్టేషన్‌కు టీ తీసుకొచ్చే అంజి (చారు వాకన్) హస్తం ఉందని తెలుస్తుంది. భార్య స్వర్ణ (ప్రీతి సుందర్)తో కలిసి అతను కొందరిని హనీ ట్రాప్ చేసి నగదు, బంగారు ఆభరణాలు వసూలు చేశాడని తెలుస్తుంది. అసలు అంజీ నేపథ్యం ఏమిటీ? సొంత భర్యను ఎరగా వేసి జనాలను బ్లాక్‌ మెయిన్‌ చేసి అతను డబ్బులు ఎందుకు గుంజాడు? ఆ తర్వాత వాళ్ళను ఎందుకు హత్య చేశాడు? అనేది మిగతా కథ.


నిజానికి ఈ తరహా మర్డర్ మిస్టరీ వెబ్ సీరిస్ లు చాలానే వచ్చాయి. అయితే అందులో ఎంగేజింగ్‌గా ఉన్నవి చాలా తక్కువ. ఇన్వెస్టిగేషన్ పేరుతో ఎపిసోడ్స్ కు ఎపిసోడ్స్ సాగిపోతుంటాయి కానీ కథ మాత్రం ముందుకు కదలదు. ఇది కూడా అలాంటిదే. రకరకాల వ్యక్తులను అనుమానిస్తూ, పోలీసు అధికారులలో ఉండే అసహనాన్ని ఎలివేట్‌ చేస్తూ మూడు నాలుగు ఎపిసోడ్స్ ను తీశారు. అసలు కథను చివరి రెండు ఎపిసోడ్స్ లో చూపించారు. అంజి నేరం ఒప్పుకున్న తర్వాత కూడా అందుకు మోటివ్ ఏమిటనేది చెప్పడం కోసం దర్శకుడు ఇంకో ఎపిసోడ్ తీశాడు. అదే ఈ మొత్తం ఎపిసోడ్స్ లో కాస్తంత ఆసక్తికరంగా ఉంది. కానీ ఆ మోటో అంత బలంగా లేకపోవడంతో చివరకు తేలిపోయింది.


'మత్తు వదలరా'తో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నరేశ్‌ అగస్త్య ఆ తర్వాత కొన్ని సినిమాలలో హీరోగా నటించినా, వెబ్ సీరిస్ లలో చేసినా పెద్దంత సక్సెస్ ను మాత్రం పొందలేదు. ఇందులో ఎస్.ఐ.గా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ను ప్రదర్శించి, మెప్పించాడు. అతని భార్యగా శ్రావణి రెడ్డికి ఉన్న స్పేస్ తక్కువ. ఉన్నంతలో బాగానే చేసింది. ఆమెకంటే స్క్రీన్ స్పేస్ ఏఎస్ఐ నిర్మలగా నటించిన సుగాలి సిలోని కి దక్కింది. ఇతర కీలక పాత్రలను రాజా రవీంద్ర, బెనర్జీ, శివ ఆలపాటి, రమేశ్‌ కొణంబొట్ల, నారాయణస్వామి తదితరులు పోషించారు. అంజిగా చారు వాకన్, అతని భార్య స్వర్ణగా ప్రీతి సుందర్ ఆ పాత్రలలో ఒదిగి పోయారు. కథంతా ఒకే ఊరిలోనూ, పోలీస్‌ స్టేషన్‌లోనూ జరగడం వల్ల పరిమితమైన బడ్జెట్ లోనే వెబ్ సీరిస్ ను నిర్మాతలు పూర్తి చేశారనిపిస్తోంది. తాజ్‌ సయ్యద్‌ రాసిన మాటలు పాత్రల ఔచిత్యానికి తగ్గట్టుగా ఉన్నాయి. అష్కర్ అలీ సినిమాటోగ్రఫీ, మాధవ్ ఎడిటింగ్‌ ఓకే. కాకపోతే... కాస్తంత ట్రిమ్‌ చేసి దీనిని ఐదు ఎపిసోడ్స్ లేదా ఆరు ఎపిసోడ్స్ కు కుదిస్తే ఇంకా బాగుండేది. ఇన్వెస్టిగేటివ్‌ డ్రామాలను, మర్డర్ మిస్టరీలను ఇష్టపడే వారికి 'రుద్రవనం పీఎస్' ఓ మేరకు నచ్చే ఆస్కారం ఉంది.

ఇవి కూడా చదవండి:

‘ఆదర్శ కుటుంబం’ మూవీ రివ్యూ.. వెంకీ, త్రివిక్రమ్ మ్యాజిక్ వర్కౌట్ అయ్యిందా?

Cult Review: విశ్వక్ సేన్ నటించిన 'కల్ట్' ఎలా ఉందంటే..

హీరోగా విజయ్ కొడుకు.. డైరెక్టర్ ఎవరో తెలుసా

Updated Date - Oct 30 , 2026 | 07:41 PM