Cult Review: విశ్వక్ సేన్ నటించిన 'కల్ట్' ఎలా ఉందంటే..

ABN , Publish Date - Oct 30 , 2026 | 03:43 PM

విశ్వక్ సేన్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం 'కల్ట్' చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.

సినిమా రివ్యూ: ‘కల్ట్‌’

విడుదల తేది: 30-10-2026

సక్సెస్‌, ఫెయిల్యూర్స్ పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు విశ్వక్‌సేన్‌. అంతే కాదు కుదిరినప్పుడల్లా మెగా ఫోన్‌ కూడా పట్టేస్తున్నాడు. తాజాగా ఆయన నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్ట్‌’. గాయత్రి భరద్వాజ్‌ కథానాయిక. మురళీ శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, తారక్‌ పొన్నప్ప తదితరులు ఇందులో కీలక పాత్రధారులు. స్లాషర్‌ థ్రిల్లర్‌ ప్రయోగంగా చేసిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. వరుస పరాజయాలతో సతమతమవుతూ హిట్‌ కోసం ఎదురుచూస్తున్న విశ్వక్‌సేన్‌కు ఈ చిత్రం ఎలాంటి అనుభూతిని ఇచ్చిందో చూద్దాం.

కథ: 

హోమ్ మినిస్టర్‌ (మురళీశర్మ) కుమారుడు ఎల్విన్‌ (తారక్‌ పొన్నప్ప) పుట్టినరోజు నాలుగేళ్లకు ఓసారి  రావడం వల్ల గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోవాలనుకుంటాడు. ఎన్నికల కారణంగా తండ్రి వద్దని వారించినా పట్టుబట్టి గోవాలో స్నేహితులందరినీ పిలిచి భారీగా బర్త్ డే పార్టీ ఏర్పాటు చేస్తాడు. ఆ పబ్‌లో తెరపై ఓ డిజిటల్‌ డాల్‌ ఈవెంట్‌ను హోస్ట్‌ చేస్తూ.. ఫ్లోర్‌లో ఉన్న అందరికీ తాను చెప్పినట్లు ఆడాలని చెబుతుంది. అయితే ఆటని లైట్‌గా తీసుకున్నవారు దారుణంగా హత్యకు గురవుతుంటారు. దాంతో ఆ ఫ్లోర్‌లో ఉన్న అందరిలో భయం మొదలవుతుంది. అదే ఫ్లోర్‌లో డీఎస్‌పీ సంకల్ప్‌ నాయక్‌(విశ్వక్‌సేన్‌) ఉంటాడు. అక్కడ జరుగుతున్నది గమనించి పార్టీలో హత్యలకు కారణమేంటి అన్నదానిపై దృష్టిపెడతాడు. అసలు ఈ హత్యలన్నింటికీ కారణం ఎవరు!? ఆ ఫ్లోర్‌లో కొందరినే టార్గెట్‌ చేసి ఎందుకు చంపుతున్నారు!? గోవా మెంటల్‌ ఆస్పత్రిలోని పిచ్చివాళ్లకు.. ఆ బర్త్ డే పార్టీకి ఉన్న సంబంధం ఏంటి!? దీనిని సంకల్ప్‌ నాయక్‌ ఎలా చేధించాడన్నదే కథ. 




విశ్లేషణ: 

‘కల్ట్‌’తో విశ్వక్‌సేన్‌ మరోసారి రెండు పడవల మీద కాలేశాడు. ఈ చిత్రంలో హీరోగా నటించడమే కాకుండా దర్శకుడిగానూ బాధ్యతలు తీసుకున్నాడు. యాక్షన్‌ స్లాషర్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. జానర్‌ వినడానికి కొత్తగా ఉన్న కథ మాత్రం రొటీన్‌ రివెంజ్‌ డ్రామానే. మద్యం, డ్రగ్స్‌కు బానిస అయిన మినిస్టర్‌ కొడుకు పుట్టినరోజు వేడుకతో సినిమా మొదలవుతుంది. సినిమా పిచ్చితో గోవా వచ్చిన ముగ్గురు హైదరాబాద్‌ కుర్రాళ్లు పార్టీలు, పబ్‌లు, మందు అంటూ తిరుగుతూ బర్త్ డే పార్టీలో ఎంటర్ అవుతారు. ఇదంతా కూడా ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్షే! సినిమా మొదలైన 40 నిమిషాల తర్వాత హీరో ఎంట్రీతో కథ ట్రాక్‌లోకి వస్తుంది. హీరో సమస్యకు పరిష్కారం వెతకడం ప్రారంభించడంతో విరామం. ఆ తర్వాత ఏదన్నా కొత్తగా ఉంటుందని ఆశిస్తే అక్కడ కూడా తలలు, మొండాలు, చేతులు, కాళ్లు నరకడంతోనే సరిపోయింది. ఇదంతా రొటీన్‌ రివెంజ్‌లా సాగుతుంది. డీజే రూమ్‌లో ఉన్న మాస్క్‌ మ్యాన్‌ ఎవరు? అతని అంతరంగం ఏమిటనేది కనిపెట్టే సీన్స్‌ మాత్రం ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్‌లో దీనంతటికీ కారకుడైన ఇషాన్‌ ఫ్లాష్‌బ్యాక్‌ కాస్త పర్వాలేదు. మిగతాది అంతా రొటీన్‌ కథే! పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌, సెంట్రల్‌ కమాండోల ఎంట్రీ సీన్స్ కు అసలు లాజక్‌ ఉండదు. ఆ యా డిపార్ట్‌మెంట్‌ వాళ్ళు ఏం చేయగలరు? ఏమి చేయలేరు? అన్న విషయాలపై కొంత హోం వర్క్‌ చేస్తే బాగుండేది. క్లైమాక్స్‌ ఫైట్‌ అయితే మరీ కామెడీగా ఉండి ప్రేక్షకులను మరీ అండర్ ఎస్టిమేట్ చేసినట్లు అనిపిస్తుంది.

నటీనటులు.. సాంకేతిక నిపుణుల పనితీరు.. 

నటుడిగా విశ్వక్‌సేన్‌కు పేరు పెట్టక్కర్లేదు. గత చిత్రాల్లో మాదిరి ఓవరాక్షన్‌ ఏమీ లేకుండా పోలీస్‌ ఆఫీసర్‌గా బాగానే చేశాడు. హీరోయిన్‌ గాయత్రి భరద్వాజ్‌ పాత్ర గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. తారక్‌ పొన్నప్పకు ఇది రెగ్యులర్‌ పాత్రే. అంతవరకూ న్యాయం చేశాడు. మాస్క్‌మ్యాన్‌ ఇషాన్‌గా నటించిన ఆరిస్ట్‌ పర్వాలేదు. మురళీశర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, మిగతా ఆర్టిస్ట్‌లు అంతా సో సో. అరవింద్‌ విశ్వనాథన్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. రవి బస్రూర్‌ సంగీతం సినిమాకు ఎసెట్‌.  ఫస్టాఫ్‌ తొలి 30 నిమిషాలు పూర్తిగా వేస్ట్ అనే చెప్పాలి.  సినిమా అంతా ఒకే సెట్‌లో జరుగుతుంది. ప్రయోగాలు చేయడం, కథను కొత్తగా చెప్పాలనుకోవడం మంచి ప్రయత్నమే. కానీ తీసుకున్న పాయింట్‌ను తెరపై ఆవిష్కరించడం కూడా ఎంతో ముఖ్యం. ఆ విషయంలో దర్శకుడుగా విశ్వక్ పూర్తిగా  విఫలం అయ్యాడు. హింస, రక్తపాతం బాగా ఎక్కువ. నిజానికి ఈ సినిమాకు సెన్సార్ గ్రీన్ సిగ్నల్ లభించటమే ఆశ్చర్యకరమైన విషయం. ఇక చివరిలో కల్డ్‌ యూనివర్స్‌ కొనసాగుతుందని సీక్వెల్‌ కు లీడ్‌ కూడా ఇచ్చారు. అసలు ఈ తొలి యత్నానికి విజయం లభిస్తేనే కదా... సీక్వెల్స్ ఉండేది. 

  

ట్యాగ్‌లైన్‌: కల్ట్ కాదు.. గిల్ట్ 

రేటింగ్‌: 2/5

Updated Date - Oct 30 , 2026 | 05:38 PM