ఐస్ వెబ్ సిరీస్ రివ్యూ.. క్రైమ్‌ను ముందే పసిగట్టే సరికొత్త ప్రయోగం
ABN, Publish Date - Oct 12 , 2026 | 03:54 PM
సోనీ లివ్‌లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న మలయాళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఐస్. వేధింపులను ముందుగానే గుర్తించి అడ్డుకునే సాఫ్ట్‌వేర్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సిరీస్ కథ, నటీనటుల ప్రదర్శన, ప్లస్‌లు, మైనస్‌లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
అమ్మాయిలను ప్రేమ పేరుతో హెరాస్ చేయడం అనేది ప్రతి చోట జరిగే సంఘటనే. అయితే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందాన ఆ యువతిపై ఏదో రకమైన దాడి జరిగిన తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేసి, నేరస్థులను పట్టుకుని, కోర్టులో విచారించి, శిక్షించే పని చేస్తుంటారు. కానీ నేరస్థులలోని ఆ ధోరణిని ముందే పసిగట్టి, ఆడపిల్లలపై అఘాయిత్యానికి పాల్పడక ముందే అదుపులోకి తీసుకుంటే... కొన్ని ప్రాణాలనైనా కాపాడగలుగుతారు. ఇదే కాన్సెప్ట్ తో మలయాళ దర్శకుడు మనూ అశోకన్ 'ఐస్' వెబ్ సీరిస్ ను రూపొందించారు. ప్రస్తుతం సోనీ లివ్‌లో తెలుగులోనూ ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ఏడు ఎపిసోడ్స్ ఉన్న ఈ సీజన్ 1 లో ఒక్కో ఎపిసోడ్ సుమారు యాభై నిమిషాల నిడివితో సాగింది.
'ఐస్' కథ విషయానికి వస్తే... మహిళలు ఆత్మరక్షణ చేసుకోలేని పరిస్థితులు కొన్ని ఉంటాయి. అలానే పోలీసులు సైతం వాచ్ డాగ్ లా ప్రతి ఒక్కరినీ గమనించలేని పరిస్థితీ ఉంటుంది. వీరిద్దరినీ అనుసంధానిస్తూ ఓ సాఫ్ట్ వేర్ తయారు చేసి, దాని ద్వారా బాధితులను, దానికి బాధ్యులను ఓ కంట కనిపెడితే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందన్నదే ఈ వెబ్ సీరిస్ సారాంశం. అలాంటి సాఫ్ట్ వేర్ పేరే 'ఐస్'!. విద్య (శ్రుతి రామచంద్రన్) అనే సాఫ్ట్ వేర్ కంపెనీ ఓనర్ 'ఐస్'ను తయారు చేస్తుంది. తన స్నేహితురాలైన సైకాలజిస్ట్, క్రైమ్ ఎనలిస్ట్ ఆయేషా (నిఖిలా విమల్) సాయంతో దీన్ని మరో స్టెప్ ముందుకు తీసుకెళుతుంది. వీరిద్దరూ ఐ.జి. (అజిత్ కోషి)ని కలిసి, 'ఐస్' సాఫ్ట్ వేర్ ద్వారా క్రైమ్ ను ఎలా కంట్రోల్ చేయవచ్చో వివరిస్తారు. ట్రయిల్ బేస్‌లో మూడు నెలలు చూసి, ఆ తర్వాత దీనికి ప్రభుత్వం నుంచి అప్రూవ్ చేయిస్తానని ఆయన హామీ ఇస్తారు. వీరిద్దరి కోరిక మేరకు 'ఐస్' టీమ్‌లోకి ఫ్రెష్ గ్రాడ్యుయేట్ తన్వీ (రియా జీతు), పోలీస్ ఆఫీసర్లు టీనా సబాస్టియన్ (కని కుశ్రుతి), జస్టిన్ (ప్రభు మురళీ కృష్ణ) కూడా జాయిన్ అవుతారు. నాలుగు టెస్ట్ కేసులను టేకప్ చేసి విక్టిమ్‌ను, స్టాకర్ ను కూడా కన్వెన్స్ చేసి వారికి 'ఐస్' డివైస్‌ను ఇస్తారు. ఈ క్రమంలో వారు ఊహించని విధంగా ఓ స్టాకర్ సూసైడ్ చేసుకుని చనిపోతాడు. దాంతో 'ఐస్' టీమ్ చేపట్టిన ఆపరేషన్ అర్థాంతరంగా ముగుస్తుంది. కానీ దాని ద్వారా సత్ ఫలితాలు పొందే ఆస్కారం ఉందని భావించిన విద్య ఇగోలను పక్కన పెట్టి, తిరిగి టీమ్ సభ్యులను ఒప్పించి, 'ఐస్'ను యాక్టివేట్ చేస్తుంది. వీరు టేకప్ చేసిన కేసుల్లోని ఆ నలుగురు విక్టీమ్స్ నేపథ్యం ఏమిటీ? మొదటి స్టాకర్ అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? అతని మరణం వెనుక ఎవరున్నారు? 'ఐస్' టీమ్ ను లీడ్ చేస్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు? ఆటంకాలు ఎదురయ్యాయి? వాటిని వారు ఎలా అధిగమించారు అనేది మిగతా కథ.
ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్స్ కు ఇప్పుడు ఓటీటీలో కొదవలేదు. ప్రతి వీకెండ్ లోనూ ఏదో ఒక భాషలో ఇలాంటి వెబ్ సీరిస్ వస్తూనే ఉన్నాయి. అయితే విక్టీమ్‌ను, స్టాకర్ ను ఒప్పించి, ఓ సాఫ్ట్ వేర్ ద్వారా వారిని గమనిస్తూ అవసరమైతే హెచ్చరించే ఓ టీమ్ ఉండటం అనేది ఈ వెబ్ సీరిస్‌లోని నావెల్ పాయింట్. ఇందులో విక్టీమ్స్ అయిన స్టార్ హీరోయిన్, అంగన్ వాడీ టీచర్, టాప్ పొలిటీషియన్ కూతురు, సూపర్ మార్కెట్‌లో పనిచేసే దిగువ మధ్య తరగలి యువతి... వీరి కథలన్నీ కొత్తగా ఉన్నాయి. అయితే వారిని వేధించే యువకుల కథలు మాత్రం దాదాపుగా ఒక్కటే. ప్రేమ పేరుతో అమ్మాయిలకు దగ్గరై, ఆ తర్వాత రకరకాల కారణాలతో వారిని చిత్రహింసలకు గురిచేసే పాత్రలవి. విక్టిమ్స్ కు 'ఐస్' డివైస్ ను ధరించడానికి సాధారణమైన కారణం చాలు. కానీ స్టాకర్స్ కూడా ఈ డివైస్ ను వాడటానికి అంగీకరించడానికి చూపించిన కారణాలు పెద్దంత కన్వెన్సింగ్‌గా అనిపించవు. వాళ్ళ మీద ఉన్న పోలీస్ కేసులను బూచిగా చూపించి, వారితోనూ ఈ డివైస్ క్యారీ చేసేలా ఇందులో చూపించారు. తద్వారా ఇటు విక్టీమ్, అటు స్టాకర్ ఇద్దరిని ఈ టీమ్ ఇరవై నాలుగు గంటలూ అబ్జర్వ్ చేస్తుందన్న మాట. ఇలా ఈ నాలుగు కేసులను అనాలిసిస్ చేసిన విధానం ఆసక్తికరంగా సాగింది. అయితే ఒక్కో ఎపిసోడ్ నిడివి 50 నిమిషాలు ఉండటం అనేది కాస్తంత ఇబ్బందికి గురిచేస్తుంది. మరీ ముఖ్యంగా నాలుగు, ఐదు ఎపిసోడ్స్ సాగతీతలా అనిపిస్తాయి. దీనిని ఆరు ఎపిసోడ్స్ కు కుదించి, నిడివిని కూడా 30 నిమిషాలు పెట్టి ఉంటే... కథ ఇంకా వేగంగా సాగి ఉండేది.
ఇందులో నటించిన వారంతా మలయాళ నటీనటులే. అయితే అడపా దడపా తెలుగులోనూ వీరు కనిపించడం విశేషం. ఆయేషా పాత్ర పోషించిన నిఖిలా విమల్ తెలుగులో నరేశ్ 'మేడమీద అబ్బాయి', మోహన్ బాబు 'గాయత్రి' చిత్రాలలో నటించింది. పోలీస్ ఆఫీసర్ టీనా సబాస్టియన్ గా తన సహజ నటనతో మెప్పించిన కని కుశ్రుతి... మహేశ్ బాబు 'స్పైడర్' మూవీలో విలన్ తల్లి పాత్ర చేసింది. సాఫ్ట్ వేర్ కంపెనీ ఓనర్ విద్యగా నటించిన శ్రుతి రామచంద్రన్ తెలుగులో 'డియర్ కామ్రేడ్' మూవీలో యాక్ట్ చేసింది. అలానే ఈ టీమ్‌లోని మరో సభ్యురాలు తన్వీ పాత్రను చేసిన రియా జీతు తెలుగులో 'భద్రకాళి' చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఇక హీరోయిన్ రితికా శ్యామ్‌గా నటించిన అనఘ తెలుగులో 'గుణ 369'లో యాక్ట్ చేసింది. కలెక్టర్ పాత్రను పోషించిన దేవ్ మోహన్ ఇటీవల వచ్చిన లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి'లోనూ, సమంత 'శాకుంతలం'లోనూ హీరోగా నటించారు. ఇతర ప్రధాన పాత్రలను ప్రేమ్ ప్రకాశ్, సానియా అయ్యప్పన్, ప్రభు మురళీ కృష్ణన్, ఆది, జాఫర్ ఇదుక్కి, పార్వతి ఆర్ కృష్ణ, ఆనంద్ మన్మధన్ తదితరులు పోషించారు. అంజనా నాయర్ కథకు, బాబీ, సంజయ్ ద్వయం మాటలు రాశారు. దర్శకుడు మనూ అశోకన్ కు ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ గా మంచి అనుభవమే ఉంది. అది ఈ వెబ్ రూపకల్పనకు ఉపయోగపడింది.
రొటీన్ క్రైమ్ ఇన్వెస్టిగేట్ వెబ్ సీరిస్ లకు 'ఐస్' కొంత భిన్నంగా ఉందని చెప్పొచ్చు. అయితే అక్కడక్కడా బోర్ కొట్టినప్పుడు చేతిలోని రిమోట్ ద్వారా ఫార్వర్డ్ చేసుకుని చూసే సదుపాయం ఉండనే ఉంది! తీరిక సమయాల్లో ఒక్కసారి ఈ వెబ్ సీరిస్ ను చూడడం వల్ల సమయం వృధా అయ్యిందనే భావనైతే కలగదు!
ఇవి కూడా చదవండి:
అమలా పాల్ గ్లామరస్ ఫొటోలు వైరల్
సత్యదేవ్, ఫరియా ‘ట్రయల్ అండ్ ఎర్రర్’ ప్రారంభం
కోబలి.. ఇది కదా కావాల్సింది రణబాలి