‘రామాయణ’ న్యూ పోస్టర్ అదిరింది.. అడ్వాన్స్ బుకింగ్స్ అప్డేట్

ABN , Publish Date - Oct 11 , 2026 | 08:39 PM

భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ విజువల్ వండర్‌గా, దేశంలోనే కనీవినీ ఎరుగని భారీ వ్యయంతో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ మైథలాజికల్ ఎపిక్ ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్ అప్డేట్ వచ్చేసింది.

Ramayana Advance Bookings Update

భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ విజువల్ వండర్‌గా, దేశంలోనే కనీవినీ ఎరుగని భారీ వ్యయంతో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ మైథలాజికల్ ఎపిక్ ‘రామాయణ’ (Ramayana). ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా నవరాత్రుల పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి చిత్ర బృందం అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ‘రామాయణ పార్ట్ 1’ అఫీషియల్ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ సినీ ప్రియులను కట్టిపడేస్తోంది. ఇందులో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దూబే ప్రశాంతమైన వనవాస వస్త్రధారణలో కనిపిస్తుండగా.. వీరి వెనుక బంగారు లంకను తలపించే బ్యాక్‌డ్రాప్‌లో పది తలల లంకాధిపతి రావణుడిగా రాకింగ్ స్టార్ యశ్ భారీ ఆకారంతో దర్శనమిచ్చారు. నెరిసిన గడ్డం, నుదుటిన విభూతి రేఖలు, బంగారు కిరీటంతో యశ్ చూపించిన రౌద్రం పోస్టర్‌కే హైలైట్‌గా నిలిచింది. ధర్మం, అధర్మాల మధ్య జరగబోయే మహా సంగ్రామాన్ని ఈ పోస్టర్ చక్కగా ప్రతిబింబిస్తోంది.


ఈ పోస్టర్‌ను పంచుకుంటూ మేకర్స్ విడుదల తేదీపై పూర్తి స్పష్టతనిచ్చారు. “నవరాత్రుల పవిత్ర సందర్భంగా సరికొత్త శకానికి శ్రీకారం చుడుతున్నాం.. ‘యే రామ్ కే యుగ్ కా ఆరంభ్ హై’ (ఇది రాముడి యుగానికి ఆరంభం)! నమిత్ మల్హోత్రా ‘రామాయణ’ పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 5న అన్ని ప్రీమియం ఫార్మాట్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ దసరా నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి” అని అధికారికంగా ప్రకటించారు. రెండు భాగాలుగా రానున్న ఈ దృశ్యకావ్యంలో మొదటి భాగం 2026 నవంబర్ 5న దీపావళి కానుకగా విడుదల కానుండగా, రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.


నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, 8 సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న అంతర్జాతీయ వీఎఫ్ఎక్స్ దిగ్గజ సంస్థ DNEG, అలాగే రాకింగ్ స్టార్ యశ్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని కనీవినీ ఎరుగని బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో హనుమంతుడిగా బాలీవుడ్ యాక్షన్ స్టార్ సన్నీ డియోల్ కనిపించనున్నారు. భారత్‌లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలతో పాటు ఐమ్యాక్స్ (IMAX) ఫార్మాట్‌లో ఈ విజువల్ స్పెక్టాకిల్ రిలీజ్ కానుంది. హిందీ మార్కెట్‌లో కరణ్ జోహార్‌కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తుండగా.. ప్రపంచవ్యాప్తంగా మిగిలిన దేశాల్లో హాలీవుడ్ దిగ్గజ పంపిణీ సంస్థ సోనీ పిక్చర్స్ భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

సత్యదేవ్, ఫరియా ‘ట్రయల్ అండ్ ఎర్రర్’ ప్రారంభం

ఉత్తమ నటుడిగా జేడీ చక్రవర్తి.. అంతర్జాతీయ పురస్కారం

ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుంచి అదిరిపోయే అప్‌డేట్!

Updated Date - Oct 11 , 2026 | 08:39 PM