అరుదైన పిక్.. సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కండక్టర్’ ఐడీ కార్డ్!
ABN, Publish Date - May 29 , 2026 | 09:39 PM
ఒక సాధారణ బస్సు కండక్టర్.. దేశం గర్వించేలా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసే స్థాయికి ఎదుగుతాడని ఎవరైనా ఊహించగలరా? అదే చేసి చూపించారు సూపర్ స్టార్ రజనీకాంత్.
ఒక సాధారణ బస్సు కండక్టర్.. దేశం గర్వించేలా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసే స్థాయికి ఎదుగుతాడని ఎవరైనా ఊహించగలరా? ఆ అసాధారణ ప్రయాణానికి సజీవ సాక్ష్యంగా నిలిచే ఒక అరుదైన జ్ఞాపకం ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ‘తలైవా’గా నిలిచిన సూపర్‌స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth).. ఒకప్పుడు బెంగళూరు సిటీలో బస్సు కండక్టర్ (Bangalore Bus Conductor)గా పనిచేసిన కాలం నాటి ఎంప్లాయ్ ఐడెంటిటీ కార్డ్ (ఐడీ కార్డ్) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అరుదైన ఫోటోను చూసి సినీ ప్రియులు, రజనీ అభిమానులు మురిసిపోతున్నారు.
వైరల్ అవుతున్న ఈ ఐడీ కార్డును పరిశీలిస్తే.. అందులో రజనీకాంత్ అసలు పేరు ‘శివాజీ రావు గైక్వాడ్’ (Shivaji Rao Gaikwad) అని స్పష్టంగా కనిపిస్తోంది. బెంగళూరు ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ (BTS) కు చెందిన ఈ కార్డుపై ఆయన డిసిగ్నేషన్ ‘బస్ కండక్టర్’ అని, శ్రీనగర్ డిపోకు చెందిన 10A రూట్ బస్సులో ఆయన విధులు నిర్వహించేవారని ఉంది. అంతేకాదు, రజనీకాంత్ పుట్టిన తేదీ (12-12-1950), ఆయన జాయినింగ్ డేట్ (18-06-1971)తో పాటు అప్పట్లో ఆయన నెలకు తీసుకునే జీతం కేవలం రూ. 275 మాత్రమేనని ఈ పాత గుర్తింపు కార్డు ద్వారా తెలుస్తోంది. మీసం, గుబురు జుట్టుతో ఉన్న ఆయన నాటి ఫోటో ఆ కాలపు రోజులను కళ్లకు కడుతోంది.
ఒకప్పుడు టికెట్లు కొడుతూ తన విలక్షణమైన మేనరిజమ్స్‌తో ప్రయాణికులను అలరించిన శివాజీ రావు.. ఆ తర్వాత వెండితెరపై అడుగుపెట్టి ‘రజనీకాంత్’గా మారి బాక్సాఫీస్ సామ్రాజ్యాన్ని శాసించారు. ఈ ఐడీ కార్డ్ కేవలం ఒక పాత కాగితం ముక్క కాదు, కష్టాన్నే నమ్ముకుంటే సామాన్యుడు సైతం అసామాన్యుడిగా ఎదగవచ్చని నిరూపించే ఒక గొప్ప స్ఫూర్తిదాయక చరిత్ర. శూన్యం నుంచి మొదలై శిఖరాలను అధిరోహించిన తలైవా ప్రయాణానికి అద్దం పడుతున్న ఈ అరుదైన పిక్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
NBK111: బాలయ్య గ్యాంగ్‌స్టర్ లుక్.. ముంబై అడ్డాగా వేట!
ఆడియో జ్యూక్ బాక్స్ విడుదల.. ‘పెద్ది’ టీమ్ తప్పు చేసిందా?
యూపీలో పౌల్ట్రీ బిజినెస్.. భూమి పూజతోనే బండ్ల గణేష్ పరార్.. ఎందుకంటే?