నాట్స్ కార్యక్రమాల్లో అలరించిన ‘స్వరాభిషేకం’, సంగీత విభావరి
ABN , Publish Date - Nov 03 , 2026 | 10:18 PM
దీపావళి పండుగ వేళ సమాజంలో సేవ చేయడమే నిజమైన ఆనందమనే సందేశాన్ని చాటుతూ నాట్స్ ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. యాంకర్ సుమ కనకాల నిర్వహిస్తున్న ‘ఫెస్టివల్స్ ఫర్ జాయ్’తో కలిసి ‘మాతృ అభయ ఫౌండేషన్’ అనాథాశ్రమానికి సుమారు రూ.3 లక్షల విలువైన నాణ్యమైన వంట సామగ్రిని నాట్స్ విరాళంగా అందజేసింది.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నార్త్ అమెరికా తెలుగు సొసైటీ - NATS) సేవా దృక్పథం, సమాజ హితమే లక్ష్యంగా అటు అమెరికాలోని పలు నగరాలతో పాటు ఇటు స్వదేశమైన తెలంగాణలోనూ విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు, సాంస్కృతిక వేడుకలను అత్యంత దిగ్విజయంగా నిర్వహించింది. నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ సమర్థవంతమైన నాయకత్వంలో చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమాలపై సంస్థ ఛైర్మన్ కిషోర్ కంచర్ల హర్షం వ్యక్తం చేస్తూ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
అనాథాశ్రమానికి రూ.3 లక్షల వంట సామగ్రి విరాళం
దీపావళి పండుగ వేళ సమాజంలో సేవ చేయడమే నిజమైన ఆనందమనే సందేశాన్ని చాటుతూ నాట్స్ ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. తెలంగాణ రాష్ట్రం, ఘట్కేసర్ మండలం, మేడిపల్లి గ్రామంలో ఉన్న ‘మాతృ అభయ ఫౌండేషన్’ అనాథాశ్రమానికి సుమారు రూ.3 లక్షల విలువైన నాణ్యమైన వంట సామగ్రిని నాట్స్ విరాళంగా అందజేసింది. ప్రముఖ యాంకర్ సుమ కనకాల నిర్వహిస్తున్న ‘ఫెస్టివల్స్ ఫర్ జాయ్’ (Festivals for Joy) కార్యక్రమంతో కలిసి ఈ సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా సుమ కనకాల ఆశ్రమ చిన్నారులతో కలిసి సందడిగా సమయం గడిపారు. సంస్థ తరఫున ప్రముఖ సినీ రచయిత సిరాశ్రీ ఈ కార్యక్రమ ఐదో వార్షికోత్సవ షీల్డ్‌ను అందుకోవడం విశేషం.
ముమ్మరంగా ఉచిత వైద్య శిబిరాలు, ఫ్లూ వ్యాక్సినేషన్
ప్రవాస తెలుగు ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని డల్లాస్, న్యూజెర్సీ, మిస్సోరి, మిచిగన్, టాంపా నగరాల్లో నాట్స్ విస్తృతంగా వైద్య శిబిరాలను నిర్వహించింది. ప్రధానంగా జనరల్ హెల్త్ చెకప్స్, స్పెషలిస్ట్ వైద్యుల సంప్రదింపులు, ఫ్లూ వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. డల్లాస్ చాప్టర్ తన చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అతిపెద్ద ఉచిత వైద్య శిబిరాన్ని నాట్స్ విజయవంతంగా పూర్తి చేసింది. సుమారు ఏడు గంటల పాటు నిరంతరాయంగా సాగిన ఈ శిబిరంలో డల్లాస్–ఫోర్ట్ వర్త్ పరిసర ప్రాంతాల నుంచి 1,000 మందికి పైగా ప్రవాసులు ఉచితంగా వైద్య పరీక్షలు, నిపుణులైన డాక్టర్ల సలహాలు పొందారు. క్యారోల్టన్ రీజినల్ మెడికల్ సెంటర్ సహకారంతో చేపట్టిన ఈ శిబిరం ముఖ్యంగా భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు, విద్యార్థులు, ఆరోగ్య బీమా లేని సామాన్య కుటుంబాలకు కొండంత అండగా నిలిచింది. డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు కిరణ్ నారే, పవని నున్నా, వైద్య శిబిరం కోఆర్డినేటర్లు సౌజన్య రావెళ్ల, కృష్ణ వ్యాకరణం, ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ కిషోర్ నారే ఈ కార్యక్రమాన్ని ముందుండి విజయవంతంగా నడిపించారు. జాతీయ నాయకులు, స్థానిక కార్యకర్తలతో పాటు 15 మందికి పైగా విద్యార్థి వాలంటీర్లు పాల్గొని సేవలందించారు.
యూపీఏఎస్ఏ, సాయి దత్త పీఠం, నాట్స్ సంయుక్తంగా న్యూజెర్సీలో ఉచిత ఆరోగ్య శిబిరం, ఫ్లూ వ్యాక్సినేషన్ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో నాట్స్ ప్రెసిడెంట్ రాజ్ అల్లాడ స్వయంగా పాల్గొన్నారు. చాప్టర్ లీడర్ సాయి గంగుల ఈ క్యాంప్‌ను పర్యవేక్షించగా.. ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ జనార్ధన్ బొల్లు, కార్డియాలజిస్ట్ డాక్టర్ వెంకట రవి ఎస్. ఆకుల, పీడియాట్రిషన్ డాక్టర్ విజయ నిమ్మల తమ వైద్య సేవలను అందించారు. భవిష్యత్తులో కుటుంబ సభ్యులందరికీ అత్యవసర సీపీఆర్ శిక్షణ అందించడంతో పాటు, మరిన్ని నగరాల్లో ఉచిత ఆరోగ్య శిబిరాలను విస్తరిస్తామని రాజ్ అల్లాడ ఈ సందర్భంగా ప్రకటించారు. శ్రీదేవి మానేపల్లి నాయకత్వంలో కొత్తగా కొలువుదీరిన నాట్స్ మిచిగన్ చాప్టర్.. తన మొట్టమొదటి కార్యక్రమంగానే విజయవంతంగా ఫ్లూ వ్యాక్సినేషన్ క్యాంప్‌ను నిర్వహించి ప్రశంసలు అందుకుంది. అటు టాంపా చాప్టర్‌లోనూ ఫ్లూ వ్యాక్సినేషన్‌కు పెద్దపీట వేస్తూ మరో భారీ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు ముమ్మరం చేశారు.
శాన్ డియాగోలో అలరించిన ‘స్వరాభిషేకం’
కళలు, సాంస్కృతిక పరిరక్షణలో భాగంగా నాట్స్ శాన్ డియాగో చాప్టర్ బిర్చ్ అక్వేరియంలో ‘స్వరాభిషేకం’ పేరిట వైభవంగా భక్తి సంగీత కార్యక్రమాన్ని చేపట్టింది. సంగీత గురువులు, చిన్నారులు, విద్యార్థులు ఏకమై కర్ణాటక సంగీత దిగ్గజాలు త్యాగరాజ స్వామి, తాళ్లపాక అన్నమాచార్యులు, భద్రాచల రామదాసు కీర్తనలను శ్రావ్యంగా ఆలపించి ఆహూతులను భక్తి పారవశ్యంలో ముంచెత్తారు. దాదాపు 100కు పైగా తెలుగు కుటుంబాలు పాల్గొని ఈ గానామృతాన్ని ఆస్వాదించాయి. శాన్ డియాగో టీమ్‌లో నూతనంగా చేరిన పవన్ సిరువూరుకు నాట్స్ ఘనస్వాగతం పలికింది. ఈ కార్యక్రమ రూపకల్పనలో విశేష కృషి చేసిన కల్చరల్ కోఆర్డినేటర్ కామ్య శిష్ట్లా, మెయిన్ కోఆర్డినేటర్ ప్రశాంతి ఉడుమూడి, సంగీత విద్వాంసురాలు సుష్మ శిష్ట్లా, ఆమె శిష్యబృందం, అలాగే పవన్, రామ్ ఉడుముడిలకు చాప్టర్ ప్రతినిధులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
న్యూజెర్సీలో సమీరా భరద్వాజ్ స్వర ఝరి
మరోవైపు నాట్స్ న్యూజెర్సీ చాప్టర్, ‘గుడ్ వైబ్స్’ సంస్థతో చేతులు కలిపి ప్రముఖ సినీ నేపథ్య గాయని సమీరా భరద్వాజ్ లైవ్ మ్యూజికల్ నైట్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించింది. 500 మందికి పైగా సంగీత ప్రేమికులు తరలివచ్చిన ఈ సంగీత విభావరిలో సమీరా తన మధుర గాత్రంతో, సరికొత్త ఎనర్జీతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. నాట్స్ జాతీయ, ప్రాంతీయ స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. తెలుగు భాష, సంస్కృతి, సామాజిక సేవలకు నిరంతరం ఆర్థిక వెన్నుదన్నుగా నిలుస్తున్న తమ జాతీయ స్పాన్సర్లను ఈ వేదికపై ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Pocket Rockkets: కలకంటే రియాలిటీ బావుంది..
థమన్ ను పక్కన పెట్టిన త్రివిక్రమ్.. మళ్లీ కలుస్తారా
‘సత్యవాన్ సావిత్రి’ నుంచి ‘చక్కని కళ్ళ పిల్లా’.. సెకండ్ సింగిల్ విడుదల