భారీ స్థాయిలో షారుఖ్ ఖాన్ ‘కింగ్’ ప్రీ రిలీజ్ బిజినెస్!
ABN , Publish Date - Nov 03 , 2026 | 04:59 PM
షారుఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.665 కోట్లకు చేరినట్లు సమాచారం. ఓవర్సీస్, డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్ హక్కుల ద్వారా భారీ ఆదాయం సొంతం చేసుకుంది.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొత్త సినిమా 'కింగ్' డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతోంది. మూడేళ్ళ తర్వాత వస్తున్న షారూఖ్ సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా షారుఖ్ నటించిన 'జవాన్, పఠాన్' తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఆ కోవలోనే ఇదే సూపర్ డూపర్ హిట్ మూవీగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పైగా సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాను చాలా కష్టపడి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి తొలి గీతం విడుదల కావడంతో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇప్పటి వరకూ అడ్వాన్స్ బుకింగ్ ఇంకా మొదలు కాలేదు. అయినా... ఈ సినిమా ప్రీ రిలీజ్ కు జరిగిన బిజినెస్ చూసి, అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఓ హిందీ సినిమాకు ఇంత బిజినెస్ జరగడం, బజ్ క్రియేట్ కావడం ఊహించనిదని అంటున్నారు.
'కింగ్' సినిమా ఓవర్సీస్ హక్కులను ఫార్స్ ఫిల్మ్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆ సంస్థ ఏకంగా రూ.175 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. సాధారణంగా భారతీయ సినిమాల ఓవర్సీస్ హక్కుల బిజినెస్ రూ.100 కోట్ల మార్కు దాటడమనేది చాలా అరుదు. ఇక ఈ దేశంలో ఈ మూవీ పంపిణీ హక్కులను పెన్ మరుధర్ సంస్థ రూ.250 కోట్లకు దక్కించుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. హిందీ సినిమా మార్కెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఇది భారీ మొత్తమే అనుకోవాలి. ఇంకో వైపు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ 'కింగ్' డిజిటల్ హక్కులను రూ.150 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. శాటిలైట్ హక్కుల ద్వారా రూ.25 కోట్లు, మ్యూజిక్ హక్కుల ద్వారా రూ.65 కోట్లకు వస్తున్నాయని అంటున్నారు. అయితే సినిమా బాక్సాఫీస్ ప్రదర్శనను బట్టి డిజిటల్ హక్కుల రేటు ఇంకా పెరిగే ఆస్కారం ఉంది. అలా చూసినప్పుడు ఇప్పటికే 'కింగ్' ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ. 665 కోట్లు అవుతోంది. విడుదల తర్వాత బాక్సాఫీస్ వసూళ్ళతో ఈ మొత్తం మరింత పెరిగే ఆస్కారం కూడా ఉంది.
ఈ సినిమా కోసం మొదట రూ. 300 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. అయితే అది కాస్త రూ. 400 కోట్లకు చేరిందట, అలానే చిత్ర నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ ప్రమోషన్స్ కోసం మరో రూ. 50 కోట్ల ఖర్చు పెట్టబోతోందట. సో... సినిమా బడ్జెట్ మొత్తం రూ. 450 కోట్లు అయినట్టు. సినిమా పంపిణీ, ఇతర ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే రూ. 550 కోట్లు వసూలు అయితే బ్రేక్ ఈవెన్ అయినట్టు. ఈ మొత్తాన్ని సినిమా అవలీలగా దాటేస్తుందని, ఇటీవల వచ్చిన 'జైలర్ 2' తరహాలో 'కింగ్' మూవీ సైతం బాక్సాఫీస్ బరిలో సందడి చేస్తుందని కింగ్ ఖాన్ అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసులో .. 22 ఏళ్ళ యువతి అరెస్ట్
Sundar C: నిజాలు తెలుసుకోకుండా.. వార్తలు రాయడం బాధిస్తుంది
Mahesh Babu: గేమింగ్ రంగంలోకి మహేశ్ బాబు.. షార్ట్ గన్ గేమ్స్‌లో పెట్టుబడి!