సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సీనియర్ నటి, ‘అదుర్స్’ ఎన్టీఆర్ బామ్మ కన్నుమూత

ABN, Publish Date - Oct 30 , 2026 | 03:54 PM

దక్షిణాది చిత్ర పరిశ్రమలో తీరని విషాదం చోటుచేసుకుంది. తమిళ, తెలుగు భాషల్లో వందలాది చిత్రాల్లో బామ్మ, అమ్మ పాత్రలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ (93) కన్నుమూశారు.

Vatsala Rajagopal

దక్షిణాది చిత్ర పరిశ్రమలో తీరని విషాదం చోటుచేసుకుంది. తమిళ, తెలుగు భాషల్లో వందలాది చిత్రాల్లో బామ్మ, అమ్మ పాత్రలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ (93) (Vatsala Rajagopal) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, శుక్రవారం (అక్టోబర్ 30) చెన్నైలోని పల్లవరంలో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్త తెలుసుకున్న కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పిస్తున్నారు. అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని పల్లవరంలోని స్వగృహంలో ఉంచారు.


తిరువనంతపురంలో జన్మించిన వత్సలా రాజగోపాల్‌కు చిన్నతనం నుంచే నాటకాలు, నృత్యం అంటే అమితమైన ఆసక్తి ఉండేది. వివాహం అనంతరం 1953లో చెన్నైకి మారిన ఆమె, అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో క్లర్క్‌గా ప్రభుత్వ ఉద్యోగం చేశారు. ఉద్యోగం చేస్తూనే కార్టూనిస్ట్ శ్రీధరన్ నడిపే ‘రసిక రంగ’ నాటక సమాజంలో చేరి రంగస్థల నటిగా అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. అలా రంగస్థలంపై ఆమె నటనను గమనించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం.. 1992లో వచ్చిన క్లాసిక్ మూవీ ‘రోజా’లో కథానాయిక మధుబాలకు బామ్మగా నటించే అవకాశం ఇచ్చారు. దాదాపు తన 60 ఏళ్ల వయసులో వెండితెరకు పరిచయమైన ఆమె, ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు.


తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 400లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘అదుర్స్’ (Adhurs)లో చారి (ఎన్టీఆర్)కి బామ్మగా ఆమె చేసిన కామెడీ, అమాయకమైన నటన తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో పాటు వారి గుండెల్లో ఆమెను చిరస్థాయిగా నిలిపింది. వీటితో పాటు ‘అపరిచితుడు’ (అన్నియన్), ‘సతీ లీలావతి’, ‘రిథమ్’, ‘విన్నర్’, ‘పట్టియల్’, ‘ధామ్ ధూమ్’, ‘మొళి’, ‘కల్యాణ సమయల్ సాథమ్’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఆమె కీలక పాత్రలు పోషించారు. సినిమాలతో పాటు ‘చిత్తి’, ‘ఆనందం’, ‘ముందానై ముడిచ్చు’ వంటి పలు సూపర్ హిట్ టీవీ సీరియల్స్‌లోనూ, దిగ్గజ దర్శకుడు బాలు మహేంద్ర రూపొందించిన ‘కథై నేరమ్’ టెలివిజన్ సిరీస్‌లోనూ నటించి బుల్లితెర ప్రేక్షకులను కూడా మెప్పించారు. నాలుగు దశాబ్దాల పాటు నటనారంగానికి సేవలందించిన వత్సలా రాజగోపాల్ మృతి పట్ల సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

‘మెగావర్స్’లో కమల్ హాసన్ - చిరంజీవిల క్రేజీ ప్రామిస్..

Ramayana: ‘జతగూడె’.. కన్నుల పండువగా సీతారాముల కళ్యాణం సాంగ్

‘ఆకాశంలో ఒక తార’.. మనసును తాకేలా ‘రాధే రాధే’ సాంగ్ విడుదల

Updated Date - Oct 30 , 2026 | 04:10 PM