Balakrishna: ఈ సారి.. 'దాదా' టార్గెట్‌ మిస్‌ అవ్వదు!

ABN , Publish Date - Oct 15 , 2026 | 06:29 PM

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దాదా’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

Dada Movie

నటసింహం స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్లలో పూనకాలు రావాల్సిందే. ఆ డైలాగ్ డెలివరీ, ఆ పవర్ ప్యాక్డ్ యాక్షన్ చూస్తే కుర్ర హీరోలకు కూడా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. వయసు అరవై ఆరేళ్లు దాటినా.. స్పీడ్ విషయంలో మాత్రం ఇండస్ట్రీలో ఎవరూ ఆయన దరిదాపుల్లోకి కూడా రాలేకపోతున్నారు. రీసెంట్‌గా చిన్న సర్జరీ జరిగి కొద్దిరోజులు రెస్ట్ తీసుకున్నా.. ఒక్కసారి సెట్స్ లోకి రీ-ఎంట్రీ ఇచ్చాడా ఇక అంతే సంగతులు. ఆ జోరును ఎవరూ ఆపలేరని మరోసారి ప్రూవ్ చేశాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ‘దాదా’ (Dada) వేట మొదలైంది. డిసెంబర్ 24న థియేటర్లలో విధ్వంసం సృష్టించడానికి బాలయ్య రెడీ అవుతున్నారు.

గోపీచంద్ మలినేని (Gopichand Malineni) - నందమూరి బాలకృష్ణ (Balakrishna).. ఈ క్రేజీ కాంబినేషన్ ఫుల్‌ వైబ్స్‌ కనిపిస్తాయి. గతంలో వచ్చిన వీరసింహారెడ్డి సినిమాతో భారీ హిట్ కొట్టిన ఈ జోడీ, ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమైంది. ఈసారి బ్యాక్‌డ్రాప్ పక్కా ముంబై మాఫియా. టైటిల్ ‘దాదా’ అని అనౌన్స్ చేసినప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమాలో బాలయ్య సరికొత్త మేకోవర్‌తో, మునుపెన్నడూ చూడని రా అండ్ రస్టిక్ యాక్షన్ అవతారంలో మెప్పించబోతున్నాడు.

అయితే, ఇటీవల బాలకృష్ణకు చిన్న సర్జరీ జరగడంతో సినిమా షూటింగ్‌కు కాస్త బ్రేక్ పడింది. దీంతో సినిమా అనుకున్న సమయానికి వస్తుందా లేదా అనే సందిగ్ధంలో ఫ్యాన్స్ పడ్డారు. కానీ, దర్శకుడు గోపీచంద్ మలినేని ఏమాత్రం సమయాన్ని వృథా చేయలేదు. బాలయ్య రెస్ట్ తీసుకుంటున్న సమయంలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పరుగులు పెట్టించాడు. అంతేకాకుండా, బాలయ్య అవసరం లేని ఇతర నటీనటుల కీలక సన్నివేశాలన్నింటినీ పక్కా ప్లానింగ్‌తో పూర్తి చేసేశాడు.

ఇక ఆరోగ్యం పూర్తిగా కుదుటపడగానే.. బాలయ్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా షూటింగ్ స్పాట్‌లోకి అడుగుపెట్టాడు. రెస్ట్ తీసుకున్న సింహం వేటకు దిగితే ఎలా ఉంటుందో ముంబై షెడ్యూల్‌తో చూపించాడు. గత వారమే మొదలైన ఈ కీలక ముంబై షెడ్యూల్ ఎలాంటి ఆటంకాలు లేకుండా శరవేగంగా పూర్తి కావచ్చింది. ముంబై వీధుల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన మాఫియా యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయని ఇన్సైడ్ వర్గాల సమాచారం. ముంబై షెడ్యూల్ దాదాపు ముగియడంతో యూనిట్ అంతా హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. వచ్చే వారం నుంచే హైదరాబాద్‌లో మరో కీలకమైన షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఈ షెడ్యూల్‌తో ‘దాదా’ సినిమాకు సంబంధించిన పూర్తి టాకీ పార్ట్ షూటింగ్ కంప్లీట్ కానుంది. ఆ తర్వాత కేవలం సాంగ్స్, చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మాత్రమే మిగులుతాయి.

మేకర్స్ టార్గెట్ ఒక్కటే.. డిసెంబర్ 24, క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడం. ప్రస్తుత వర్కింగ్ స్పీడ్ చూస్తుంటే అనుకున్న డేట్‌కు ‘దాదా’ రావడం పక్కా అని తేలిపోయింది. సంక్రాంతి సీజన్‌కు ముందే థియేటర్లలో రికార్డుల వేట మొదలుపెట్టాలని టీమ్ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. బాలయ్య పవర్‌ఫుల్ పంచ్ డైలాగులు, మాఫియా డాన్‌గా ఆయన నటన వెండితెరపై సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. వయసు కేవలం నంబర్ మాత్రమేనని, కంటెంట్ ఉంటే బాక్సాఫీస్‌ను ఎలా శాసించవచ్చో బాలయ్య మరోసారి నిరూపించబోతున్నాడు.

Updated Date - Oct 15 , 2026 | 06:58 PM