జైలర్ 2 రివ్యూ.. సీక్వెల్ సెంటిమెంట్‌ను చెరిపేసిన రజనీకాంత్!
ABN , Publish Date - Oct 15 , 2026 | 01:29 PM
రజనీకాంత్ నటించిన జైలర్ 2 సినిమా ఎలా ఉంది? నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సీక్వెల్లో రజనీ స్టైల్, కామెడీ, యాక్షన్, అనిరుధ్ సంగీతం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకున్నాయి? పూర్తి మూవీ రివ్యూ చదవండి.
సీక్వెల్ సినిమాలంటే పెద్దంత ఆసక్తి లేని సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా నటించిన 'జైలర్ 2' దసరా కానుకగా అక్టోబర్ 15న జనం ముందుకొచ్చింది. సూపర్ హిట్ అయిన 'రోబో'కు సీక్వెల్ గా వచ్చిన '2.0' మూవీ పరాజయం పాలు కావడం బహుశా రజనీకాంత్ కు సీక్వెల్స్ పై ఆసక్తి లేకపోవడానికి కారణం కావచ్చు. అయితే... '2.0'లో జరిగిన పొరపాటు ఈసారి జరగకుండా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు.
నీతి నిజాయితీలకు మారుపేరైన జైలర్... టైగర్ ముత్తువేల్ పాండియన్ (రజనీకాంత్) పురాతన విగ్రహాలతో అక్రమ వ్యాపారం చేసే వారితో తన కొడుకు చేతులు కలిపాడనే విషయం తెలిసి, అతన్ని కూడా చంపేస్తాడు. అలానే ఆ ముఠాలోని కీలకవ్యక్తి వర్మ (వినాయకన్)ను ముత్తువేల్ హతమార్చి, విగ్రహాలు ఉన్న మూడు కంటైనర్లను స్వాధీనం చేసుకుంటాడు. అక్కడితో 'జైలర్' మూవీకి శుభం కార్డు పడుతుంది. ప్రస్తుతానికి వస్తే... ముత్తువేల్ పాండియన్ కోయంబత్తూరులో సూపర్ మార్కెట్ సూపర్ వైజర్‌గా పనిచేస్తుంటాడు. వర్మ చనిపోయిన తర్వాత మాయమైన మూడు కంటైనర్ల కోసం విగ్రహాల అక్రమ రవాణ ముఠా తీవ్రంగా వెదుకుతూ ఉంటుంది. కేరళలోని దిలీప్ (సూరజ్ వెంజరమూడు) కు ఆ పని అప్పగిస్తుంది. ఈ విషయం ముత్తువేల్ కు తెలుస్తుంది. తనని వాళ్ళు రీచ్ అయ్యే లోపే తానే వాళ్ళను అంతం చేయాలని భావిస్తాడు. కోయంబత్తూరులోని పళ్ళ వ్యాపారి మూర్తి (నమో నారాయణ)తో చేతులు కలిపి, దిలీప్ ను చేరతాడు ముత్తువేల్. ఈ మొత్తం ముఠాకీ సూత్రధారి గోవాలో ఉండే చక్రి కాల్పక్ (మిధున్ చక్రవర్తి), అతని కుటుంబం అని తెలుస్తుంది. తమిళనాడు నుంచి కేరళ మీదుగా గోవా చేరిన ముత్తువేల్... చక్రి కాల్పక్ ఫ్యామిలీకి ఎలా బుద్ధి చెప్పాడు? ఈ క్రమంలో కొడుకును చంపేసింది అతనే అని భార్యకు, కోడలుకు తెలిసినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? దాని నుంచి ఎలా బయటపడ్డాడు? అనేది మిగతా కథ.
సినిమా ప్రథమార్ధం వినోదాత్మకంగా సాగిపోయింది. స్మగ్లర్ దిలీప్ ను కలవడం కోసం ముత్తువేల్ వేసే స్కెచ్, అందులో మూర్తి, విమల్ (యోగిబాబు) పావులుగా మారడం, దిలీప్ నేపథ్యం తెలియక మూర్తి ప్రదర్శించే అతి తెలివితేటలు నవ్వుల పువ్వులు పూయిస్తాయి. రజనీకాంత్ కామెడీ టైమింగ్ కూడా అదిరిపోయింది. అయితే ద్వితీయార్థంకు వచ్చేసరికీ 'జైలర్' ఫార్మాట్‌నే నెల్సన్ అనుసరించాడు. రజనీకాంత్ కు పెద్దంత బరువు బాధ్యతలు ఇవ్వకుండా... ప్రత్యేక పాత్రలతో కథను రక్తి కట్టించాడు. రజనీకి ఉన్న ఇమేజ్ కారణంగా ఆయన స్వయంగా పనికట్టుకుని భీకరమైన పోరాటాలు చేయకుండానే కనుసైగతో పనులు కానిచ్చేయడం కూడా అభిమానులను అలరించేలా చూపించాడు. ప్రీ ఇంటర్వెల్ లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్‌ను రంగంలోకి దించిన దర్శకుడు క్లైమాక్స్ లో హృతిక్ రోషన్ ను తురపుముక్కగా వాడుకున్నాడు. హృతిక్ తెర మీద కనిపించేది ఐదు, పది నిమిషాలే అయినా... ఆ క్లాసిక్ యాక్షన్ ఎపిసోడ్ బాగుంది. ద్వితీయార్థం గోవా నేపథ్యంలో రంగ ప్రవేశం చేసిన మిథున్ చక్రవర్తి అండ్ ఫ్యామిలీ కథా కమామీషులో ముందుకు సాగుతుంది. ద్వితీయార్థంలో ఎలాంటి కొత్తదనం లేదు. కొడుకును చంపింది ముత్తువేలే అని బోధి కల్పక్ (ఎస్.జె. సూర్య)తో రివీల్ చేయించిన దర్శకుడు... దాన్ని జెస్టిఫ్ చేసేలా కాంత కల్పక్ (విద్యాబాలన్) పాత్రతో చెప్పించేశాడు. ఈ భావోద్వేగ సన్నివేశాలను ఇంకా బాగా తీసి ఉండాల్సింది. ఏదేమైనా... స్టైల్‌కు మారు పేరైన రజనీకాంత్ ఐదు దశాబ్దాలుగా దాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు మరోసారి ఈ సినిమాలో తన మాటలు, చేతలతో అవి ఎవర్ గ్రీన్ అని నిరూపించారు. 'జైలర్ 3'కి లీడ్ ఇస్తూ విజయ్ సేతుపతిని నెల్సన్ తెర మీద చూపించడం కొసమెరుపు.
రజనీకాంత్‌కు ఇలాంటి పాత్రలు పోషించడం నల్లేరు మీద బండి నడక. 'జైలర్'తో పోల్చితే ఆయన పెద్దగా కష్టపడిందేమీ లేదు. రమ్యకృష్ణ, మిర్నా పాత్రల పరిధి మేరకు నటించారు. భగవతి పెరుమాళ్, యోగిబాబు, నమో నారాయణ బాగా నవ్వించారు. సూరజ్ వెంజరమూడు... వినాయక్ పాత్రను రీప్లేస్ చేశాడనే చెప్పాలి. అయితే ఆ పాత్రలోని కొత్తదనం ఈ పాత్రలో పెద్దంతగా లేదు. మిధున్ చక్రవర్తి వీల్ ఛైర్‌కే పరిమితం అయ్యాడు. విద్యాబాలన్‌తో కాస్తంత కొత్తగా చేయించారు. అదే సమయంలో ఎస్. జె.సూర్య ఓవర్ యాక్షన్ చేయకుండా దర్శకుడు బాగానే కంట్రోల్ చేశాడు. హైదరాబాదీ వినయ్ వర్మ పోలీస్ అధికారి పాత్రలో మెరిశాడు. మేఘనారాజ్ శివరాజ్ కుమార్ భర్యగా నటించింది. మాస్ ఆడియెన్స్ ను మెప్పించడం కోసం ప్రథమార్ధంలో పూర్ణతోనూ, ద్వితీయార్ధంలో నోరా ఫతేహీతోనూ దర్శకుడు ఐటమ్ సాంగ్స్ చేయించాడు. నిజానికి వాటి అవసరమే లేదు! సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ అనిరుధ్ తన నేపథ్య సంగీతంతో ప్రతి సన్నివేశాన్ని నిలబెట్టాడు. పాటల స్వర కల్పన మాత్రం ఏమంత గొప్పగా లేదు. ప్రథమార్ధంలా ద్వితీయార్ధం లేదన్నది వాస్తవం. అయితే థియేటర్ నుంచి బయటకు వచ్చే వారిని 'జైలర్ 2' నిరాశకు మాత్రం గురిచేయదు. రజనీకాంత్‌కు ఉన్న సీక్వెల్ సెంటిమెంట్‌ను 'జైలర్ 2' తుడిచేస్తుందని చెప్పొచ్చు.
రేటింగ్: 2.75/5
ట్యాగ్‌లైన్: అచ్చివొచ్చిన సీక్వెల్!
ఇవి కూడా చదవండి:
బాలీవుడ్‌కు కృతి శెట్టి.. ఫస్ట్ ఫిల్మ్ షూటింగ్ ప్రారంభం
MS Subbulakshmi Biopic: మొన్న కమల్.. ఇప్పుడు రజనీ..
Soori7: మైత్రీ మూవీ మేకర్స్‌లో సూరి కొత్త ప్రాజెక్ట్.. గ్రాండ్‌గా ప్రారంభం