Crazy Kalyanam Review: అనుపమ పరమేశ్వరన్ '‘క్రేజీ కల్యాణం’ ఎలా ఉందంటే..

ABN , Publish Date - Oct 16 , 2026 | 09:11 AM

దసరా రేసులో ఉన్న చిత్రాల్లో అనుపమ పరమేశ్వరన్‌ నటించిన ‘క్రేజీ కల్యాణం’ ఒకటి. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిట్‌ కోసం ఎదురుచూస్తున్న కేరళ క్యూటీ అనుపమకు ఈ సినిమా సక్సెస్‌ ఇచ్చిందా? ప్రేక్షకుల్ని ఈ సినిమా ఏమేరకు మెప్పించింది అన్నది చూద్దాం.

సినిమా రివ్యూ: ‘క్రేజీ కల్యాణం’
విడుదల తేది: 16-10-2026

దసరా రేసులో ఉన్న చిత్రాల్లో అనుపమ పరమేశ్వరన్‌ నటించిన ‘క్రేజీ కల్యాణం’ ఒకటి. వీకే నరేష్‌ విజయ కృష్ణ,  తరుణ్‌ భాస్కర్‌, అఖిల్‌ ఉడ్డెమారి కీలక పాత్రధారులు. బద్రప్ప గాజుల దర్శకత్వం వహించారు. యారో సినిమాస్‌ బ్యానర్‌పై బూసం జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్మించారు. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ ప్రేమకథతో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిట్‌ కోసం ఎదురుచూస్తున్న కేరళ క్యూటీ అనుపమకు ఈ సినిమా సక్సెస్‌ ఇచ్చిందా? ప్రేక్షకుల్ని ఈ సినిమా ఏమేరకు మెప్పించింది అన్నది చూద్దాం.

కథ:
మెదక్‌లోని ఓ పల్లెలో సాగే కథ ఇది. అక్కడ పర్వతాలు తిక్క (వీకే నరేశ్‌) గౌరవ ప్రదంగా జీవించాలనుకునే వ్యక్తి. అతనికి ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయిని అన్నయ్య చూసిన అబ్బాయి బాలరాజు (తరుణ్‌ భాస్కర్‌)కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అతను ఏ పనీపాట లేకుండా తాగుతూ.. ఇంటి మీదకు రోజుకో గొడవ తీసుకొచ్చే వ్యక్తి. రెండో కూతురు కీర్తి (అనుపమ పరమేశ్వరన్‌). స్వతంత్రభావాలు, ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి. బాగా చదువుకుని గవర్నమెంట్‌ జాబ్‌ చేయాలనుకుంటుంది. తండ్రి ఏమో బాగా చదువుకుని ఆస్తిపాస్తులున్న కుర్రాడికిచ్చి పెళ్లి చేయాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. అయితే కీర్తి చిన్ననాటి స్నేహిడుడైన ఉదయ్‌(అఖిల్‌రాజ్‌)తో ప్రేమలో ఉంటుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత అతన్ని పెళ్లాడాలనుకుంటుంది. ఈ లోపు పర్వతాలు ఒక అమెరికా సంబంధం చూసి వివాహం ఖాయం చేస్తాడు. కీర్తి తన తండ్రి మాట విని అమెరికా సంబంధం చేసుకుందా? ఉద్యోగం చేయాలనే తన కల నెరవేరిందా? ఉదయ్‌తో ప్రేమబంధం ఏమైంది అన్నది కథ.


విశ్లేషణ:
విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లోసాగే కథ ఇది. కూతురిని ఉన్నతమైన కుటుంబంలో ఇస్తే ఓ పనైపోతుంది అనుకునే తండ్రి.. ‘ఆడపిల్ల అంటే అంట్లు తోముకోవడానికే కాదు.. అనుకుంటే ఏదైనా సాధించాలి’ అనుకునే ఓ కూతురికి మధ్య సంఘర్ణణే ఈ సినిమా. ఫస్టాఫ్‌ అంతా తాగుబోతు అల్లుడి గోల, చిన్న కూతురు చదువు, ఆమె లవ్‌ ట్రాక్‌ వంటి సన్నివేశాలతో గడిచిపోయింది. అయితే ఫస్టాఫ్‌లో అల్లుడి పాత్రలో తరుణ్‌ భాస్కర్‌ చేసే అల్లరి ఆకట్టుకుంటుంది.. వినోదాన్ని పంచుతుంది. కీర్తి, ఉదయ్‌ల ప్రేమకథలో మాత్రం పెద్దగా విషయం ఉండదు.. ఏదో తేలిపోయినట్లుగా సాగిపోతుంది. లవ్‌ట్రాక్‌లో బలవంతమైన సీన్‌ ఒక్కటి కూడా కనిపించదు. పెళ్లి సంబంధంతో ఒక భావోద్వేగ సన్నివేశంతో విరామం. కీర్తికి ఎన్నారైతో పెళ్లి కుదరడం నుంచి కథలో కాస్త వేగం పెరుగుతుంది. అక్కడి నుంచి కథ పరంగా బాగానే ఉన్నా.. ప్రతి సీను అతికినట్లు అనిపిస్తుంది. హీరోయిన్‌ తన ప్రియుడిని దక్కించుకోవడానికి వేసే ప్రణాళిక ఏదీ ఆకట్టుకునేలా ఉండదు. హర్షవర్ధన్‌ స్పోకెన్‌ ఇంగ్లిష్‌ సీన్‌ అవసరం లేదనిపిస్తుంది. కష్టం వచ్చినప్పుడే మనిషికి అండగా ఉండాలని చెప్పేలా బాలరాజు పాత్రలో వచ్చిన మార్పు సీన్‌ ఆకట్టుకుంటుంది. అయితే క్లైమాక్స్‌లో పెళ్లి తంతు రొటీన్‌గా ఉంది. నరేశ్‌ తల్లి చనిపోయిందనే సన్నివేశం, క్లైమాక్స్‌ ఫైట్‌లో నేచురాలిటీ మిస్‌ అయింది.. ఆ రెండు సన్నివేశాలు దాదాపు పదిహేను నిమిషాలకు సాగడం కాస్త మైనస్‌గా చెప్పుకోవచ్చు. అయితే చాలామంది మేకర్స్‌ ఈ మధ్యకాలంలో తెలంగాణ నేపథ్యంలో చాలా సినిమాలు తీస్తున్నారు. వాటిలో పెళ్లిళ్ల సన్నివేశాలు అనగానే మటన్‌.. మందు.. గొడవలు కామన్‌ అని చూపిస్తున్నారు. ఇందులో కూడా పావుగంట సేపు అదే తంతు కనిపించింది. మరి తెలంగాణ ప్రేక్షకులు దీనిని ఎలా తీసుకుంటారో చూడాలి.

నటీనటులు, సాంకేతిక నిపుణులు పనితీరు..


మిడిల్‌క్లాస్‌లో పుట్టి, స్వతంత్ర భావాలున్న అమ్మాయిగా కీర్తి పాత్రలో అనుపమా పరమేశ్వరన్‌ ఒదిగిపోయింది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ చక్కని భావాలతో అలరించింది. నటిగా ఆమెకు పేరు పెట్టడానికి లేదు. బాలరాజు పాత్రలో తరుణ్‌ భాస్కర్‌ కూడా మెప్పించారు. బాధ్యత లేకుండా తాగుడుకు భానిస అయిన వ్యక్తిగా తెరపై నవ్వులు పూయించాడు. ఉదయ్‌ పాత్రలో ‘రాజు వెడ్స్‌ రామ్‌భాయ్‌’ ఫేం అఖిల్‌ రాజ్‌ ఫర్వాలేదనిపించాడు.  వీకే నరేష్‌కు కూడా మంచి పాత్ర దక్కింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాకు ఆయనే హీరో. కొన్ని సన్నివేశాల్లో నటనకు న్యాయం చేశాడు. క్లైమాక్స్‌లో మాత్రం బోర్‌ కొట్టించాడు. భావోద్వేగ సన్నివేశాల్లో సహజత్వం లోపించింది. మిగతా ఆర్టిస్ట్‌లు అంతా పరిధిమేరకు నటించారు. సురేష్‌ బొబ్బిలి పాటలు సోసోగా ఉన్నా.. నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు. శ్యామ్‌ దూపాటి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. పల్లె అందాలను, ఊరి నేపథ్యాన్ని చక్కగా చిత్రీకరించారు. ఎడిటర్‌ శ్రావణ్‌ కటికనేని సెకెండాఫ్‌కు కాస్త లెంగ్త్‌ తగ్గించిఉంటే బావుండేది. నిర్మాత కథకు తగ్గ ఖర్చు చేసినట్లు తెరపై కనిపిస్తుంది. దర్శకుడు ఎంచుకున్న లైన్‌ బావుంది కానీ.. మంచి సీన్లు రాసుకోవడానికి స్కోప్‌ ఉన్న రాసుకోలేకపోయాడు. క్లైమాక్స్‌ను మాత్రం భావోద్వేగాలతో నింపేశాడు. ముఖ్యంగా ఈరోజులో అమ్మాయి పెళ్లికి పెట్టే ఖర్చు కట్నంలో 10శాతం డబ్బును అమ్మాయి చదువుకు వినియోగించలేకపోతున్నారు.. చదువుకున్న అమ్మాయి ఇంట్లో ఉంటే ఈ ఇంటికే ఎంతో గౌరవం అని చెబుతూ చిన్న సందేశం ఇచ్చాడు దర్శకుడు. ఆ పాయింట్‌ మాత్రం ఆలోచింజేస్తుంది. ఈ సినిమాలో దర్శకుడు ఎంచుకున్న లైన్‌ మంచిదే అయినా.. ఇంకాస్త మంచి సీన్స్‌ రాసుకుని ఉంటే బావుండేది. రెండు పెద్ద సినిమా మధ్య విడుదలైన ఈ సినిమా రిజల్ట్‌ ఎలా ఉంటుందో చూడాలి.

ట్యాగ్‌లైన్‌: బోరింగ్‌ కల్యాణం
రేటింగ్‌: 2.25/5

Updated Date - Oct 16 , 2026 | 09:25 AM