'డోంట్ స్లీప్' అంటున్న దర్శకుడిగా మారిన సినిమాటోగ్రాఫర్!
ABN , Publish Date - Oct 14 , 2026 | 06:19 PM
ఇంద్ర రామ్ హీరోగా, షామ్‌దత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘డోంట్ స్లీప్’ టీజర్‌ను నాగచైతన్య, విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్ విడుదల చేశారు. ఉత్కంఠభరితమైన కథనం, ప్రత్యేకమైన విజువల్స్‌తో టీజర్ ఆకట్టుకుంటోంది.
మలయాళ దర్శకుడు షామ్‌దత్, యంగ్ హీరో ఇంద్ర రామ్ కాంబినేషన్లో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘డోంట్ స్లీప్’. మమ్ముట్టి నటించిన మలయాళం, తమిళ ద్విభాషా థ్రిల్లర్ ‘స్ట్రీట్ లైట్స్’తో దర్శకుడిగా పరిచయమైన సినిమాటోగ్రాఫర్ షామ్‌దత్, ఈ చిత్రంతో తెలుగులో దర్శకుడిగా అడుగుపెడుతున్నారు. ‘చౌర్య పాఠం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇంద్ర రామ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. వీ డ్రీమ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై వీ చుడామణి నిర్మిస్తున్న రెండో సినిమా ఇది.
గురువారం నాగచైతన్య, విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్ కలిసి ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. పెళ్లి తర్వాత సంతోషంగా, ప్రశాంతంగా జీవిస్తున్న కథానాయకుడి జీవితంలోకి ఓ కల రూపంలో అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంటుంది. అతను కన్న కలల్లో ఒకటి నిజం కావడం మొదలైనప్పటి నుంచి అతని జీవితం తలకిందులవుతుంది. అతన్ని చంపాలని ప్రయత్నిస్తున్న ఓ మిస్టరీ వ్యక్తి నిరంతరం వెంటాడుతుంటాడు. ప్రాణాలు ప్రమాదంలో పడటంతో అప్రమత్తంగా ఉంటూ, తనను తాను కాపాడుకోవడానికి కథానాయకుడు పోరాడాల్సి వస్తుంది. ‘ “The longer you sleep, the closer he gets.’ అనే ట్యాగ్‌లైన్‌తో సినిమా ఉత్కంఠను పెంచుతోంది.
ఇంతకుముందెన్నడూ చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు షామ్‌దత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కథనం, ఆకట్టుకునే వాయిస్ ఓవర్, ప్రత్యేకమైన విజువల్ ట్రీట్మెంట్ టీజర్‌ను మరింత ఆసక్తికరంగా మార్చాయి. సినిమాటోగ్రాఫర్‌గా కూడా షామ్‌దత్ తన ప్రతిభను చాటుకున్నారు. అద్భుతమైన విజువల్స్‌తో సినిమా మూడ్‌ను, ఉత్కంఠను మరింత పెంచారు. గోకుల్ హర్షన్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాల్లోని ఉత్కంఠను పెంచి ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేస్తోంది. ‘పుష్ప: ది రైజ్’, ‘రంగస్థలం’ చిత్రాలకు పనిచేసిన మోనికా – రామకృష్ణ ఈ సినిమా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్టేట్ అవార్డు గ్రహీత మనోజ్ ఎడిటింగ్ చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఐ యామ్ గేమ్’ చిత్రానికి పనిచేసిన సజీర్ బాబా, లూనా ఈ కథను అందించారు.
ఇంద్ర రామ్ సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. విలన్ పాత్రలో రవీంద్ర విజయ్ బలమైన ముద్ర వేశారు. ముఖ్యంగా చివరి సన్నివేశంలో ఆయన నటనలోని వైవిధ్యం కనిపిస్తోంది. తబా రీమా, జోయీత బెనర్జీ, సునీల్ థాపా, ఆడుకలం నరేన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విభిన్నమైన కథాంశం, విజువల్స్, ఉత్కంఠభరితమైన కథనంతో ‘డోంట్ స్లీప్’ టీజర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.

టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరో ఇంద్రరామ్ మాట్లాడుతూ, 'షామ్ గారు కథ చెప్పినప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇద్దరం కలిసి కేరళ వెళ్లి లొకేషన్స్ రెక్కీ చేశాం. 15 రోజుల్లో షూటింగ్ మొదలుపెట్టాం. డీఓపీనే డైరెక్టర్ అవడం వల్ల తనకు అనుకున్నట్టుగా చేయగలిగారు. చాలా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న సినిమా ఇది. శ్యామ్ గారితో నాకు చాలా ఎమోషనల్ జర్నీ. ఆయన కేవలం డైరెక్టర్ మాత్రమే కాకుండా అన్ని విభాగాల్లో కేర్ తీసుకున్నారు. సినిమా చాలా బాగా వచ్చింది. కచ్చితంగా హిట్ కొట్టబోతున్నామనే నమ్మకం ఉంది. దేవకట్ట గారు తన టైమ్ కేటాయించి కొన్ని డైలాగ్స్ రాశారు. అలాగే ఒక సాంగ్ కూడా రాశారు' అని అన్నారు.
డైరెక్టర్ షామ్ దత్ మాట్లాడుతూ, 'నేనొక విజువల్ పర్సన్‌ని. నేను తీసిన విజువల్ సినిమాలో ఉంటుంది. అదే మాట్లాడుతుంది. ఈ వేడుకకు వచ్చిన ప్రసాద్ గారికి, నా డైరెక్టర్ మిత్రులందరికీ థాంక్యూ. వాళ్లందరూ నా కుటుంబ సభ్యుల్లాంటి వాళ్లు. ఇది రెగ్యులర్ సినిమా కాదు. చాలా కొత్త కథ. సినిమా చూసి మీరే చెప్పాలి. చాలా మంచి టీమ్‌తో కలిసి సినిమా చేశాం. ఇంద్ర ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తను అన్ని విభాగాల్లో పని చేశాడు. తనలాంటి ప్యాషనేట్ యాక్టర్ దొరకడం నాకు హ్యాపీగా అనిపించింది' అని అన్నారు. హీరోయిన్ జోయీతా బెనర్జీ మాట్లాడుతూ, 'తెలుగులో ఇది నా తొలి సినిమా. అందరికీ ఫస్ట్ సినిమా చాలా స్పెషల్. ఇంత మంచి టీమ్‌తో కలిసి పని చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. శ్యామ్ గారు నాకు ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే ఇంద్ర కూడా చాలా సహకరించాడు. తప్పకుండా ఈ సినిమా మీరందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది' అని తెలిపారు. అనీష్ కురువిల్లా మాట్లాడుతూ, 'షామ్ గారు ప్రతి ప్రాజెక్ట్‌లో ఏదో ఒక స్పెషల్ చేసేవారు. ఇది చాలా హై కాన్సెప్ట్ ఐడియా ఉన్న సినిమా. తెలుగు సినిమాకు ఇప్పుడు చాలా ఫ్రెష్, కొత్త కంటెంట్ కావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను' అని అన్నారు. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో దర్శకులు దేవ కట్టా, కళ్యాణ్ శంకర్, శ్రీరామ్ ఆదిత్య, రాధాకృష్ణ, నిర్మాత బీవీయస్ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Jailer 2: సంతానం సీన్లన్నీ ఔట్.. విజయ్ సేతుపతి పాత్ర ‘జైలర్ 3’కి లీడ్..
సెట్లో ప్రమాదం.. ఇమ్రాన్ హష్మీకి తప్పిన ప్రాణాపాయం
సితార ఎంటర్టైన్మెంట్స్ సినిమాల విడుదల వాయిదా