Soori7: మైత్రీ మూవీ మేకర్స్లో సూరి కొత్త ప్రాజెక్ట్.. గ్రాండ్గా ప్రారంభం
ABN , Publish Date - Oct 15 , 2026 | 09:19 AM
కమెడియన్ స్థాయి నుంచి వైవిధ్యభరితమైన కథానాయకుడిగా మారి, విలక్షణ నటనతో దక్షిణాదిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సూరి. ఇప్పుడాయన హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ఓ చిత్రం ప్రారంభమైంది.
కమెడియన్ స్థాయి నుంచి వైవిధ్యభరితమైన కథానాయకుడిగా మారి, విలక్షణ నటనతో దక్షిణాదిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సూరి (Soori). ‘విడుదల’, ‘గరుడన్’, ‘కొట్టుక్కాళి’ వంటి చిత్రాలతో నటుడిగా తిరుగులేని ప్రశంసలు అందుకున్న ఆయన, హీరోగా తన 7వ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన ‘మైత్రీ మూవీ మేకర్స్’ (Mythri Movie Makers) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ నూతన చిత్రం (#Soori7) తాజాగా పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైంది. ఈ పూజా వేడుకకు కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేసి, సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ.. ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. సూరితో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన ఈ వేడుకలో పాల్గొనడం విశేష ఆకర్షణగా నిలిచింది.
‘ఇంద్రు నేట్రు నాలై’ (టైమ్ ట్రావెల్ చిత్రం), ‘అయలాన్’ (సైన్స్ ఫిక్షన్) వంటి భారీ కాన్సెప్ట్ చిత్రాలతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆర్. రవికుమార్ (R. Ravi Kumar) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తనదైన సరికొత్త కథాంశంతో రవికుమార్ ఈ ప్రాజెక్ట్ను తెరకెక్కిస్తుండటంతో సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. మైత్రీ సంస్థ తమిళంలో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్లను లైన్లో పెడుతుండగా, అందులో సూరి-రవికుమార్ కాంబో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. సూరి సరసన రజిషా విజయన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను నిర్మాణ సంస్థ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.
ఇవి కూడా చదవండి:
ధనుష్ అభిమాన సంఘం పేరు మార్పు.. రాజకీయ ఎంట్రీపై మళ్లీ చర్చ
Rashmika: 400 పేద కుటుంబాలకు అండగా.. రష్మిక సంచలన నిర్ణయం
Kalki 2: నాగ్ అశ్విన్ ప్లాన్స్ వింటుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..