రూ. 10 కోట్లు రిటన్.. ‘డాన్ 3’ వివాదం ముగిసినట్టేనా?
ABN, Publish Date - Apr 22 , 2026 | 05:52 PM
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, ఫర్హాన్ అక్తర్‌ల మధ్య ‘డాన్ 3’ చిత్రానికి సంబంధించి నడుస్తున్న గొడవకు తెరపడినట్లుగా తెలుస్తోంది. అధికారిక అప్డేట్ రాలేదు కానీ, బాలీవుడ్ సర్కిల్స్‌లో ఇప్పుడిదే హాట్ టాపిక్ అవుతోంది.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh), ఫర్హాన్ అక్తర్‌ల మధ్య ‘డాన్ 3’ (Don 3) చిత్రానికి సంబంధించి నడుస్తున్న గొడవకు తెరపడినట్లుగా తెలుస్తోంది. రణ్‌వీర్ సింగ్ తీసుకున్న రూ. 10 కోట్ల అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చేయడానికి, అలాగే తను చేయబోతున్న తదుపరి చిత్రంలో ఫర్హాన్ అక్తర్ (Farhan Akhtar), ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్స్ (Excel Entertainments) నిర్మాణ సంస్థకు ‘వాటా’ ఇవ్వడానికి కూడా అంగీకరించినట్లుగా సమాచారం. అయితే ఈ వార్తలకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ, బాలీవుడ్‌లో మీడియా సర్కిల్స్‌లో మాత్రం ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా నడుస్తోంది. అసలు విషయం ఏమిటంటే..
‘ధురంధర్’ (Dhurandhar) సిరీస్ చిత్రాలతో తిరుగులేని స్టార్‌డమ్ అందుకున్న రణ్‌వీర్ సింగ్, అంతకు ముందు దర్శకుడు ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మాణ సంస్థలో ‘డాన్ 3’ చేయడానికి ఓకే చెప్పి, రూ 10 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారు. ఇదంతా 2023లో జరిగింది. కానీ, ‘ధురంధర్’ సిరీస్ చిత్రాలతో రణ్‌వీర్ సింగ్ స్థాయి మారిపోయింది. అందుకే, తన తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని భావించిన ఆయన, ‘డాన్ 3’ నుంచి తప్పుకున్నారు. దీంతో వివాదం మొదలైంది. రణ్‌వీర్ తీసుకున్న నిర్ణయంతో తమకు రూ. 40 కోట్ల నష్టం వాటిల్లిందని ఫర్హాన్ అక్తర్, నిర్మాణ సంస్థ న్యాయపరమైన గొడవకు దిగింది. ఈ వివాదం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా వరకు వెళ్లింది.
ఈ క్రమంలో రణ్‌వీర్ సింగ్ కూడా తన తరపు వాదనను వినిపించినా లాభం లేకపోయింది. దీంతో, రణ్‌వీర్ సింగ్ తీసుకున్న అడ్వాన్స్‌ను తిరిగి ఇవ్వడమే కాకుండా, తన తదుపరి యాక్షన్ చిత్రం ‘ప్రళయ్’లో ఫర్హాన్-రితేష్ సిధ్వానీలకు చెందిన ‘ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్’కు వాటా ఇవ్వడానికి కూడా అంగీకరించారట. ‘ధురంధర్ 2’ తర్వాత వచ్చిన క్రేజ్ దృష్ట్యా.. అనవసరమైన వివాదాలకు తావు లేకుండా చూసుకోవాలని రణ్‌వీర్ సింగ్ భావించడమే.. ఈ ఒప్పందానికి కారణం అని తెలుస్తోంది. ఈ విషయమై అటు రణవీర్ సింగ్.. ఇటు ఫర్హాన్ అక్తర్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
చిరంజీవి ఇంటికి సమీపంలోనే అల్లు అర్జున్ లగ్జరీ హౌస్.. ఎన్ని కోట్లంటే?
అలా విమర్శించే వారిని వదలకండి: చంద్రబాబుకు బండ్ల సూచన
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి సినిమాల్లోకి వచ్చిన సెలబ్రిటీలు వీరే!