Don 3: ధురంధర్ హిట్.. డాన్ 3 ని పక్కకు నెట్టేసిన రణవీర్

ABN , Publish Date - Jan 02 , 2026 | 09:00 PM

ప్రస్తుతం బాలీవుడ్ సర్కిల్స్ లో ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. అదే డాన్-3 (Don 3) హీరో మార్పు.. రణ్‌వీర్ సింగ్(Ranveer Singh) చేయాల్సిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లోకి గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) రాబోతున్నాడనే టాక్‌ బలంగా వినిపిస్తుంది.

Don 3

Don 3: సినిమా ఇండస్ట్రీలో శాశ్వత శత్రుత్వాలు ఉండవు.. అలాగే శాశ్వత మిత్రుత్వాలూ ఉండవు. ఇక్కడ కేవలం సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. ఒక్క విజయం రాత్రికి రాత్రే స్టార్‌డమ్ ని మార్చేస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ సర్కిల్స్ లో ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. అదే డాన్-3 (Don 3) హీరో మార్పు.. రణ్‌వీర్ సింగ్(Ranveer Singh) చేయాల్సిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లోకి గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) రాబోతున్నాడనే టాక్‌ బలంగా వినిపిస్తుంది.

బాలీవుడ్‌ గ్రీక్‌ గాడ్‌ హృతిక్ రోషన్ అంటేనే స్టైల్, యాక్షన్ కు కేరాఫ్ అడ్రస్. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. భారీ అంచనాలతో వచ్చిన వార్-2 బాక్సాఫీస్ వద్ద చతికిలపడటం హృతిక్ కెరీర్ లో ఊహించని దెబ్బ. దీని ఎఫెక్ట్ ఆయన సొంత ప్రాజెక్ట్ క్రిష్-4 పై స్పష్టంగా కనిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో తండ్రి రాకేష్ రోషన్ పర్యవేక్షణలో రూపొందాల్సిన ఈ సినిమా కమర్షియల్ లెక్కలు తేలక వెనకబడిపోయింది. హృతిక్ కు ఇప్పుడు అర్జంటుగా ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ కావాలి. తన ఉనికిని చాటుకోవడానికి ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్ కోసం ఆయన ఎదురుచూస్తున్నారు.

మరోవైపు రణ్‌వీర్ సింగ్ గ్రాఫ్ ఇప్పుడు ఇండియాలోనే టాప్ లెవల్లో ఉంది. ధురంధర్ సినిమాతో ఆయన సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కేవలం ఒక్క హిందీ భాషలోనే 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ దెబ్బతో రణ్‌వీర్ రేంజ్ భారీ స్థాయికి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఆయన దృష్టంతా ధురంధర్-2 పైనే ఉంది. వచ్చే ఏడాది మార్చి 19న రాబోతున్న ఈ సినిమా పెండింగ్ పనులను రణ్‌వీర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సినిమాపై ఉన్న విపరీతమైన అంచనాల వల్ల రణ్‌వీర్ తన డేట్స్ విషయంలో చాలా పక్కాగా వ్యవహరిస్తున్నారు.

అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. ధురంధర్ ఇచ్చిన హిట్‌ క్రేజ్‌తో రణ్‌వీర్ సింగ్ డాన్-3ని పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నట్లు బి-టౌన్ టాక్. ఫర్హాన్ అక్తర్ కలల ప్రాజెక్ట్ అయిన డాన్-3 ఇలా ఆలస్యం అవ్వడం ఆయనకు ఇష్టం లేదట. అందుకే ఈ పాత్రకు హృతిక్ రోషన్ అయితేనే పర్ఫెక్ట్ అని ఫర్హాన్ భావిస్తున్నారట. గతంలో డాన్-2లో హృతిక్ చేసిన చిన్న క్యామియో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలుసు. ఆ స్టైల్, ఆ స్వాగ్ హృతిక్ కు మాత్రమే సాధ్యం అయింది. ఇక ఫర్హాన్‌, హృతిక్‌కి మధ్య ఉన్న బాండింగ్ తో డాన్-3 నెక్స్ట్ లెవల్ కి వెళ్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. హృతిక్ ఫ్యాన్స్ కూడా తమ హీరోని మళ్ళీ ఆ రేంజ్ యాక్షన్ రోల్ లో చూడాలని కోరుకుంటున్నారు. రణ్‌వీర్ సింగ్ తప్పుకోవడం హృతిక్‌కు ఒక విధంగా వరంగా మారుతుందా? షారుఖ్ ఖాన్ వారసత్వాన్ని హృతిక్ నిలబెడతాడా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

Updated Date - Jan 02 , 2026 | 09:04 PM