Ranveer Singh: ఇండో-పాక్ అండర్ కవర్ ఆపరేషన్ బ్యాక్ డ్రాప్ లో...

ABN , Publish Date - Nov 18 , 2025 | 02:42 PM

ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'దురంధర్' చిత్రం డిసెంబర్ 5న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ నవంబర్ 18న ట్రైలర్ ను విడుదల చేశారు.

Dhurandhar Movie

తొలి చిత్రం 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' తో జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకుడిగా అవార్డును అందుకున్నాడు ఆదిత్య థర్. మళ్ళీ ఇంతకాలానికి అతని నుండి వస్తున్న రెండో సినిమా 'దురంధర్' (Dhurandhar). తొలి చిత్రం సాధించిన ఘనవిజయంతో సహజంగానే ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్ 5న ఈ సినిమా జనం ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా దీని ట్రైలర్ ను విడుదల చేశారు. 2000లో పాకిస్తాన్ కు వెళ్ళి హిజ్బుల్ ముజాహిద్దీన్ సభ్యుడిగా చెలామణి అయిన మేజర్ మోహిత్ శర్మ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుందనే ప్రచారం విశేషంగా జరుగుతోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ లో భారత్ లో పాకిస్తాన్ ఏజెంట్స్, పాకిస్తాన్ లో భారత్ ఏజెంట్స్ కార్యకలాపాల మధ్యే కథంతా సాగినట్టు అర్థమౌతోంది. రెండు దేశాలు ఎలా ఎత్తుకు పై ఎత్తు వేస్తే ప్రత్యర్థుల పాచికలు పారకుండా చేశాయనేది 'దురంధర్'లో చాలా ఇంటెన్స్ తో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించినట్టు అనిపిస్తోంది.


రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపుదిద్దుకున్న 'దురంధర్' సినిమాలో రణవీర్ సింగ్ (Ranveer Singh) హీరోగా నటించగా, ఐఎస్ఐ ఏజెంట్ మేజర్ ఇక్బాల్ గా అర్జున్ రామ్ పాల్ (Arjun Rampal), నేషనల్ సెక్యూరటీ అడ్వయిజర్ అజిత్ దోవల్ ను స్ఫురింప చేసే అజయ్ సన్యాల్ పాత్రలో మాధవన్ (Madhavan) నటించారు. అలానే ఎస్.పి. చౌదరి అస్లాం గా సంజయ్ దత్ (Sanjay Dutt), రహమాన్ దకాయ్ గా అక్షయ్ ఖన్నా (Akshaye Khanna) యాక్ట్ చేశారు. హై యాక్షన్ ఓల్టేజ్ కు ప్రాధాన్యం ఇస్తూనే దేశం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే ఏజెంట్స్ కథను ఆదిత్య ధర్ రూపొందించినట్టు తెలుస్తోంది. గడిచిన ఆరేడు సంవత్సరాలలో ఈ తరహా అండర్ కవర్ ఆపరేషన్ మీద చాలానే సినిమాలు వచ్చిన నేపథ్యంలో 'దురంధర్' ఏ మేరకు ఆకట్టుకుంటుందనే వేచి చూడాలి. ఇదిలా ఉంటే... ట్రైలర్ లోని హింసాత్మక సన్నివేశాల కారణంగా దీనికి ఏజ్ రిస్ట్రిక్షన్ ను యూ ట్యూబ్ విధించింది.

Updated Date - Nov 18 , 2025 | 03:27 PM