నా సోదరి ప్రేమను, అనురాగాన్ని మర్చిపోలేను- ఇళయరాజా
ABN , Publish Date - Apr 12 , 2026 | 10:25 PM
ఎప్పుడు చెన్నై వచ్చినా, నన్ను కలవకుండా వెళ్లేవారు కాదు.. సోదరి ఆశా భోంస్లే మరణవార్త నన్ను విచారానికి గురిచేసిందని అన్నారు మాస్ట్రో ఇళయరాజా. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్ వేదికగా ఆశా భోంస్లే నివాళులు అర్పిస్తూ, ఓ వీడియోను షేర్ చేశారు.
ఎప్పుడు చెన్నై వచ్చినా, నన్ను కలవకుండా వెళ్లేవారు కాదు.. సోదరి ఆశా భోంస్లే (Asha Bhosle) మరణవార్త నన్ను విచారానికి గురిచేసిందని అన్నారు మాస్ట్రో ఇళయరాజా (Maestro Ilaiyaraaja). ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్ వేదికగా ఆశా భోంస్లేకు నివాళులు అర్పిస్తూ, ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఆశా భోంస్లేతో తనకున్న అనుభవాలను షేర్ చేసుకుంటూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
‘‘ఈరోజు భారతీయ చలనచిత్ర ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సోదరి ఆశా భోంస్లే గారు కన్నుమూశారనే వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇది కేవలం ఇతరులకు చెప్పే ఒక సంతాప సందేశం మాత్రమే కాదు.. ఆమెకు నాపై ఎంతో ప్రేమ, అనురాగం ఉండేవి. అదే సమయంలో ఒక నేపథ్య గాయనిగా నా పట్ల ఆమె ఎంతో గౌరవంతో, ఆప్యాయతతో ఉండేవారు. ఆ జ్ఞాపకాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా జీవితంలో అత్యంత మరువలేని వ్యక్తులలో ఆశా భోంస్లే గారు ఒకరు. ఆమె ప్రతిభకు అంతులేదు.. ఏ ఇతర గాత్రాలతోనూ ఆమెను పోల్చలేం. ఆమెది ఒక విలక్షణమైన స్వరం.
అదేవిధంగా ఆమె ప్రతిభ కూడా ఎంతో విశిష్టమైంది. ఆమె మరణవార్త నన్ను చాలా విచారానికి గురిచేసింది. సుదీర్ఘ కాలంగా, ఆమె ఎప్పుడు చెన్నైకి వచ్చినా, ఏదైనా టీవీ ఇంటర్వ్యూ కోసం వచ్చినా సరే.. నన్ను కలవకుండా వెళ్ళేవారు కాదు. ఆ ప్రియమైన సోదరి చూపించిన ప్రేమను, అనురాగాన్ని నేను మర్చిపోలేను. ఆమె స్వరం ఈ చిత్ర ప్రపంచంలో ఎప్పటికీ మరువలేనిది. ఆమె గాత్రం చాలా విలక్షణమైంది. ఆ దేవుడు ఆమెకు ఒక ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించాలని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని ఇళయరాజా ఎమోషనల్ అయ్యారు.
ఇవి కూడా చదవండి:
సింగర్ మంగ్లీ కేసులో ట్విస్ట్.. ఇదంతా బిగ్‌బాస్ కోసమేనా?
లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే మృతి.. ప్రముఖుల నివాళులు
ఎం.ఎస్. రాజు రూటు మార్చారు.. ఈసారి నో ఫీలింగ్స్!
Chiranjeevi: చిరంజీవికి తప్పని వెయిటింగ్.. ఈ అడ్డంకులేంటి?
Venu Udugula: మంగ్లీ ఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు
UBS OTT: ఉస్తాద్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ వివరాలివే!