లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే మృతి.. ప్రముఖుల నివాళులు

ABN , Publish Date - Apr 12 , 2026 | 03:26 PM

భారతీయ సంగీత శిఖరం, పద్మ విభూషణ్, గాన కోకిల ఆశా భోంస్లే (92) ఆదివారం (ఏప్రిల్ 12) మధ్యాహ్నం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. శనివారం రాత్రి ఆమెకు గుండెపోటు, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తడంతో, కుటుంబ సభ్యులు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.

Tribute to Asha Bhosle

భారతీయ సంగీత శిఖరం, పద్మ విభూషణ్, గాన కోకిల ఆశా భోంస్లే (92) ఆదివారం (ఏప్రిల్ 12) మధ్యాహ్నం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. శనివారం రాత్రి ఆమెకు గుండెపోటు, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తడంతో, కుటుంబ సభ్యులు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఆమె వయసు రీత్యా పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉందనేలా వార్తలు వచ్చినప్పటికీ, ఆమె కోలుకుంటారని అంతా భావించారు. ప్రధాని మోదీ కూడా ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థించారు. ఇంతలోనే ఆమె అనంతలోకాలకు చేరుకున్నారు. ఆమె మరణ వార్త తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులెందరో సంతాపం వ్యక్తం చేస్తూ, ఆశా భోంస్లే (Legendary singer Asha Bhosle) ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.


‘‘భారతదేశపు అత్యంత ప్రసిద్ధ, బహుముఖ గాత్రాలలో ఒకరైన శ్రీమతి ఆశా భోంస్లే గారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. దశాబ్దాల కాలం పాటు సాగిన ఆమె విశిష్ట సంగీత ప్రయాణం మన సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేయడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని హృదయాలను తాకింది. ఆత్మను కదిలించే మధుర గీతాల నుంచి ఉత్సాహభరితమైన స్వరకల్పనల వరకు, ఆమె స్వరం ఎప్పటికీ మరువలేని అద్భుత ప్రకాశాన్ని మోసుకొచ్చింది. ఆమెతో నేను జరిపిన సంభాషణల జ్ఞాపకాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రియులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆమె భవిష్యత్ తరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటారు. అలాగే ఆమె పాటలు ప్రజల జీవితాల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి..’’ - ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)

‘‘ప్రముఖ గాయని ఆశా భోంస్లే గారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. లెజెండరీ మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆమె, సంగీత చరిత్రలోనే అత్యధిక పాటలు రికార్డ్ చేసిన కళాకారిణిగా గుర్తింపు పొందారు. ఏడు దశాబ్దాలకు పైగా సంగీత రంగానికి ఆమె అందించిన అసాధారణ సేవలు, ఎన్నో తరాలను అలరిస్తూ మరువలేని మధుర గీతాలను అందించాయి. ‘పద్మ విభూషణ్’ గ్రహీత అయిన ఆమె వారసత్వం భారతీయ సంగీత చరిత్రలో ఒక అంతర్భాగం. ఆమె స్వరం యుగయుగాల వరకు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆమె కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను..’’ - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu)

‘‘ప్రముఖ గాయని, జాతీయ పురస్కార గ్రహీత, పద్మ విభూషణ్ ఆశా భోస్లే గారు మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భారతీయ సంగీత రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలు, దశాబ్దాల పాటు పలు భాషల్లో ప్రదర్శించిన అపూర్వ ప్రతిభ చిరస్మరణీయం. ఆమె మరణం దేశంలోని సాంస్కృతిక, కళారంగాలకు తీరని లోటు. ఆశా భోస్లే గారి మరణం పట్ల ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రపంచానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను..’’ - సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)


‘‘భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఆశా భోంస్లే గారి స్వరం ఒక అద్భుతమైన ప్రయాణం. తరతరాలుగా ఆమె తన పాటలతో ఎన్నో భావోద్వేగాలను పండిస్తూ మనందరికీ తోడుగా నిలిచారు. ప్రతి పాటలోనూ ఆమె చూపించే ఆ అలవోకైన హుందాతనం, ఆ వైవిధ్యం నాకెప్పుడూ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. భారతీయ సినిమా ఒక వెలకట్టలేని మధుర స్వరాన్ని కోల్పోయింది. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి..’’ - చిరంజీవి (Chiranjeevi)

‘‘ప్రముఖ గాయని శ్రీమతి ఆశా భోంస్లే గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆశాజీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. సుదీర్ఘ కాలం హిందీతోపాటు మరాఠీ, తెలుగు, బెంగాలీ వంటి భాషల్లో సినీ గీతాలు ఆలపించిన మధుర గాయని ఆమె. పాశ్చాత్య సంగీత శైలి గీతాలను సైతం ఆలపించి ఒక తరం యువతను ఉర్రూతలూగించారు. దమ్ మారో దమ్, చురా లియా హై తుమ్నే, ఇన్ అంకో కి మస్తీ, రాధా కైసే న జలే… లాంటి గీతాలతో సినీ, సంగీతాభిమానులను అలరించారు. తెలుగులో ఆశాజీ పాడిన గీతాలు తక్కువే అయినా హిందీ గీతాలతో తెలుగు రాష్ట్రాల్లో చిరపరిచితమే. శ్రీమతి ఆశా భోంస్లే గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను..’’ - ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan)


‘‘ఆశా భోంస్లే గారి మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. దశాబ్దాల కాలం పాటు భారతీయ సినిమాకు ఆమె మధుర స్వరం ఒక గుండెచప్పుడులా నిలిచి, కోట్లాది మంది హృదయాలను హత్తుకుంది. ఆమె వదిలి వెళ్లిన గొప్ప సంగీత వారసత్వం రాబోయే తరతరాలకూ నిలిచి ఉంటుంది. ఆమెను ఎప్పటికీ గౌరవంతో, ప్రేమతో గుర్తుంచుకుంటాం. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి..’’ - జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)

Updated Date - Apr 12 , 2026 | 05:03 PM