సింగర్ మంగ్లీ కేసులో ట్విస్ట్.. ఇదంతా బిగ్‌బాస్ కోసమేనా?
ABN , Publish Date - Apr 12 , 2026 | 07:23 PM
సింగర్ మంగ్లీ కేసులో ఇప్పుడో ట్విస్ట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఆమె మీడియా ముందుకు వచ్చి, తనదేం తప్పులేదని, అసలు విషయం వేరే ఉందంటూ కొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు.
సింగర్ మంగ్లీ (Singer Mangli) పై కొన్ని రోజులుగా ఎలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయో తెలిసిందే. దాదాపు 100 మంది నుంచి మంగ్లీ, ఆమె సోదరుడితో పాటు కొంతమంది కలిసి భారీగా నిధులు వసూలు చేశారని, వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఇస్తామని ఆశ చూపించారని, తీరా డబ్బుల గురించి అడుగుతుంటే.. చంపుతామని బెదిరిస్తున్నట్లుగా వారిపై.. న్యాయవాది సుబ్బారావు (Subbarao) ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బీఎన్‌ఎస్ సెక్షన్ 351(2), 352 కింద మంగ్లీపై కేసు కూడా నమోదైంది. అయితే ఈ కేసులో ఇప్పుడో ట్విస్ట్ ఉన్నట్లుగా సింగర్ మంగ్లీ మాటలతో అర్థమవుతోంది. తాజాగా ఆమె మీడియా ముందుకు వచ్చి, తనదేం తప్పులేదని, అసలు విషయం వేరే ఉందంటూ కొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు.
‘‘నేను ఏ తప్పు చేయలేదు. నేను ఒక పాట చేస్తే ప్రజలు ఎందుకు ఇంతగా ఆశీర్వదిస్తున్నారు? ఎందుకు వందల మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి? మీ అందరూ ఎందుకు లైక్ చేస్తున్నారు? చెప్పండి, నాకేం అవసరం ఉందండి? అసలు నా వీడియో ఏదైనా ఉందా.. చూపించగలుగుతారా? ఆ ఫోటోలో ఉన్నది నా తమ్ముడు కాదు. ఆ కట్టలు లెక్కపెట్టే ఫోటోలో ఎవరున్నారండి? ఆ వీడియోలో డబ్బులు లెక్కపెడుతున్నది ఎవరు? అందులో నా తమ్ముడి ముఖం ఉందా? మాకు సంబంధం లేని విషయాన్ని మా మీద ఎందుకు రుద్దుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇది చాలా సెన్సిటివ్ మేటర్, మీడియాలో లేదా సోషల్ మీడియాలో ఏదైనా వేసేటప్పుడు కొంచెం ఆచి తూచి వెరిఫికేషన్ చేసుకొని వేయాలి.
నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా.. ఇందులో నా భాగస్వామ్యం ఉందంటే మీరు ఎక్కడికైనా రమ్మని చెప్పండి, నేను సిద్ధం. మీడియా మిత్రులందరికీ చెప్తున్నాను, ఈ కేసులో నా భాగస్వామ్యం లేదని తేలితే.. ఆ సుబ్బు అనే అడ్వకేట్‌ను మీరు ఏం చేస్తారో నాకు మాట ఇవ్వాలి. దానికి సిద్ధమా?. ఆయన నన్ను ఇంతగా మానసిక క్షోభకు గురిచేశాడు, హరాస్ చేస్తున్నాడు. ఎక్కడ చూసినా ‘మంగ్లీ.. మంగ్లీ..’ అని ఎందుకు నెగిటివిటీని ఇంత సెన్సేషనల్ చేస్తున్నారు? నేను మీడియాను తప్పు పట్టట్లేదు, నేను కూడా మీడియా ఫ్యామిలీ నుంచే వచ్చాను. ఇన్‌స్టాలో వచ్చే ఆ రీల్స్ మీ ఇంట్లో వాళ్ల మీద వస్తే మీరు ఎంత బాధపడతారో ఆలోచించండి.
నేను మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు, నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. ఆ అడ్వకేట్ కేవలం ఫేమస్ అవ్వడం కోసమే ఇదంతా చేస్తున్నాడు. ఆయన మాటలు మీరు గమనించండి. ‘నెక్ట్స్ బిగ్‌బాస్‌కు వెళతాను.. శ్రీముఖి అంటే నాకు క్రష్’ అని చెబుతున్నాడు. నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్‌కు వెళ్లాలనేది ఆయన ప్లాన్. నాతో మాట్లాడేటప్పుడు కూడా ‘మీతో ఫ్రెండ్షిప్ చేసుకుందామనుకుంటే.. మీరేంటి అహంకారంగా మాట్లాడుతున్నారు' అని అంటున్నాడు. కేసు పెడతామంటే గర్వంగా మాట్లాడకుండా ఎందుకు ఉంటారు? నేను తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా మాట్లాడుతున్నాను. ఆయన ఎంత వల్గర్ లాంగ్వేజ్ వాడుతున్నారో, ఎలా డిమాండ్ చేస్తున్నారో నా దగ్గర వీడియో ఆధారాలు ఉన్నాయి. నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నిన్ననే కర్ణాటకలో ఒక కాలేజీ ప్రోగ్రాం చేసి వచ్చాను. దయచేసి నా అప్డేట్స్ చూడండి’’ అని మంగ్లీ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే మృతి.. ప్రముఖుల నివాళులు
ఎం.ఎస్. రాజు రూటు మార్చారు.. ఈసారి నో ఫీలింగ్స్!
Chiranjeevi: చిరంజీవికి తప్పని వెయిటింగ్.. ఈ అడ్డంకులేంటి?
Venu Udugula: మంగ్లీ ఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు
UBS OTT: ఉస్తాద్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ వివరాలివే!