The Girlfriend: సమంతను అనుకోలేదు... రశ్మికే ఫస్ట్ ఛాయిస్...
ABN , Publish Date - Nov 01 , 2025 | 03:57 PM
'ది గర్ల్ ఫ్రెండ్' మూవీకి రశ్మిక మందణ్ణ రెమ్యూనరేషన్ తీసుకోలేదని, అందుకే కృతజ్ఞతాపూర్వంగా ఆమెకు రెట్టింపు రెమ్యూనరేషన్ ఇస్తున్నామని నిర్మాతలు ధీరజ్, విద్య చెబుతున్నారు.
నేషనల్ క్రష్ రశ్మిక మందణ్ణ నటిస్తున్న సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్'. దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 7న మూవీ జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాతలిద్దరూ తమ మనసులోని భావాలను మీడియాతో పంచుకున్నారు.
ముందుగా ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ, 'లాక్ డౌన్ టైమ్ లో థియేటర్స్ క్లోజ్ అయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ అందుబాటులోకి వచ్చాయి. ఆ టైమ్ లో స్క్రిప్ట్ డెవలప్ చేసే దశలో ఉన్నాం. థియేటర్స్ అన్నీ ఓపెన్ అయ్యాక ఈ సినిమాను థియేట్రికల్ గా రిలీజ్ చేయాలని అనుకున్నాం. మేము ఈ ప్రాజెక్ట్ టేకోవర్ చేసినప్పటి నుంచి థియేట్రికల్ గానే వెళ్లేందుకు ప్లాన్ చేశాం. ప్రొడ్యూసర్ గా కమర్షియల్ గా మూవీ ఉండాలని కోరుకుంటాం. కానీ మేము రిస్క్ చేసినా ఫర్వాలేదు అనేంత బాగా ఈ స్టోరీ నచ్చింది' అని అన్నారు. కో- ప్రొడ్యూసర్ విద్య గురించి చెబుతూ, 'ఆమెతో మంచి బాండింగ్ ఉంది. ప్రొడక్షన్ వైజ్ డెసిషన్స్ తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది రాలేదు. మనం లవ్ స్టోరీస్ ను ఎవరో ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి. ఈ కథ హీరోయిన్ కోణంలో ఉంటుంది. అలాంటప్పుడు స్టార్స్ ను ఈ మూవీకి హీరోగా తీసుకోలేం. పర్ ఫార్మర్స్ నే తీసుకోవాలి. దీక్షిత్ మంచి పర్ ఫార్మర్. రశ్మిక లాగే తన క్యారెక్టర్ లో ఆకట్టుకునేలా నటించాడు. ఈ ఏజ్ గ్రూప్ లో నాకు తెలిసిన వాళ్లలో దీక్షిత్ ఈ మూవీకి పర్పెక్ట్ అనిపించింది. సినిమా చూశాక అందరికీ అదే ఫీల్ కలుగుతుంది' అని చెప్పారు.
'ది గర్ల్ ఫ్రెండ్' మూవీని తామే సొంతంగా పంపిణీ చేస్తున్నామని, థియేట్రికల్ గా ఈ సినిమా బాగా వర్కౌట్ అవుతుందనే నమ్మకం ఉందని ధీరజ్ మొగలినేని చెప్పారు. కన్నడ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని దీక్షిత్ ను తాము తీసుకోలేదని, క్యారెక్టర్ కు అతను సెట్ అవుతాడనే తీసుకున్నామని చెప్పారు. నవంబర్ 7న ఈ సినిమాను కేవలం తెలుగు, హిందీ భాషల్లోనే రిలీజ్ చేస్తున్నామని, వారం తర్వాత 14వ తేదీ కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేస్తామని వివరణ ఇచ్చారు. ఈ సినిమా విడుదలకు ముందు ముంబైలో ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ సినిమాకు రశ్మిక రెమ్యూనరేషన్ తీసుకోలేదని, అందుకే కృతజ్ఞతా పూర్వకంగా ఆమెకు రెట్టింపు పారితోషికం ఇస్తున్నామని ధీరజ్ మొగిలినేని అన్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ ఇందులో మంచి పాత్ర చేసిందని, ఆమెది గెస్ట్ రోల్ కంటే పెద్ద పాత్ర అని చెబుతూ, మూవీ రిలీజ్ కు రెండు రోజుల ముందే ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.

మరో నిర్మాత విద్య కొప్పినీడి మాట్లాడుతూ, 'కథ విన్నప్పుడే మేము స్టోరీకి బాగా కనెక్ట్ అయ్యాం. ఇది రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ కాదు. ఈ సినిమా చూశాక ప్రతి ఒక్కరూ ఒక మెసేజ్ ను తీసుకుంటారు. ఇది కమర్షియల్ ఫార్మేట్ స్టోరీ కాకపోయినా రిస్క్ తీసుకోవాలని నేను, ధీరజ్ అనుకున్నాం, మా ఇద్దరికీ కథ బాగా నచ్చింది. సెన్సార్ వాళ్ల దగ్గర నుంచి డైరెక్టర్ కు నేషనల్ అవార్డ్ దక్కుతుందనే ప్రశంసలు వచ్చాయి' అని చెప్పారు. సినిమా షూటింగ్ ఆలస్యం కావడానికి కారణం వివరిస్తూ, 'ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా ఒక కాలేజ్ లో చేశాం. వర్కింగ్ డేస్ లో కాలేజ్ లు ఇవ్వరు. అప్పటికి రశ్మిక రెండు మూడు బిగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. వాటి షూటింగ్ వేరే సిటీస్ లో జరిగేది. దాంతో కొంత డేట్స్ వల్ల డిలే అయ్యింది కానీ మిగతా అంతా ఎలాంటి ఇబ్బంది లేకుండానే షూటింగ్ చేశాం. సినిమా షూటింగ్ చివరలో ఉండగా కార్మికుల సమ్మె వచ్చింది. సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది కాబట్టి మాకు పెద్దగా ప్రాబ్లమ్ కాలేదు' అని చెప్పారు.
బయట చాలామంది అనుకుంటున్నట్టు ఈ ప్రాజెక్ట్ సమంత తో చేయాలని తాము అనుకోలేదని, ఈ స్క్రిప్ట్ కు రశ్మిక కరెక్ట్ అనుకున్నామని, ఆమెకూ ఈ స్క్రిప్ట్ పర్సనల్ గా బాగా నచ్చిందని అందుకే స్క్రిప్ట్ విషయంలో ఆమె ఎలాంటి డిస్కషన్స్ జరగలేదని విద్య తెలిపారు. తమ తదుపరి ప్రాజెక్ట్ ను త్వరలోనే తెలియచేస్తామని, ఇప్పుడున్న పరిస్థితిలో ఒకటికి పదిసార్లు ఆలోచించే సినిమా ప్రారంభించాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
Also Read: Rashmika And Vijay: రీల్ లవ్ కాదు.. రియల్ లవ్ వేదికపైకి రాబోతుంది..
Also Read: Sunday Tv Movies: ఆదివారం, Nov 2.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు