Priyanka Arul Mohan: 'ఓజీ'తో నాది రెండున్నరేళ్ళ ప్రయాణం...
ABN , Publish Date - Sep 16 , 2025 | 03:40 PM
పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని గొప్పగా వర్ణించింది ఓజీ నాయిక ప్రియాంక అరుల్ మోహన్. ఆయన నిత్యం ప్రజల గురించే ఆలోచిస్తారని తెలిపింది. ఓజీతో తన ప్రయాణం దాదాపు రెండున్నరేళ్ళ పాటు సాగిందని ప్రియాంక అరుల్ మోహన్ తెలిపింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 'ఓజీ' (OG) చిత్రం ఈ నెల 25న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. ఇందులో హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) 'కన్మణి' అనే పాత్ర పోషించింది. ఈ పాత్రకు తన మనసులో ఓ ప్రత్యేక స్థానం ఉంటుందని ప్రియాంక చెబుతోంది. ఈ సినిమా విడుదల సందర్భంగా ఆమె తన మనసులోని మాటలను విలేకరుల సమావేశంలో వెలిబుచ్చింది.
'ఓజీ' మూవీ జర్నీ గురించి చెబుతూ, 'ఓజీతో దాదాపు రెండున్నరేళ్ల ప్రయాణం నాది. ఈ ప్రయాణాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు జెంటిల్ మేన్. అందరినీ సమానంగా చూస్తారు. ఆన్ స్క్రీన్ లో, ఆఫ్ స్క్రీన్ లో ఆయన రియల్ హీరో. 'ఓజీ' సినిమాలో కన్మణి పాత్ర చేయడం మరింత అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటిదాకా నేను చేసిన పాత్రల్లో ఇది నాకు చాలా ఇష్టమైన పాత్ర. ఈ పాత్రకి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానముంటుంది. ఇది 1980-90 లలో జరిగే కథ. పాత్రను మలిచిన తీరు కానీ, ఆహార్యం కానీ అప్పటికి తగ్గట్టుగానే ఉంటుంది. కన్మణి ఒక ఇన్నోసెంట్ స్వీట్ గర్ల్. గంభీర పాత్రతో గాఢమైన ప్రేమలో ఉంటుంది. గంభీర జీవితాన్ని మలుపు తిప్పే పాత్ర ఇది' అని తెలిపింది.
షూటింగ్ సమయంలో పవన్ తో ఏర్పడి అనుబంధం గురించి చెబుతూ, 'పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అనేది అవధులు లేనిది. నేను బెంగళూరులో ఉన్నప్పుడే ఆయన ఎంతటి క్రేజ్ ఉందో తెలుసు. అయితే ఆయనతో కలిసి నటిస్తున్నప్పుడు తెలిసిందే ఏంటంటే... నేను ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువ క్రేజ్ ఉంది. ఎంత క్రేజ్ ఉన్నా కూడా.. పవన్ గారు ఒదిగే ఉంటారు. డౌన్ టు ఎర్త్ పర్సన్. చాలా సింపుల్ గా ఉంటారు. ఆయన ఎక్కువగా పుస్తకాల గురించి మాట్లాడేవారు. ఆయన చదివిన కథలు, నవలల గురించి చెప్పేవారు. చరిత్ర గురించి మాట్లాడేవారు. అప్పుడప్పుడు సినిమాలు, రాజకీయాల గురించి కూడా మాట్లాడుతుండేవారు.ముఖ్యంగా ప్రజల గురించి ఎక్కువ ఆలోచించేవారు. ఇక షూటింగ్ విషయానికి వస్తే, సన్నివేశం షూట్ చేయడానికి ముందు దర్శకుడు, నటీనటులతో పవన్ కళ్యాణ్ గారు చర్చించేవారు. సినిమాకి ఉపయోగపడే పలు గొప్ప సూచనలు ఇచ్చేవారు. నటుడిగా కూడా ఆయన తన పాత్రను చాలా సులభంగా చేసేశారు. పవన్ గారి నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు అనిపించింది' అని చెప్పింది ప్రియాంక.
సినిమా గురించి మాట్లాడుతూ, 'పూర్తి సినిమా నేను ఇంకా చూడలేదు. అయితే కొన్ని సన్నివేశాలు చూశాను. విజువల్ గా చాలా బాగుంది. ఇది బేసికల్ గా యాక్షన్ మూవీనే అయినా... అది కొంత మేరకే... ఇందులో బలమైన కథతో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది. దర్శకుడు సుజిత్ (Sujith) కు ఆర్టిస్టుల నుండి నటన ఎలా రాబట్టుకోవాలో బాగా తెలుసు. నా క్యారెక్టర్, లుక్ బాగున్నాయంటే దానికి కారణం ఆయనే. ఇక డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ నాకు హోమ్ ప్రొడక్షన్ గా మారిపోయింది. ఈ బ్యానర్ లో వరుసగా రెండు సినిమాలు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నారు. నిజానికి నేను మొదట 'ఓజీ' సినిమానే అంగీకరించాను. కానీ, 'సరిపోదా శనివారం' చిత్రం ముందు విడుదలైంది. నిర్మాతలు దానయ్య గారు (DVV Danayya), కళ్యాణ్ గారు చాలా మంచి మనుషులు. వాళ్లంటే నాకు అపారమైన గౌరవం' ఉంది అని చెప్పింది. ప్రస్తుతం తెలుగులో కొన్ని కథలు వింటున్నానని, వేరే భాషల్లో కొన్ని సినిమాలు చేస్తున్నానని ప్రియాంక చెప్పింది.
Also Read: Kishkindhapuri: కిష్కింధపురికి మెగా సపోర్ట్..
Also Read: Prabhas, Prashanth Varma: ప్రభాస్, ప్రశాంత్ వర్మ.. కాంబినేషన్ రెడీ