Prabhas, Prashanth Varma: ప్ర‌భాస్, ప్ర‌శాంత్ వ‌ర్మ.. కాంబినేష‌న్ రెడీ

ABN , Publish Date - Sep 16 , 2025 | 02:41 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభం కానుందని సమాచారం.

Prabhas, Prashanth Varma

పాన్ వ‌ర‌ల్డ్‌ స్టార్‌గా జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న మ‌న రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే మారుతి దర్శకత్వంలో హర్రర్ కామెడీగా రూపొందుతోన్న రాజాసాబ్ (Raja Saab) త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుతండ‌గా, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ (Spirit), ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 2 (Salaar Part 2), హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడికల్ వార్ డ్రామా ఫౌజీ (Fauji), నాగ అశ్వీన్ క‌ల్కి పార్ట్‌2 (Kalki 2898 AD Part 2)సినిమాలు లైన్‌లో ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. మరో ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తోంది. హ‌నుమాన్ (Hanuman) సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న‌ దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma) తో ప్రభాస్ కొత్త సినిమా త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది. కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న ప్రశాంత్ వర్మ ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ విజువలైజేషన్ పనులను పూర్తి చేశాడని ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది. ప్రతి సీన్‌, ప్రతి క్యారెక్టర్‌, ప్రతి షాట్ ముందే డిజైన్ చేయబడి ఉన్నట్లు సమాచారం. దీంతో షూటింగ్ ప్రారంభమైన తర్వాత కూడా ఈ ప్రణాళిక ప్రకారం సమర్థంగా పని చేయగలరని అంటున్నారు.

ఈ సినిమాకు ప్రస్తుతం “బ్రహ్మ రాక్షస్” (Brahmarakshas) అనే వర్కింగ్ టైటిల్ వినిపిస్తోంది. అయితే, టైటిల్ మారే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘హను-మాన్’ సీక్వెల్ ‘జై హను-మాన్’ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాటిక్ యూనివర్స్‌లో ఇది రెండవ పెద్ద చిత్రం కావడం విశేషం.

‘కాంతార’ ఫేం రిషబ్ శెట్టి హనుమంతుడిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ప్రభాస్ అభిమానులు ఆయన ఈ కొత్త సినిమాతో మరోసారి భారీ విజయాన్ని అందిస్తాడని ఆశగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ ప్రారంభం కాగానే మరిన్ని అధికారిక వివరాలు వెలువడే అవకాశముంది.

Updated Date - Sep 16 , 2025 | 03:05 PM