Pawan Kalyan: 'ఓజీ' సీక్వెల్ కు సిద్థంకండి...
ABN, Publish Date - Sep 25 , 2025 | 01:03 PM
పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమా ఫ్యాన్స్ కు ఫీస్ట్ గా మారింది. పవన్ ఎలివేషన్స్ సీన్స్ కు ఇచ్చిన ప్రాధాన్యం దర్శకుడు సుజీత్ కథకు ఇవ్వలేదనే విమర్శ ఉన్నా... ఇప్పుడు దీనికి కూడా సీక్వెల్ ఉంటుందని మూవీ చివరిలో తెలిపారు. దానికి తగ్గట్టుగా లీడ్ ఇచ్చాడు దర్శకుడు సుజీత్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) డిప్యూటీ సీఎం అయిన వచ్చిన మొదటి సినిమా 'హరిహర వీరమల్లు' (Harihara Veeramallu). ఈ సినిమాను ఒక పార్ట్ లో తీయలేమని గ్రహించిన నిర్మాత ఎ. ఎం. రత్నం (A.M. Rathnam) విడుదలకు ముందే ఈ కథను రెండు భాగాలుగా తీస్తున్నామని, ప్రస్తుతం వస్తోంది కేవలం మొదటి భాగమే అని చెప్పేశారు. అయితే 'హరిహర వీరమల్లు' కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ దానికి సీక్వెల్ చేస్తాడా? లేదా? అనే సందేహం నెలకొంది. ఇదిలా ఉంటే... పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలైన రెండో సినిమా 'ఓజీ' (OG). గురువారం ఈ సినిమా జనం ముందుకు రాగా, బుధవారం రాత్రే భారీ ఎత్తున ప్రీమియర్ షోస్ వేసేశారు. వీటికి భారీ స్పందన రావడంతో ప్రీమియర్స్ తో కలిసి ఓపెనిండ్ డే కలెక్షన్స్ పాత రికార్డులను బ్రేక్ చేస్తాయనే ప్రచారం బాగా జరుగుతోంది.
చిత్రం ఏమంటే... 'హరిహర వీరమల్లు' నిర్మాత ఎ. ఎం. రత్నం తమ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ముందే ప్రకటించగా, 'ఓజీ' నిర్మాత డీవీవీ దానయ్య (DVV Danayya) మాత్రం సైలెంట్ కిల్లర్ మాదిరి ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా 'ఓజీ 2'కి సంబంధించిన ప్రకటన చేశారు. 'ఓజీ' సినిమా ఎండ్ టైటిల్ లో 'ఓజీ 2' అంటూ టైటిల్ కార్డ్ వేయడంతో పాటు దర్శకుడు సుజీత్ 'ఓజీ' సీక్వెల్ కు లీడ్ ఇచ్చాడు. ఓజస్ గంభీర ను ఒంటరిగా ఎదుర్కోలేనని గ్రహించిన జపాన్ అండర్ వరల్డ్ డాన్... దుబాయ్ లోనే కోబ్రాతో చేతులు కలిపి... ఓజీని అంతం చేయడానికి ప్రతిన బూనడంతో ఈ సినిమాకు ఎండ్ కార్డ్ పడింది.
అయితే... 'ఓజీ' సినిమా ఫ్యాన్స్ అండ్ యాక్షన్ మూవీస్ ను ఇష్టపడే వారికి మాత్రమే నచ్చుతుందని, ఫ్యామిలీ ఆడియెన్స్ కోరుకునే కథ, వినోదం ఇందులో లేకపోవడం మైనెస్ అని కొందరంటున్నారు. అంతే కాకుండా పండగ సీజన్ లో వచ్చిన ఈ సినిమాకు 'ఎ' సర్టిఫికెట్ ఇవ్వడం కూడా కొంత మేర నష్టాన్ని కలిగిస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే... ఈ మధ్య కాలంలో ఏ తెలుగు సినిమాకు రానంత హైప్ 'ఓజీ'కి వచ్చింది. దానికి తోడు తెలుగు సినిమా రంగం మొత్తం 'ఓజీ' సినిమాను ఓన్ చేసుకుని, ప్రమోట్ చేయడం బాగా కలిసి వచ్చింది. 'ఓజీ'లోని పవన్ కళ్యాణ్ ఎలివేషన్ షాట్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుంటే... ఈ యేడాది ద్వితీయార్థంలో 'ఓజీ' మూవీ రావడం ఆనందాన్ని కలిగిస్తోందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. 'హరిహర వీరమల్లు' సీక్వెల్ ను ఒక వేళ పవన్ కళ్యాన్ పక్కన పెట్టినా... 'ఓజీ' సీక్వెల్ ను విస్మరించడానికి వీలులేని పరిస్థితి ఏర్పడిందని వారు అంటున్నారు. మరి ఇప్పటికే అంగీకరించిన సినిమాలను పూర్తి చేసి... 'ఓజీ' సీక్వెల్ ను పవన్ ఎప్పుడు పట్టాలెక్కిస్తాడో చూడాలి.
Also Read: Nagarjuna: వాటిని అడ్డుకోండి.. ఢిల్లీ హైకోర్టుకు నాగార్జున
Also Read: Jailer 2: రజనీకాంత్ జైలర్ 2.. రిలీజ్ డేట్ ఫిక్స్