Nagarjuna: వాటిని అడ్డుకోండి.. ఢిల్లీ హైకోర్టుకు నాగార్జున
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:50 AM
తెలుగు సినీ హీరో నాగార్జున తన అనుమతి లేకుండా ఫోటో, పేరు వాడకుండా నిలిపివేయాలంటూ ఢిల్లీ హైకోర్టుకు పిటీషన్ దాఖలు చేశారు.
తెలుగు సినీ పరిశ్రమలో అగ్రనటుడిగా గుర్తింపు పొందిన అక్కినేని నాగార్జున తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటో, వాయిస్ లేదా ఇతర వ్యక్తిగత అంశాలను వాడుకోవడాన్ని అడ్డుకోవాలని ఆయన పిటీషన్‌లో కోరారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో, ప్రకటనల్లో, అలాగే ఆన్‌లైన్ వేదికల్లో ప్రముఖుల పేర్లు, ఫోటోలు విస్తృతంగా వాడుకలోకి వస్తున్నాయి. అవి తప్పుదారి పట్టించేలా లేదా మోసపూరిత వ్యవహారాల్లో ప్రముఖుల ప్రమేయం లేకుండానే ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన "పర్శనాలిటీ రైట్స్" (Personality Rights) రక్షణ కోసం నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఇదే తరహా కేసుల్లో గతంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా కోర్టును ఆశ్రయించారు. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్ వంటి తారలు తమ అనుమతి లేకుండా తమ పేరును, ఫోటోను వాడరాదని డిమాండ్ చేశారు. అప్పట్లో ఢిల్లీ హైకోర్టు ఆ వినియోగాన్ని నిషేధిస్తూ తాత్కాలిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కాగా.. నాగార్జున దాఖలు చేసిన పిటీషన్‌ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేజస్ కారియా విచారించారు. ఈ సందర్భంగా ఆయన పర్శనాలిటీ రైట్స్ ప్రాముఖ్యతపై చర్చ జరిపి, వినియోగదారుల హక్కులు, సెలబ్రిటీల వ్యక్తిగత హక్కుల మధ్య సమతుల్యం అవసరమని వ్యాఖ్యానించినట్లు సమాచారం.
పర్శనాలిటీ రైట్స్ అనేది ఒక వ్యక్తి యొక్క పేరు, రూపం, వాయిస్, శైలి వంటి అంశాలను వాణిజ్య ప్రయోజనాల కోసం అనుమతి లేకుండా వాడరాదనే హక్కు. సినీ తారలకే కాకుండా, ప్రముఖ క్రీడాకారులు, రాజకీయ నేతలు కూడా ఈ హక్కులను కాపాడుకోవడానికి కోర్టును ఆశ్రయించడం తరచూ జరుగుతోంది. ఇదిలాఉంటే.. తాజా నాగార్జున పిటీషన్ ఈ తరహా అంశంపై మరోసారి వార్తల్లోకి వచ్చింది.ఈ నేటి డిజిటల్ యుగంలో ఫేక్ ప్రమోషన్స్, స్కామ్‌లతోపాటు పేర్లు, ఫోటోలు దుర్వినియోగం ఎక్కువవుతున్న నేపథ్యంలో కోర్టు తీర్పు ఎటు వైపు ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.