OG Movie Review: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' మూవీ రివ్యూ
ABN , Publish Date - Sep 24 , 2025 | 09:11 PM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన 'హరిహర వీరమల్లు' సినిమా మొదటగా విడుదలైంది. అయితే భారీ అది ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలంతా గ్యాంగ్ స్టర్ డ్రామా 'ఓజీ' (OG Movie) మీదనే ఆశలు పెట్టుకున్నారు.
సినిమా రివ్యూ : 'ఓజీ' (OG Movie Review)
విడుదల తేదీ: 25-9-2025
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన 'హరిహర వీరమల్లు' సినిమా మొదటగా విడుదలైంది. అయితే భారీ అది ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలంతా గ్యాంగ్ స్టర్ డ్రామా 'ఓజీ' (OG Movie) మీదనే ఆశలు పెట్టుకున్నారు. వాస్తవానికి 'హరిహర వీరమల్లు' సినిమా కంటే కూడా మొదటి నుండి 'ఓజీ' మీదనే అందరికీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసమే కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా జనం ముందుకు వచ్చింది. మరి యంగ్ డైరెక్టర్ సుజీత్ తో డీవీవీ దానయ్య నిర్మించిన 'ఓజీ' వారి అంచనాలకు తగ్గట్టుగా ఉందో లేదో తెలుసుకుందాం...
OG Story:
ఓజెస్ గంభీర (పవన్ కళ్యాణ్) జపాన్ లో ఓ దాడి నుండి తప్పించుకుని యుక్తవయసులో ఇండియాకు షిప్ లో బయలుదేరతాడు. అందులో సత్యా దాదా (ప్రకాశ్ రాజ్)పై అటాక్ జరిగితే... ఓజీ రక్షిస్తాడు. దాంతో సత్యదాదా ఓజీని తనతో పాటు ముంబై తీసుకెళ్ళిపోతాడు. అక్కడ అండర్ వరల్డ్ డాన్ గా సత్యాదాదా పేరు తెచ్చుకుంటాడు. అతనికి కుడి భుజంగా ఓజీ నిలుస్తాడు. ఓ హార్బర్ ను బేస్ చేసుకుని సత్యదాదా తన సామ్రాజ్యాన్ని విస్తరింప చేస్తాడు. ఇద్దరు కొడుకులున్న సత్య దాదా ఓజీని తన మూడో కొడుకుగా భావిస్తుంటాడు. అయితే అనుకోని అవాంతరం కారణంగా సత్య దాదా కుటుంబాన్ని వీడి ఓజీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ డాక్టర్ కన్మణి (ప్రియాంక అరుల్ మోహన్) ని పెళ్ళి చేసుకుంటాడు. ఎప్పుడైతే ఓజీ ముంబైని విడిచి వెళ్ళిపోతాడో అప్పుడు సత్యాదాదా ఒకప్పటి స్నేహితుడైన పొలిటీషియన్ మిరాజ్ కర్ (తేజ్ సప్రూ) కొడుకులు జిమ్మీ (సుదేవ్ నాయర్), ఓమీ (ఇమ్రాన్ హష్మీ) అండర్ వరల్డ్ పై పట్టు బిగించే ప్రయత్నం చేస్తారు. ఈ సమయంలో కొడుకులిద్దరినీ పోగొట్టుకున్న సత్య దాదాకు ఓజీ అవసరం పడుతుంది. మరి సత్యా దాదా కోసం ఓజీ తిరిగి ముంబైకి వచ్చాడా? మిరాజ్ కర్ కొడుకులకు ఓజీ ఎలా బుద్థి చెప్పాడు? ముంబై అండర్ వరల్డ్ ను ఒకప్పుడు గడగడలాడించిన ఓజీ అసలు ఎందుకు అజ్ఞాతం లోకి వెళ్ళాల్సి వచ్చింది? చేయని తప్పుకు ఓజీ తనకు తానే ఎందుకు శిక్ష వేసుకున్నాడు? దాని పర్యవసానం ఏమిటనేది? మిగతా కథ.
విశ్లేషణ:
ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో గడిచిన యాభై యేళ్ళలో వివిధ భాషల్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ రకంగా చూస్తే 'ఓజీ' కోసం సుజీత్ రాసుకున్న కథేమీ కొత్తది కాదు. ఈ నేపథ్యంలో అనేక కథలు వచ్చాయి. అయితే... హీరో, విలన్ తో పాటు ఇతర పాత్రలకు సుజీత్ ఇచ్చిన ఎలివేషన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. జపాన్ లో కథ మొదలు కావడంతో ఏదో కొత్త విషయాన్ని సుజీత్ చెప్పబోతున్నాడనే భావన ఆడియెన్స్ కు కలుగుతుంది. జపాన్ నుండి ముంబై మహా నగరానికి వచ్చిన తర్వాత సత్యదాదా నేర సామ్రాజ్యాన్ని ఓజీ విస్తరింప చేయడం, పేరరల్ గవర్నమెంట్ ను నడింపించే వరకూ అది వెళ్ళడం ఆసక్తికరంగా ఉంది. రొటీన్ అండర్ వరల్డ్ స్టోరీగా ఇది పైకి కనిపించినా... సుజీత్ తనదైన మార్క్ స్క్రీన్ ప్లే తో లేయర్స్ గా ఈ కథను నడిపిన తీరు ఆకట్టుకుంటుంది. సత్యా దాదా కుటుంబానికి ఓజీ దూరం కావడం, అజ్ఞాతంలో అతను గడిపిన జీవితం, భార్యతో అనుబంధం, కూతురు కోసం పరితపించే సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటాయి. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ సాగే బ్లడ్ షెడ్ ఒకింత అసహనానికి గురి చేసినా... షార్ప్ ఎడిటింగ్ కారణంగా అదేమంత పెద్ద అవరోధంగా అనిపించదు. 1993లో ముంబై నగరాన్ని కుదిపేసిన బాంబ్ బ్లాస్ట్ ఇన్సిడెంట్ ను జ్ఞప్తికి తెచ్చేలా ఈ కథను సుజీత్ రాసుకున్నాడు. క్యారెక్టర్స్ ఎలివేషన్స్ మీద పెట్టిన శ్రద్థ సుజీత్ అండ్ టీమ్ స్టోరీ మీద పెట్టలేదని తెలిసిపోతోంది. కథ మరింత బలంగా ఉండి ఉంటే 'ఓజీ' రేంజ్ మరింత పెరిగి ఉండేది.
నటీనటుల విషయానికి వస్తే... పవన్ కళ్యాణ్ ఎంట్రీ కాస్త ఆలస్యంగా జరిగినా... స్టోరీలో మిక్స్ చేసిన విధానం ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. పవన్ కళ్యాణ్ తెర మీద కనిపించే ప్రతి సీన్ 'హై' లో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దాంతో ఫ్యాన్స్ కు పూనకాలు రావడం ఖాయం. నాన్ చాక్ తో పవన్ కళ్యాణ్ చేసే ఫస్ట్ ఫైట్ చూస్తే... కెరీర్ ప్రారంభంలో పవన్ చేసిన యాక్షన్ సీన్స్ గుర్తొస్తాయి. అలానే క్లయిమాక్స్ లో చేతిలోకి తీసుకునే ఆయుధానికి 'జానీ' పేరు పెట్టడం కూడా ఫాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించేదే. ఈ సినిమాలో పవన్ తర్వాత ఖచ్చితంగా మాట్లాడాల్సింది శ్రియారెడ్డి గురించి. సత్యా దాదా కోడలిగా పౌరుషానికి ప్రతీక అన్నట్టుగా శ్రియారెడ్డి... గీత పాత్రను పోషించింది. అండర్ వరల్డ్ డాన్ పాత్రలు ప్రకాశ్ రాజుకు కొట్టినా పిండే అయినా... మరింత మెచ్యూరిటీతో దీన్ని పోషించారు. ఇమ్రాన్ హష్మీ స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్. ఈ మధ్య వచ్చిన 'రజాకార్' మూవీలో సర్దార్ పటేల్ గా నటించిన తేజ్ సప్రూ ప్రధాన ప్రతినాయకుడిగా యాక్ట్ చేశారు. ప్రియాంక అరుల్ మోహన్ కు లిమిటెడ్ స్క్రీన్ స్పేస్ లభించినా... మెరుగైన నటన ప్రదర్శించింది. ఇతర ప్రధాన పాత్రలను సుదేవ్ నాయర్, అర్జున్ దాస్, అభిమన్యుసింగ్, 'కిక్' శ్యామ్, వెంకట్, హరీశ్ ఉత్తమన్, ఉపేంద్ర లిమాయే, శుభలేఖ సుధాకర్ తదితరులు పోషించారు. అజయ్ ఘోష్, జీవా, రాహుల్ రవీంద్రన్, సుహాస్, శ్రీకాంత్ అయ్యంగార్, సమ్మెట గాంధీ కూడా తెర మీద కనిపిస్తారు. జాకీష్రాఫ్ ఒకే ఒక్క సీన్ లో మెరపులా మెరిశాడు.
బేసికల్ గా ఓజీ సినిమాను నిలబెట్టింది నటీనటులే కాదు... చీఫ్ టెక్నీషియన్స్ కూడా. తమన్ ఎప్పటి లానే తన ఆర్. ఆర్.తో కట్టి పడేశాడు. పవన్ కళ్యాణ్ తో తను వర్క్ చేసిన 'వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో' సినిమాలకు మించి పోయేలా నేపథ్య సంగీతం అందించాడు. రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస బెస్ట్ సినిమాటోగ్రఫీ అందించారు. నవీన్ నూలీ తన ఎడిటింగ్ తో మెస్మరైజ్ చేశాడు. వీఎఫ్ఎక్స్ కూడా బాగుంది. డీవీవీ దానయ్య ఖర్చుకు వెనకాడలేదనే విషయం ప్రతి ఫ్రేమ్ లో తెలుస్తోంది. సుజీత్ ఓ ఫ్యాన్ బోయ్ గా ఈ సినిమాను తీశాడనేది అర్థమౌతోంది. ఓపెనింగ్ నుండి ఎండింగ్ వరకూ నాన్ స్టాప్ గా సాగే యాక్షన్ సీన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఏ మేరకు అలరిస్తాయో చెప్పలేం కానీ యాక్షన్ మూవీస్ ఇష్టపడే వారికి 'ఓజీ' దసరా డబుల్ థమాకా అని చెప్పొచ్చు. (OG Movie)
ట్యాగ్ లైన్: ఓజీ ఊచకోత!
రేటింగ్ : 3/5