Kantara Chapter1: అలా అయితే కష్టం.. కోర్టుకు రిషబ్ 'కాంతార' బృందం
ABN, Publish Date - Sep 17 , 2025 | 01:17 PM
రిషభ్ శెట్టి 'కాంతార' బృందం కర్ణాటకలో కోర్టు తలుపు తట్టింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం టిక్కెట్ రేట్లపై నియంత్రణ విధించడాన్ని ప్రశ్నిస్తూ రిషభ్ శెట్టి కోర్టుకెళ్ళారు.
'కాంతార' (Kanthara) సినిమా జాతీయ స్థాయిలో ఘన విజయం సాధించిన నేపథ్యంలో భారీ బడ్జెట్ తో దానికి ప్రీక్వెల్ గా 'కాంతార చాప్టర్ 1' మూవీని రిషభ్ శెట్టి (Rishabh Shetty) తెరకెక్కించారు. అక్టోబర్ 2న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే ఇటీవల కర్ణాటక ప్రభుత్వం సినిమా టిక్కెట్ రేట్లను నియంత్రిస్తూ ఓ జీవోను జారీ చేసింది. దాని ప్రకారం మల్టీ ప్లెక్స్ థియేటర్ల టిక్కెట్ రేట్లు సైతం రూ. 200 లకు మించి ఉండటానికి వీలులేదు. ఇదిప్పుడు అమలు అవుతోంది కూడా. మల్టీప్లెక్స్ థియేటర్లలో ఇప్పుడు అత్యధికంగా టిక్కెట్ ధర రూ. 236 మాత్రమే ఉంది. ఇప్పుడున్న టిక్కెట్ రేట్లపై తమ చిత్రాన్ని ప్రదర్శించలేమని 'కాంతార' బృందం భావిస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాలకు జాతీయ స్థాయిలో టిక్కెట్ రేట్లను పెంచుకునే ఆస్కారం ఉంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో అది అమలులో ఉంది. ప్రభుత్వాన్ని కలిసి, తమ కష్టం గురించి చెప్పగానే సహజంగానే వారు టిక్కెట్ రేట్లను మొదటి పది రోజులకో లేదా వారం రోజులకో పెంచుకునే సౌలభ్యాన్ని కల్పిస్తున్నారు. దాంతో పెద్ద సినిమాలన్నీ ఎలాంటి టాక్ వచ్చినా... గుడ్డిలో మెల్ల మాదిరి కొంతలో కొంత బయటపడుతున్నాయి.
అయితే కర్ణాటక ప్రభుత్వం టిక్కెట్ రేట్ల నియంత్రణపై తీసుకున్న ఈ కఠిన నిర్ణయం కారణంగా భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలందరికీ నష్టం చేకూరుతుందని భావిస్తున్నారు. దీంతో 'కాంతార' టీమ్ కోర్టును అప్రోచ్ అయ్యింది. ఇప్పటికే జస్టిస్ రవి వి హోస్మని వాదనలను విన్నారు. అలానే పీవీఆర్ ఐనాక్స్ సైతం టిక్కెట్ రేట్లను నిర్ణయించే అధికారం ఎగ్జిబిటర్స్ కే ఉండాలని వాదిస్తోంది. సింగిల్ స్క్రీన్స్ తో పోల్చితే మల్టిప్లెక్స్ థియేటర్ల మెయిన్ టైనెన్స్ ఖర్చు ఎక్కువ అవుతుందని, అందువల్ల రూ. 200లతో భారీ బడ్జెట్ సినిమాలను ప్రదర్శించడం కష్టమని వారు వాదిస్తున్నారు. అయితే... తుది తీర్పు వెలువడే లోపు... 'కాంతార' మూవీకి ఇబ్బందిలేకుండా మధ్యంతర ఉత్తర్వులను కోర్టు ఇచ్చే ఆస్కారం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే... కర్ణాటక నుండి గతంలో వచ్చిన పాన్ ఇండియా మూవీస్ కు రికార్డులను 'కాంతార -1' అధిగమించే ఆస్కారం ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో!
Also Read: Mirai: హీరో, డైరెక్టర్ కు కార్ గిఫ్ట్...
Also Read: Wednesday Tv Movies: బుధవారం, Sep17.. టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే