Mahavatar Narsimha: సంచలనం సృష్టిస్తోన్న.. నరసింహవతారం! భజనలు, కీర్తనలతో హంగామా
ABN, Publish Date - Jul 28 , 2025 | 11:09 AM
హోంబలే సంస్థ తెరకెక్కించిన యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహ థియేటర్లలో సంచలనం సృష్టిస్తోంది.
కేజీఎఫ్ (KGF), కాంతారా (Kantara), సలార్ (Salaar) వంటి భారీ హిట్. చిత్రాలను నిర్మించిన హోంబలే సంస్థ (Hombale Films), క్లీమ్ ప్రొడక్షన్స్ (Kleem Productions)తో కలిసి తెరకెక్కించిన యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహ (Mahavatar Narsimha). మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తొలి చిత్రం. శుక్రవారం పలు భాషల్లో విడుదలైంది. యానిమేటెడ్ విజువల్స్ తో ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కించారు. అందరికీ తెలిసిన కథే అయినప్పటికీ.. భారతీయ సంస్కృతికి అద్దం పట్టే పురాణ గాథలను సరికొత్త సాంకేతిక సహాయంతో తెర పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. యానిమేషన్ మూవీ కావడంతో పాత్రలతోనూ, ఆ భావోద్వేగాల తోనూ మరింత కనెక్ట్ అయ్యేలా దృష్టి సారించారు.
అయితే ఇప్పుడీ చిత్రం విడుదలైన అన్నిభాషల్లో, అన్ని ప్రాంతాల్లో పెను సంచలనమే సృష్టిస్తోంది. ఎలాంటి హంగులు, ఆర్భాటం లేకుండా సైలెంట్‌గా హరిహరవీరమల్లు వంటి భారీ చిత్రానికి పోటీగా థియేటర్లకు వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మొదటి రెండు రోజులు ఎలాంటి హంగామా, చప్పుడు లేకుండా ఉన్న ఈ సినిమాకు మూడో రోజు నుంచి అన్ని భాషల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చాలామంది చెప్పులు విడిచి థియేటర్లలో సినిమాలు చూస్తుండడం విశేషం. అంతేగాక మూవీ అనంతరం, మధ్యలో కొంతమంది విజిల్స్ వేస్తుండగా చాలామంది ఓ గ్రూపుగా చేరి థియేటర్లలోనే విష్ణు భజనలు, కీర్తనలు పాడుతూ మైమరిచి పోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో పబ్లిక్ మౌత్ టాక్ అంతకంతకూ పెరుగుతూ వందల మంది సినిమా చూడడం కోసం క్యూ కడుతున్నారు. బుక్ మై షోలో అయితే వీరమల్లును మించి టికెట్లు బుక్ అవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యంగా మూవీలో.. వారాహవతారం, భూదేవిని చూపించిన తీరు, ప్రహ్లాదుడిని ఏనుగులతో తొక్కి చంపించేందుకు చేసే ప్రయత్నాలు, హోలిక ఎపిసోడ్, నరసింహాతారంతో కూడిన పతాక సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచాయని ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. ఆయా సన్నివేశాల్లో విజువల్ గ్రాండ్నెస్ ఆకట్టుకుంటుందని, సాంకేతిక విభాగాల్లో సంగీతం మరో ఎత్తయితే, శ్యామ్ సీఎస్ నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రాణం పోసిందని వారంటున్నారు. అశ్విన్ కుమార్ స్క్రీన్ ప్లే రచన, దర్శకత్వం మెప్పించేలా ఉందని, తెలిసిన కథే అయినా చాలా ఆసక్తికరంగా చెప్పారని ప్రేక్షకులు తమ సామాజిక మాద్యమాల్లో పోస్టులు పెడుతున్నారు, కామెంట్లు చేస్తున్నారు. నిర్మాణంగా ఉన్నతంగా తీర్చిదిద్దడంతో పాటు చిన్నారులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళే చిత్రంగా రూపొందించారని ఇది కుటుంబాలు కుటుంబాలు కలిసి చూడాల్సిన సినిమా అని, ప్రధానంగా పిల్లలకు ఈ మహావతార్ నరసింహ (Mahavatar Narsimha) సినిమా ఎంతో నేర్పిస్తుందని అంటున్నారు.
Also Read.. ఇవి కూడా చదవండి