సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Raja Babu: నవ్వుల 'రాజా'... ఈ బాబు...

ABN, Publish Date - Aug 09 , 2025 | 04:22 PM

రాజబాబు చిన్న వయసులోనే కన్నుమూయడం తెలుగు సినిమా హాస్యానికి పెద్ద లోటు అనే చెప్పాలి. కమెడియన్ గానే కాకుండా హీరోగానూ రాజబాబు అర్థవంతమైన సినిమాలలో నటించి, మెప్పించారు.

Raja Babu

అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. హాస్యంతో అలరిస్తూ రాజబాబు (Rajababu) గా జనం మదిలో నిలిచారు. రాజబాబు హాస్యంతో తెలుగునాట బోలెడు నవ్వుల పువ్వులు పూశాయి. ఈ నాటికీ అవి హాస్యంతో నిండిన వాసనలు వెదజల్లుతూనే ఉన్నాయి. 1970లలో రాజబాబు 'స్టార్ కమెడియన్'గా ఓ వెలుగు వెలిగారు. ఆ నాటి మేటి హీరోల స్థాయిలో పారితోషికం అందుకున్న సందర్భాలూ ఉన్నాయి. అప్పట్లో రాజబాబు తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల పెదాలపై నవ్వులు నాట్యం చేసేవి. తనదైన నడకతో, జేబులు వెదుక్కుంటూ, తల గోక్కుంటూ రాజబాబు హాస్యం పండించారు. 'కామెడీ కింగ్' గా రాజబాబు సాగే రోజుల్లోనే ఆయన కథానాయకునిగా 'తాత-మనవడు, తిరపతి, ఎవరికి వారే యమునాతీరే, పిచ్చోడి పెళ్ళి, మనిషి రోడ్డున పడ్డాడు' వంటి చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) దర్శకునిగా పరిచయమవుతూ రూపొందించిన 'తాత-మనవడు' బిగ్ హిట్. ఇందులో రాజబాబు సరసన విజయనిర్మల (Vijaya Nirmala) నాయికగా నటించడం విశేషం!


బడిపంతులుగా జీవితం ఆరంభించిన రాజబాబుకు నాటకాలంటే మహాపిచ్చి. ఇంట్లో పెద్దవాడు కావడంతో కొన్నాళ్ళు టీచర్ గా పనిచేశారు. తరువాత నాటకాల్లో పేరు సంపాదించి, చిత్రసీమవైపు అడుగులు వేశారు. అక్కడే అప్పలరాజు కాస్తా రాజబాబుగా మారిపోయారు. అడ్డాల నారాయణరావు రూపొందించిన 'సమాజం' (1960) చిత్రంతో తెరకు పరిచయమయ్యారు రాజబాబు. యన్టీఆర్ (NTR), ఏయన్నార్ (ANR), కృష్ణ (Krishna), శోభన్ బాబు (Sobhan Babu) అందరి చిత్రాలతోనూ రాజబాబు తనదైన హాస్యంతో మురిపించారు. వాణిశ్రీ (Vanisri) కూడా రాజబాబు సరసన జోడీ కట్టి కొన్ని చిత్రాల్లో హాస్యం పంచారు. రాజబాబుకు హిట్ పెయిర్ అంటే రమాప్రభ అనే చెప్పాలి. వారిద్దరూ కలసి అనేక చిత్రాలలో తమదైన హాస్యంతో మురిపించారు. స్టార్ కమెడియన్ గా బాగా సంపాదించే రోజుల్లో నాటకరంగానికి తనవంతు సేవలు అందించారు రాజబాబు. ఆ సమయంలో రాజబాబును, ఆయన భార్య లక్ష్మీ అమ్మలును ఘనంగా సన్మానించింది ఓ నాటక అకాడమీ. రంగస్థలంపై అప్పటికే ఎంతో పేరు సంపాదించిన జె.వి. సోమయాజులు చేతుల మీదుగా రాజబాబు దంపతులకు సన్మానం జరిగింది.


రాజబాబు భార్య లక్ష్మీ అమ్మలుకు శ్రీశ్రీ రెండో సతీమణి సరోజ స్వయానా అక్క. ప్రముఖ గాయని రమోల లక్ష్మికి చెల్లెలు. ఇక రాజబాబు సొంత సోదరులు చిట్టిబాబు, అనంత్ కూడా చిత్రసీమలో కమెడియన్స్ గా రాణించారు. చిత్రసీమలో రాజబాబు, హీరో శోభన్ బాబుతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఇద్దరూ ఒకరినొకరు 'బావా' అంటూ పిలుచుకొనేవారు. రాజబాబు చిన్న వయసులోనే కన్నుమూయడం తెలుగు సినిమా హాస్యానికే తీరనిలోటుగా నిలచింది. ఈ నాటికీ రాజబాబు సినిమాలు బుల్లితెరపై ప్రసారమయ్యే సమయంలో ఆయనను తలచుకొనే అభిమానులు ఎందరో ఉన్నారు.

Also Read: Raksha bandhan: అన్నలతో నిహారిక స్పెషల్ బాండింగ్

Also Read: Mahesh Charity: మహేశ్‌ గురించి గూగుల్‌ని అడిగిన ప్రశ్నలివే

Updated Date - Aug 09 , 2025 | 04:22 PM